NTR Mahanayakudu Reviews and Rating
యన్.టి.ఆర్. జీవితాన్ని బయోపిక్‌గా ప్రకటించగానే `అది సాధ్యమా?` అని కొందరనుకుంటే, `అందరికీ తెలిసిందేగా` అని మరికొందరు అనుకున్నారు. మరి అందరికీ తెలిసిన ఆ కథను క్రిష్ ఎలా తెరపై చూపించారు? ఆయన రియల్ లైఫ్లోజరిగినట్లు సన్నివేశాల చిత్రీకరణను యథాతథంగా తీశారా? మరింక ఎలా చేశారు? పైగా యన్.టి.ఆర్ని ఫ్యామిలీ పర్సన్‌గా చూపించే చిత్రమనీ ప్రచారం జరిగింది. అదంతా సినిమాలోనూ సాధ్యమైందా? ఇలా చాలా ప్రశ్నలు వినపడ్డాయి. ఎన్టీఆర్ జీవితాన్ని ఏదో సింపుల్‌గా చూపేయాలనుకోవడం కాకుండా ఆయన సినిమా ప్రస్థానాన్ని `యన్.టి.ఆర్` కథానాయకుడు`గా రూపొందించి విడుదల చేశారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోనూ ప్రభంజనమే. ఎందుకంటే 9 నెలల్లో పార్టీని స్థాపించి విజయం సాధించి ముఖ్యమంత్రి కావడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆయన రాజకీయ ప్రస్థానంలో ముఖ్యమంత్రి అయిన ఆయన సంక్షోభాన్ని దాటి మళ్లీ ముఖ్యమంత్రి ఎలా అయ్యారనే కాన్సెప్ట్‌తో `యన్.టి.ఆర్ మహానాయకుడు` చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈసినిమా విశేషాలు..
చిత్రం: యన్టీఆర్ మహానాయకుడు
సంస్థలు: ఎన్బీకే ఫిల్స్మ్, వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా
తారాగణం: నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, కల్యాణ్ రామ్, దగ్గుబాటి రాజా, సచిన్ ఖేడేకర్, సమీర్, పృథ్వీ, సుమంత్, భరత్‌రెడ్డి, వెన్నెల కిషోర్, పూనమ్ బాజ్వా, ప్రకాష్‌రాజ్, మురళీశర్మ, క్రిష్, మంజిమ మోహన్, నరేష్, రవికిషన్, శుభలేఖ సుధాకర్, రవిప్రకాష్, చంద్ర సిద్ధార్థ, భానుచందర్, దేవి ప్రసాద్ తదితరులు
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
కెమెరా: జ్ఞానశేఖర్ వీఎస్
మాటలు: బుర్రా సాయిమాధవ్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.ఆర్.వి. ప్రసాద్
సహ నిర్మాతలు: సాయి కొ్ర్రపాటి విష్ణు ఇందూరి
నిర్మాతలు: నందమూరి వసుంధరా దేవి, నందమూరి బాలకృష్ణ
రచనా సహకారం: డా. ఎల్ . శ్రీనాథ్
రచన-దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
కథ:
తెలుగుదేశం పార్టీని ప్రకటించిన ఎన్టీఆర్ ఆ పార్టీ జెండా, ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటారు. అయితే ఎన్నికలకు పెద్ద సమయం ఉండదు. కాబట్టి చైతన్యరథాన్ని సిద్ధం చేసి ప్రజల్లోకి వెళ్లారు. చైతన్య రథసారథిగా హరికృష్ణ ఉన్నారు. అప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయాలతో విసిగిపోయిన తెలుగు ప్రజలు ప్రత్యామ్యాయం కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటి తరుణంలో ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో రాజకీయాల్లోకి రావడంతో ప్రజలకు పెద్ద ఆసరా దొరికినట్లు