లంచం ఇచ్చేందుకు బిచ్చమెత్తారు

OLD COUPLE BEGGING TO GIVE BRIBE

పాలనలో పారదర్శకత తీసుకురావడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా లంచం అనే మాట మాత్రం పోవడం లేదు. ఉద్యోగ విధుల్లో భాగంగా చేయాల్సిన చిన్నిచిన్న పనులకు కూడా లంచం డిమాండ్ చేయడం కొందరు ఉద్యోగులకు అలవాటైపోయింది. చేయి తడపకుండా పని చేయించుకోవడం ప్రభుత్వ కార్యాలయాల్లో కష్టమైపోయింది. తాజాగా పట్టాదారు పాసుపుస్తకం తీసుకోవడానికి అవసరమైన లంచం డబ్బులు సంపాదించేందుకు ఓ వృద్ధ దంపతులు బిచ్చమెత్తారు. ‘‘పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేందుకు తహశీల్దార్‌ లంచం అడుగుతున్నాడు.. వయోభారంతో ఏ పనీ చేయలేని స్థితిలో ఉన్నాం.. మా దగ్గర డబ్బులు లేవు.. లంచం కోసం బిచ్చం వేయండి’’ అంటూ వారు మెడలో ప్లకార్డులు వేసుకుని భిక్షాటన చేయడం భూపాలపల్లిలో చర్చనీయాంశంగా మారింది.

భూపాలపల్లి మండలం ఆజంనగర్‌కి చెందిన మాంతు బసవయ్య, లక్ష్మి దంపతులకు గ్రామ శివారులో 31 గుంటల వ్యవసాయ భూమి ఉంది. దానికి సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాల కోసం ఎన్నిసార్లు తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం కనిపించలేదు. దీంతో లంచం అడిగిన తహశీల్దార్ కు ఆ డబ్బు ఇచ్చేందుకు బిచ్చమెత్తుకోవాలని నిర్ణయించుకున్నారు. తాము ఎందుకు బిచ్చం ఎత్తుకుంటున్నామో ప్లకార్డుల మీద రాయించి, వాటిని మెడలో వేసుకుని భూపాలపల్లిలో భిక్షాటన చేశారు. ఈ వ్యవహారం కలెక్టర్ వద్దకు వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి, తగిన చర్యలు చేపట్టాలని ఆర్డీవోను ఆదేశించారు. దీంతో ఆర్డీవో అన్ని వివరాలూ సేకరించి, వారికి పాసు పుస్తకాలు అందజేశారు. కాగా, బసవయ్య, లక్ష్మి తమకున్న వ్యవసాయ భూమిని ఎప్పుడో అమ్ముకున్నారని భూపాలపల్లి తహసీల్దార్‌ తెలిపారు. ఆ భూమికి సంబంధించిన కేసు ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉందని, అందువల్లే పాసు పుస్తకం ఇవ్వకుండా నిలిపి ఉంచామని చెప్పారు.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article