Panday about Rahul gandhi
- సీఓఏకి బీసీసీఐ చీఫ్ ఖన్నా లేఖ
మహిళలను కించపరిచేలా మాట్లాడి జట్టు నుంచి సస్పెన్షన్ కు గురైన టీమిండియా ఆటగాళ్లు హార్థిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ కు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా మద్దతుగా నిలిచారు. క్షమాపణ చెప్పినందున వారిపై నిషేధం ఎత్తేయాలని సుప్రీం కోర్టు నియమిత పరిపాలకుల కమిటీ (సీఓఏ)ని కోరారు. ఈ మేరకు ఆయన శనివారం సీఓఏకు లేఖ రాశారు. పాండ్యా, రాహుల్ వివాదంపై ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక జనరల్ సమావేశం జరపలేమని స్పష్టం చేశారు. ‘పాండ్యా, రాహుల్ తప్పు చేశారు. ఇప్పటికే వారిపై నిషేధం విధించాం. ఇద్దరు ఆటగాళ్లు వారి వ్యాఖ్యల పట్ల బేషరతు క్షమాపణలు చెప్పారు. అందువల్ల విచారణ పూర్తేయ్యే వరకు వారిపై నిషేధం ఎత్తేసి జట్టులోకి తీసుకోవాలి. అలాగే న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌లో ఆడించాలి’ అని ఖన్నా తన లేఖలో కోరారు. పాండ్యా, రాహుల్‌లు మాట్లాడింది ముమ్మాటికి తప్పేనని, కానీ వారి పట్ల ఇంత కఠినంగా వ్యవహరించడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్ ముందు ఇద్దరి ఆటగాళ్లకు ప్రాక్టీస్ అవసరమని, ఈ యువ ఆటగాళ్ల తప్పును క్షమించి ఓ అవకాశం ఇద్దామని కోరారు. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘కాఫీ విత్ కరణ్’ టీవీ షోలో పాండ్యా, రాహుల్ మహిళల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే.