ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ శనివారం ఘాటైన విమర్శలు చేశారు. తన స్థాయిని మించి వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఉద్వేగంగా ప్రసంగించిన ఆయన ఏకంగా జగన్ మీద అస్త్రాన్ని ఎక్కుపెట్టారు. సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంపై లేని పోని కథనాలు ప్రసారం చేసిన మీడియా సంస్థలకు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అవినీతి కనిపించడం లేదా అని నిలదీశారు. చిత్ర పరిశ్రమపై కన్నెత్తి చూస్తే మాడి మసైపోతారని జగన్ ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ అన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై ఎందుకు కథనాలు రాయడం లేదని మీడియాను ప్రశ్నించారు. సినిమా వారు వ్యాపారం చేసుకోకూడదా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని నిలదీశారు. సినిమా బడ్జెట్ చిన్నది కావొచ్చు ప్రభావం పెద్దదని చెప్పుకొచ్చారు.
వకీల్ సాబ్ సినిమా లేకుంటే ఆంధ్ర ప్రదేశ్ లో సినిమాలు రిలీజ్ అయి ఉండేవన్నారు. కులం చూసి బంధాలు పెంచుకోలేదని వ్యక్తిత్వాన్ని చూసి పెంచుకున్నాఅని అన్నారు. సినిమా మేం తీస్తే టికెట్లు మీరు అమ్ముతారా.. అమ్మడానికి మీరెవరు అని నిలదీశారు. అయినా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద సొమ్ము లేక.. తమ సొమ్మును చూపెట్టిన రుణాల్ని తీసుకుంటారని ఎద్దేవా చేశారు. చిరంజీవికి ఆయన చురకలు అంటించారు. సోదరభావంతో ఉన్నప్పుడు సినిమా పరిశ్రమ సమస్యను ఎందుకు సాల్వ్ చేయడం లేదన్నారు. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందని ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. సినిమా పరిశ్రమ జగన్ ని చూసి భయపడాల్సిన అవసరం లేదన్నారు. మనమంతా ఇండియన్ రిపబ్లిక్ లో ఉన్నామని గుర్తు చేశారు.