NTR Biopic Review

NTR Biopic Movie Review
య‌న్‌.టి.ఆర్‌. జీవితాన్ని బ‌యోపిక్‌గా ప్ర‌క‌టించగానే `అది సాధ్య‌మా?` అని కొంద‌ర‌నుకుంటే, `అంద‌రికీ తెలిసిందేగా` అని మ‌రికొంద‌రు అనుకున్నారు. మ‌రి అంద‌రికీ తెలిసిన ఆ క‌థ‌ను క్రిష్ ఎలా తెర‌పై చూపించారు? `మహాన‌టి`లో చూపించిన‌ట్టు పాత సినిమాల స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌ను యథాత‌థంగా తీశారా? మ‌రింక ఎలా చేశారు?  పైగా య‌న్‌.టి.ఆర్‌ని ఫ్యామిలీ ప‌ర్స‌న్‌గా చూపించే చిత్ర‌మ‌నీ ప్ర‌చారం జ‌రిగింది. అదంతా సినిమాలోనూ సాధ్య‌మైందా? `య‌న్‌.టి.ఆర్‌` క‌థానాయ‌కుడు – మ‌హానాయ‌కుడు రెండు పార్ట్ లు. తొలి భాగం `క‌థానాయ‌కుడు` బుధ‌వారం విడుద‌లైంది. ఈసినిమా విశేషాలు..
చిత్రం: య‌న్టీఆర్ కథానాయకుడు
సంస్థలు: ఎన్‌బీకే ఫిల్స్మ్‌, వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా
తారాగ‌ణం: న‌ంద‌మూరి బాలకృష్ణ, విద్యాబాలన్‌, క‌ల్యాణ్ రామ్‌, ద‌గ్గుబాటి రాజా, సుమంత్‌, ప్ర‌కాష్‌రాజ్‌, ముర‌ళీశ‌ర్మ‌, క్రిష్‌, సాయిమాధ‌వ్ బుర్రా, రానా,  భరత్‌రెడ్డి,  వెన్నెల కిషోర్‌, పూనమ్‌ బాజ్వా, నరేష్‌, రవికిషన్‌, శుభలేఖ సుధాకర్‌, రవిప్రకాష్‌, చంద్ర సిద్ధార్థ, భానుచందర్‌,  దేవి ప్రసాద్‌ తదితరులు
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
కెమెరా: జ్ఞానశేఖర్‌ వీఎస్‌
మాట‌లు: బుర్రా సాయిమాధవ్‌
ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌:  ఎం.ఆర్‌.వి. ప్ర‌సాద్‌
స‌హ నిర్మాత‌లు:  సాయి కొ్ర్ర‌పాటి విష్ణు ఇందూరి
నిర్మాత‌లు:  నంద‌మూరి వ‌సుంధ‌రా దేవి, నంద‌మూరి బాల‌కృష్ణ‌
ర‌చ‌నా స‌హ‌కారం:  డా. ఎల్ . శ్రీనాథ్‌
ర‌చ‌న‌-దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
క‌థ‌:
బ‌స‌వ‌తార‌కం (విద్యాబాల‌న్‌) మ‌ద్రాసులోని అడ‌యార్ కేన్స‌ర్ ఇన్‌స్టిట్యూట్‌లో చికిత్స పొందుతుంటుంది. ఆమెకు తోడుగా ఉండ‌మ‌ని నంద‌మూరి తార‌క‌రామారావు (బాల‌కృష్ణ‌) త‌న త‌న‌యుడు హ‌రికృష్ణ (క‌ల్యాణ్‌రామ్‌)ను పంపిస్తాడు. త‌న పిల్ల‌ల స‌మ‌క్షంలో య‌న్‌.టి.ఆర్‌.  ఆల్బ‌మ్‌ను తిర‌గేస్తుంది బ‌స‌వ‌తార‌కం. ఆమె కోణంలో నుంచి య‌న్‌.టి.ఆర్ జీవిత చ‌రిత్ర మొద‌ల‌వుతుంది. రామారావు కి రిజిస్ట్రార్ ఆఫీసులో ఉద్యోగం వ‌స్తుంది. అక్క‌డ లంచాన్ని ఆయ‌న త‌ట్టుకోలేడు. దాంతో త‌న‌కు న‌చ్చిన సినిమా రంగానికి వెళ్తాడు. `మ‌న‌దేశం`తో ప్రారంభ‌మైన ఆయ‌న ప్ర‌స్తానం ఎన్ని మ‌లుపులు తీసుకుంది? జ‌నంలోకి వ‌చ్చిన ఆయ‌న జ‌నానికి ఏం చేశాడు? వ‌ంటి వివ‌రాల‌తో సినిమాసాగుతుంది. తెలుగుదేశం పార్టీ ప్ర‌క‌ట‌న‌తో పూర్త‌వుతుంది.
