మెగాస్టార్ తో ‘పుష్ప 2’ టీం మంతనాలు
చిరు కరుణిస్తాడా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2’ మూవీ మరికొన్ని గంటలో థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా అల్లు – మెగా అభిమానుల మధ్య ఏర్పడ్డ గ్యాప్ హాట్ టాపిక్ గా ఇప్పుడు మారింది. మెగా ఫ్యాన్స్ పూర్తిగా ‘పుష్ప 2’ సినిమాను పక్కన పెట్టేశారు. దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరైతే, సమస్యలన్నీ సద్దుమణిగినట్టేనని నిర్మాతలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే మరికాసేపట్లో చిరంజీవితో “పుష్ప 2” నిర్మాతలు మంతనాలు జరపబోతున్నట్టుగా తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి తాను స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా, మెగా కాంపౌండ్ నుంచి దాదాపు అరడజను మంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి కారణమయ్యారు. అందులో ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు. ఆయనకంటూ టాలెంట్ ఉన్నప్పటికీ మెగా కాంపౌండ్ నుంచి కాలు పెట్టడంతో… అల్లు అర్జున్ కు కూడా మెగా హీరో అని ట్యాగ్ ఉండేది ఒకప్పుడు. ఇక ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న తర్వాత అల్లు అర్జున్ మెగా ట్యాగ్ ను పక్కన పడేసి, ఐకాన్ స్టార్ అంటూ పాన్ ఇండియా రేంజ్ లో దూసుకెళ్లాడు. అయితే ఈ నేపథ్యంలో అప్పుడప్పుడు ఏర్పడిన విభేదాల కారణంగా మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ కు గ్యాప్ ఏర్పడిందని పుకార్లు షికారులు చేశాయి.
పైగా ఇటీవల ఎలెక్షన్స్ లో పవన్ కు అల్లు అర్జున్ సపోర్ట్ చేయకపోవడం, చిరు, చరణ్ లకు బర్త్ డే విషెస్ చెప్పకపోవడం, ఏ ఈవెంట్ లోనూ మెగా ప్రస్తావన తీసుకురాకపోవడం, ‘మట్కా’ ఈవెంట్ లో వరుణ్ తేజ్ ఇన్ డైరెక్ట్ సెటైర్లు, సాయి తేజ్ బన్నీని అన్ ఫాలో చేయడం వంటివి చూశాక మెగా ఫ్యాన్స్ రెచ్చిపోవడం స్టార్ట్ చేశారు. ఈ వార్తలపై అటు మెగా ఫ్యామిలీ గాని, ఇటు అల్లు అర్జున్ గాని ఎప్పుడూ డైరెక్ట్ గా స్పందించలేదు. తమ మధ్య అంతా బాగానే ఉంది అన్నట్టుగా కవర్ చేస్తున్నారు. కానీ తాజాగా అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప 2’ మూవీ రిలీజ్ కు మరికొన్ని గంటలు మాత్రమే ఉన్నప్పటికీ, మెగా ఫ్యామిలీ నుంచి కానీ… మెగా అభిమానుల నుంచి కానీ సపోర్ట్ రాకపోవడం నిర్మాతలను నిరాశపరిచింది.
గతంలో అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే మెగా అభిమానుల సందడి ఎక్కువగా కనిపించేది. కానీ తాజాగా నెలకొన్న పరిస్థితుల్లో నేపథ్యంలో ‘పుష్ప 2’ మూవీపై మెగా ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపించట్లేదని, ముఖ్యంగా ప్రీమియర్ షోల విషయంలో అస్సలు పట్టించుకోవట్లేదని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యాన్స్ ను కూల్ చేయడానికి ఇప్పటికే అల్లు అరవింద్ తో పాటు బన్నీ వాసు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ‘పుష్ప 2’ నిర్మాతలు చిరంజీవిని కలిసి, ఈరోజు హైదరాబాద్లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో భారీ ఎత్తున నిర్వహించబోయే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆహ్వానించబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి చిరంజీవి ‘పుష్ప 2’ మేకర్స్ రిక్వెస్ట్ కు కరుణిస్తారా? అల్లు అర్జున్ ని పెద్దమనసు చేసుకొని ఆశీర్వదిస్తారా? అనేది తెలియాలంటే మరి కాసేపు ఆగాల్సిందే.