అయ్యింది. అందరూ ఆయనకు నీరాజనం పడతారు. ఆయన పార్టీ 202 స్థానాలతో విజయం సాధిస్తుంది. ఎన్టీఆర్ నిరుద్యోగం కాస్త తగ్గించాలని తీసుకున్న ఉద్యోగుల వయోపరిమితి తగ్గింపు చట్టం వల్ల ఆయనకు ప్రజల్లో నిరసన వస్తుంది. దీంతో ఆయన వెనకడుగువేస్తారు. అంతే కాకుండా అవినీతికి పాల్పడ్డ తన పార్టీ ఎమ్మెల్యేలపై కూడా చర్యలు తీసుకోవడంతో పార్టీలోని కొందిరికి అసంతృప్తి ఏర్పడుతుంది. అదే సమయంలో తన భార్య బసవ తారకంకు క్యాన్సర్ రావడం.. దాని నివారణ కోసం, తన గుండె ఆపరేషన్ కోసం ఎన్టీఆర్ అమెరికా వెళ్లారు. ఇదే అదనుగా భావించి, నాదెండ్ల భాస్కర్‌రావు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఓ లేఖ రాసి సంతకాలు పెడతారు. దాన్ని అవిశ్వాస తీర్మానంగా మార్చేస్తాడు. దాంతో తనే సీఎం అని ప్రకటించుకుంటాడు. అమెరికా నుండి వచ్చిన ఎన్టీఆర్ ఆ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొన్నారు? అనేదే సినిమా కథాంశం.
విశ్లేషణ:
ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ సూట్ అయ్యారు. ఎన్నికలు ప్రచారంలో రామారావు ఎలా ప్రచారం చేశారు? చైతన్య రథంతో ప్రజలను ఎలా చైతన్య పరిచారు? అనే సన్నివేశాలను చక్కగా చూపిస్తే.. వాటిలో బాలకృష్ణ అందంగా నటించారు. ఇక బసవ తారకంకు క్యాన్సర్ ఉందని తెలిసినప్పుడు వారి మధ్య సాగే ఎమోషన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అలాగే సంక్షోభ సమయంలో జరిగే పొలిటిక్ డ్రామా ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే చంద్రబాబు పాత్రధారిగా నటించిన రానా.. వందశాతం పాత్రకు న్యాయం చేశారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు సంక్షోభ సమయంలో ఎంత క్రియాశీలకంగా వ్యవహరించారనే విషయాలను బాగా చూపించారు. విద్యాబాలన్ ఈ సినిమాలో ఎక్కవ ఎమోషన్ సీన్స్‌లో నటించారు. సుమంత్ రెండు సీన్స్‌కే పరిమితం అయ్యారు. వై.ఎస్.ఆర్ పాత్రధారిని కూడా రెండు సీన్స్‌కే పరిమితం చేశారు. కల్యాణ్ రామ్ పాత్ర కూడా పరిమితంగానే కనపడింది. భరత్‌రెడ్డి పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. పూనమ్ బాజ్వా, మంజిమమోహన్ తదితరులు పాత్రలకు తగ్గట్టు న్యాయం చేశారు. సాంకేతికంగా దర్శకుడు క్రిష్ పాత్రలను చక్కగా మలుచుకున్నాడు. సన్నివేశాల పరంగా మంచి సంభాషణలతో చక్కగా మలుచుకున్నాడు క్రిష్. ఎం.ఎం.కీరవాణి సంగీతం, నేపథ్య సంగీతం బావున్నాయి. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాణ విలువలు బావున్నాయి. బసవ తారకం కోణంలో కథ సాగుతుంది. ఆమె కన్నుమూయడంతో కథ ముగిసేలా సినిమాను డిజైన్ చేయడం బావుంది. అయితే ఇంత పూర్తిస్థాయి పొలిటికల్ డ్రామా యూత్‌కు నచ్చుతుందా? అనేదే మీమాంసగా మారింది..
బోటమ్ లైన్:
తెలుగు వాడి రాజకీయ ఉనికిని చాటిన `యన్.టి.ఆర్ మహానాయకుడు`
రేటింగ్ :3.25/5