ప్ల‌స్ పాయింట్లు
– బాల‌కృష్ణ‌, విద్యాబాల‌న్, సుమంత్‌, క‌ల్యాణ్‌రామ్‌, ద‌గ్గుబాటి రాజా త‌దిత‌రుల‌ న‌ట‌న‌
– కీర‌వాణి సంగీతం
– సాహి సురేశ్ ఆర్ట్ డిపార్ట్ మెంట్‌
– జ్ఞాన‌శేఖ‌ర్ కెమెరా
– మేక‌ప్‌, కాస్ట్యూమ్స్
– డైర‌క్ష‌న్‌
మైన‌స్ పాయింట్లు
– నిడివి కాస్త ఎక్కువ‌గా ఉండ‌టం
– యంగ్ య‌న్టీఆర్‌గా క‌నిపించిన‌ప్పుడు బాల‌కృష్ణ ఇప్ప‌టి వయ‌సు క‌నిపించ‌డం
విశ్లేష‌ణ‌
క‌థానాయ‌కుడు సినిమా ప్ర‌తి ఫ్రేమూ ఆక‌ట్టుకుంటుంది. మ‌న క‌ళ్ల ముందు జ‌రిగిన విష‌యాలు, అంతో ఇంతో మ‌న‌కు అవ‌గాహ‌న ఉన్న చ‌రిత్ర‌ను తెర‌మీద ఒక్క సినిమాలో కుదించి చెప్ప‌డం క‌త్తిమీద సామే. అందులోనూ మాస్ ఇమేజ్‌, మాస్ ఫాలోయింగ్ అమితంగా ఉన్న య‌న్‌.టి.ఆర్‌. జీవితాన్ని గురించి చెప్ప‌డం మ‌రింత ఇబ్బందే. అయితే అంత‌టి క‌ష్ట‌మైన ప‌నిని కూడా న‌ల్లేరు మీద న‌డ‌క‌లా సాగించేశారు క్రిష్‌. ఈ చిత్రాన్ని ఇన్ని త‌క్కువ రోజుల్లో ఇంత క్లారిటీగా, క్వాలిటీగా తెర‌కెక్కించినందుకు క్రిష్‌కు, ఆయ‌నకు స‌హ‌క‌రించిన ప్రొడ‌క్ష‌న్‌, డైర‌క్ష‌న్ టీమ్‌, రైటర్స్ ను ముందుకుగా అభినందించాలి. ఏవో నాలుగు స‌న్నివేశాల‌ను మ‌క్కికి మ‌క్కి కాపీ కొట్టి తీసిన‌ట్టు ఈ చిత్రాన్ని తీయ‌లేదు. టీమ్ ప‌డ్డ శ్ర‌మ‌, చేసిన కృషి తెలుస్తోంది. ఇన్ని వేరియ‌స్ గెట‌ప్పుల్లో బాల‌కృష్ణ న‌టించ‌డం కూడా అభిమానుల‌కు క‌నుల పండుగే. శ్రీకృష్ణుడు, అల్లూరి సీతారామరాజు, బొబ్బిలిపులి వంటి గెట‌ప్పుల్లో బాల‌కృష్ణ చాలా చ‌క్క‌గా మెప్పించారు. పెళ్ల‌యిన కొత్త‌లో, పిల్ల‌ల త‌ల్లిగా, నిండు చూలాలిగా, బిడ్డ‌ను పోగొట్టుకున్న మాతృమూర్తిగా, వ‌య‌సు పెరుగుతున్న క్ర‌మంలో ఆలోచ‌నా ధోర‌ణిలో మార్పు క‌లిగిన స్త్రీగా, ఎల్ల‌ప్పుడూ త‌న భ‌ర్త‌ను క‌నిపెట్టుకుని ఉండే ఇల్లాలిగా, కేన్స‌ర్ పేషెంట్‌గా.. ప‌లు యాంగిల్స్ లో విద్యాబాల‌న్ న‌ట‌న మెప్పిస్తుంది. ఆమెకు డ‌బ్బింగ్ చెప్పిన తీరు కూడా ఆక‌ట్టుకుంటుంది. కీర‌వాణి పాట‌లు, నేప‌థ్య సంగీతం రెండూ సినిమాకు హైలైట్‌. దివిసీమ ఉప్పెన‌, రాయ‌ల‌సీమ క‌రువు క‌ర‌కు గుండెల్ని కూడా క‌రిగించేలా తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావునే నేరుగా చూస్తున్నామా అన్న‌ట్టు న‌టించారు సుమంత్‌. నాగేశ్వ‌ర‌రావు, ఎన్టీఆర్ మ‌ధ్య స‌ఖ్య‌త ఎలా ఉండేది?  వాళ్లు పంచుకున్న ఆలోచ‌న‌ల తాలూకు ప్ర‌భావం ఎలా ఉండేది?  ఇరు కుటుంబాల మ‌ధ్య రాక‌పోక‌ల మాటేమిటి? వ‌ంటివ‌న్నీ ఈ చిత్రంలో ఉన్నాయి. అంతేకాదు.. న‌టీన‌టుల మ‌ధ్య బాంధ‌వ్యాల మాట‌, సెట్లో కూర్చున్న వాళ్లు చెప్పుకునే క‌బుర్లు.. ఇలా చాలా విష‌యాల మీదే ఫోక‌స్ పెట్టారు. అయితే ఏదీ అతి కాలేదు. త‌క్కువా కాలేదు. గంగిగోవు పాలు గ‌రిటెడైనా చాల‌న్న‌ట్టు ప్ర‌తి పాత్ర‌కూ న్యాయం ఉంది ఈ సినిమాలో. ప్ర‌తి శాఖా చేసిన ప‌ని తెర‌మీద క‌నిపిస్తుంది ఈ చిత్రంలో. లోపాల‌ను వెత‌కాల‌ని కూర్చున్నా కూడా పెద్ద‌గా ప‌ట్టుకోవ‌డానికి లోపాలు క‌నిపించ‌వు. ఎన్టీఆర్ ఆలోచ‌నా విధానాన్ని, తెలుగువారి కోసం ఆయ‌న ఆలోచించిన తీరును చెబుతుంది. స‌గ‌టు ప్రేక్ష‌కుల‌ను కూడా అమితంగా ఆక‌ట్టుకునే ఈ సినిమా అభిమానుల‌కు నిజ‌మైన సంక్రాంతిని తెస్తుంది.
బాట‌మ్ లైన్‌:  `య‌న్‌.టి.ఆర్‌`ఇమేజ్‌కి త‌గ్గ చిత్రం
రేటింగ్‌: 3.5/5
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article