ఎన్టీఆర్ ఆస్కార్ సందడిలో భాగంగా అమెరికాలో గడుపుతుంటే… ఆయన తదుపరి సినిమా గురించి ఇక్కడ హాట్ హాట్ చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో ఆ విషయం ట్రెండింగ్‌గా కూడా మారింది. కాంబో అంత ప్రత్యేకంగా ఉంది మరీ! ఆ వివరాల్లోకి వెళితే… ఎన్టీఆర్ కథానాయకుడిగా తమిళ దర్శకుడు వెట్రిమారన్ ఓ సినిమా చేస్తున్నారనే విషయం ఎప్పట్నుంచో వినిపిస్తోంది. నిజంగానే రెండు సార్లు వెట్రిమారన్ హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్‌ని కలిసి వెళ్లారు. అది ఎందుకనేది మాత్రం తెలియదు కానీ…అప్పట్నుంచే ఈ కాంబో గురించి వార్తలు రావడం మొదలైంది. వెట్రిమారన్ ఆషామాషీ దర్శకుడు కాదు. స్టార్ హీరోలతో రియలిస్టిక్ సినిమాలు చేస్తూ సంచలనాలు సృష్టిస్తుంటారు. ఆయన ఎన్టీఆర్‌తో జట్టు కట్టడం అనేది కచ్చితంగా ప్రత్యేకమైన విషయమే. అయితే ఈ కాంబో గురించి చాలా రోజులుగావార్తలు వినిపిస్తున్నా సినిమా మాత్రం సెట్ కావడం లేదు. దాంతో ఇది డౌటే అన్న ప్రచారం కూడా మొదలైంది. అయితే తాజాగా ఆ కాంబోలోకి ధనుష్ కూడా చేరిపోవడంతో ఇది మరింత ప్రత్యేకంగా మారింది.
ఎన్టీఆర్ – ధనుష్ కథానాయకులుగా వెట్రి మారన్ సినిమా ప్లాన్ చేస్తున్నారనే విషయం ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. వెట్రి- ధనుష్ కలిసి ఇదివరకు సంచలనాలు సృష్టించారు. కలిసి నాలుగు సినిమాలు చేశారు. మరి వీళ్లిద్దరూ కలిసి మరో సినిమా ప్లాన్ చేశారా? అందులో ఎన్టీఆర్ నిజంగానే నటించబోతున్నారా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. తాజాగా తమిళనాడు మీడియా నుంచే ఈ వార్తలు మొదలయ్యాయి. దాంతో ఈ కాంబో సెట్ కావొచ్చనే ప్రచారం ఊపందుకుంది. అయితే అక్కడి మరో వర్గం మాత్రం ఈ కాంబో సెట్ అవ్వడం కష్టమే అని, దీనిపై వచ్చిన వార్తలన్నీ అబద్ధమే అంటున్నాయి. మరి ఏది నిజం, ఏది అబద్ధం అనేది ఎన్టీఆర్ అమెరికా నుంచి వచ్చాకైనా తేలుతుందేమో చూడాలి.