Sunday, November 24, 2024

కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు, ఇండస్ట్రీయల్ కారిడార్

  • నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే మా ధ్యేయం
  • వామపక్ష ప్రతినిధులతో సిఎం రేవంత్ రెడ్డి

కొడంగల్ లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదని, ఇండస్ట్రీయల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలో యువత,మహిళలకు ఉపాధి కల్పించడమే తన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. సిఎం రేవంత్ రెడ్డిని సచివాలయంలో వామపక్ష పార్టీల ప్రతినిధుల బృందం శనివారం కలిసింది. లగచర్ల ఘటనకు సంబంధించి ఆ ప్రతినిధుల బృందం సిఎంకు వినతిపత్రం అందజేసింది.

ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కుట్ర చేసిన వాళ్లనును వదిలిపెట్టమని, అమాయక రైతులపై పెట్టిన కేసుల విషయాన్ని పరిశీలిస్తామని ఆయన తెలిపారు. కొడంగల్ ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి తన బాధ్యత అని ముఖ్యమంత్రి తెలిపారు. సొంత నియోజకవర్గ ప్రజలను తాను ఎందుకు ఇబ్బంది పెడతానని సిఎం పేర్కొన్నారు. కొడంగల్‌లో కాలుష్యరహిత పరిశ్రమలే ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. భూసేకరణ పరిహారం పెంపును కూడా పరిశీలిస్తామని సిఎం రేవంత్ స్పష్టం చేశారు.

నాలుగు గ్రామాల్లోని రైతులపై నిర్బంధకాండను నిలిపి వేయాలి: వామపక్ష నాయకులు
సిఎంను కలిసిన అనంతరం వామపక్ష పార్టీల ప్రతినిధులు విలేకరులతో మాట్లాడూత లగచర్ల ఫార్మా పరిధిలోని నాలుగు గ్రామాల్లోని రైతులపై నిర్బంధకాండను నిలిపి వేయాలన్నారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి చేయాలని, జైల్లో ఉన్న రైతులను బేషరతుగా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, లగచర్ల ఘటనపై సమగ్ర జుడీషియల్ విచారణ జరపాలని, దోషులను గుర్తించి చర్యలు తీసుకోవాలని, అమాయకులను వదిలివేయాలని తాము ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసినట్టు వారు తెలిపారు.

రైతుల అనుమతి లేకుండా బలవంతపు భూసేకరణ చేయరాదని, వ్యవసాయానికి ఉపయోగపడే వ్యవసాయ భూముల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటును విరమించుకోవాలని, గ్రామాల్లో వరి కోత యంత్రాలకు అనుమతులివ్వాలని ఆయన కోరారు. ఫార్మా కంపెనీకి పడావుగా ఉన్న కొడంగల్ దొరల సీలింగ్ భూములు 1,156 ఎకరాలను తీసుకునే విషయం పరిశీలించాలని, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రైతుల సమ్మతి లేకుండా భూములు తీసుకోవద్ధని వారు డిమాండ్ చేశారు.

ఫార్మా కంపెనీ కోసం ప్రభుత్వం 1,273. 24 ఎకరాల భూసేకరణ
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు ఏదో గ్యారంటీ స్వేచ్ఛ, ప్రజాస్వామ్య పునరుద్ధరణ చర్యలు లగచర్లలో చేపట్టాలన్నారు. ప్రజలకు ధైర్యం ఇచ్చే విధంగా స్వేచ్ఛా వాతవరణం కల్పించాలని వారు కోరారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని లగచర్ల తదితర గ్రామాలలో ఫార్మాసిటీ పేర భూసేకరణ ప్రయత్నాలు, ఆ సందర్భంగా జరిగిన ఘటనల నేపథ్యంలో బాధిత ప్రజలను నేరుగా కలిసి వాస్తవాలు తెలుసుకునేందుకు పది వామపక్ష పార్టీల ప్రతినిధి బృందం) నవంబర్ 21వ తేదీన ఆ గ్రామాల్లో పర్యటించిందని, ప్రజలను కలిసి పలు విష యాలు తమ బృందాలు తెలుసుకున్నాయని వాస్తవ విషయాలను సిఎం దృష్టికి తీసుకెళ్లామని వారు తెలిపారు. పోలేపల్లి, హాకీంపేట్, పులిచర్లగుంట తండా, రోటి బండ తండా గ్రామాల్లో ఫార్మా కంపెనీ కోసం ప్రభుత్వం 1,273. 24 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని వామపక్ష నేతలు పేర్కొన్నారు.

కలెక్టర్ పట్ల కొందరు దురుసుగా
నవంబర్ 11వ తేదీన లగచర్ల గ్రామానికి జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు వెళ్లడంతో కొందరు కలెక్టర్ పట్ల దురుసుగా ప్రవర్తించారని ప్రజలు చెప్పినట్లు వామపక్ష పార్టీల ప్రతినిధులు తెలిపారు. అదేరోజు అర్ధరాత్రి పోలీసులు ఆ గ్రామాలపై దాడి చేసి ఇళ్లలో చొరబడి మగవారిని అరెస్టులు చేస్తూ, మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారని, తాకరాని చోట్ల తాకారని ప్రజలు తమతో చెప్పి బాధను వ్యక్తం చేశారని వారు వివరించారు. వారిని అరెస్టు చేసిన వివిధ స్టేషన్లలో పెట్టి చిత్రహింసలకు గురిచేస్తున్నారని, ఇప్పటికీ 26 మందిని అరెస్టు చేశారని వామపక్ష నేతలు పేర్కొన్నారు.

సిఎంను కలిసిన వారిలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు, పోటు రంగారావు (సిపిఐ ఎంఎల్ మాస్‌లైన్), గాంగోని రవి (ఎంసిపిఐ(యు), సాదినేని వెంకటేశ్వర రావు (సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ), పోటు సూర్యం (సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసి), జానకి రాములు (ఆర్‌ఎస్‌పి), సిహెచ్ మురహరి (ఎస్‌యుసిపి(సి), మామిండ్ల రమేష్ రాజా (సిపిఐ ఎంఎల్ లిబరేషన్, ప్రసాదన్న (సిపిఐ ఎంఎల్) తదితరులు ఉన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular