pawan producers worry
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అనూహ్యమైన దూకుడు పెంచాడు. వరుసగా సినిమాలుఅనౌన్స్ చేస్తూ పరిశ్రమ మొత్తాన్ని ఆశ్చర్యపరిచాడు. ఆ సర్ ప్రైజ్ నుంచి తేరుకోక ముందే దిల్ రాజు నిర్మిస్తోన్న వకీల్ సాబ్ షూటింగ్ ను 70శాతానికిపైగా పూర్తి చేశాడు. పవన్ కు సంబంధించి మరో పది రోజులు షూటింగ్ బ్యాలన్స్ ఉంది. మరోవైపు క్రిష్ డైరెక్షన్ లో విరూపాక్ష(వర్కింగ్ టైటిల్) కూడా మొదలైంది. అటు హరీష్ శంకర్ తోనూ సినిమా ఉంది. ఈ లోగా సడెన్ గా మధ్యలోకి ఓ మళయాల మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియమ్’ రీమేక్ ఎంటర్ అయింది. పైగా ఇది హారిక హాసిని బ్యానర్ లో రూపొందే సినిమా. అంటే నాలుగు సినిమాలైన్ లో ఉన్నాయి. రెండు నెలలుగా లాక్ డౌన్ వల్ల అన్ని షూటింగ్స్ ఆగిపోయాయి. కానీ వచ్చే నెల మొదటి వారం నుంచి మళ్లీ షూటింగ్స్ మొదలు కాబోతున్నాయి. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిర్మాతల గుండెల్లో గుబులు మొదలైంది. ఒక్కసారి షూటింగ్ స్టార్ట్ అయితే.. పవన్ కళ్యాణ్ ముందుగా ఎవరి సినిమా మొదలుపెడతాడు అనేదే పెద్ద ఫజిల్ గా మారింది.
ఇప్పటికే దిల్ రాజు ముందుగా తన సినిమా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ ను బతిమాలుతున్నాడట. అంటే ఆయన ఓ పది రోజులు టైమ్ ఇస్తే చాలు మిగతా పార్ట్ వేగంగా ఫినిష్ చేసి రీలీజ్ డేట్ సెట్ చేసుకుంటాడు. అలాగే రీ ఎంట్రీ సినిమా తనదే అవుతుందనే భావన దిల్ రాజుది. ఇక క్రిష్ డైరెక్షన్ లో సినిమాను నిర్మించే ఏఎమ్ రత్నం. ఈయన దాదాపు పదేళ్లుగా పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎట్టకేలకు ఒప్పుకున్నాడు. ఇప్పటికే విరూపాక్ష ఓ షెడ్యూల్ పూర్తయిందీ అని కూడా చెబుతున్నారు. అసలే రత్నం చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాడు. పవన్ మూవీతో ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయట పడాలని ప్రయత్నిస్తున్నాడు. ఇక మళయాల రీమేక్ మూవీ కూడా వెంటనే స్టార్ట్ అవుతుందనేది లేటెస్ట్ న్యూస్. ఒకవేళ ఈ మూవీని హరీశ్ శంకర్ హ్యాండిల్ చేసినా ముగ్గురు నిర్మాతలు. మరి ఈ ముగ్గురిలో ఎవరి సినిమా ముందుగా మొదలుపెడతాడు అనేది పెద్ద ఫజిల్ గా మారింది. అసలే తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయి. అందువల్ల తమ సినిమా షూటింగ్ చేస్తే బావుండు అని ప్రతి నిర్మాతా కోరుకుంటాడు. ఆ కారణంగానే ఈ నిర్మాతల్లో కొంత భయం కూడా మొదలైంది. మరి ఈ ముగ్గురిలో పవన్ ఏ నిర్మాత కోరికను ముందుగా నెరవేరుస్తాడో చూడాలి.