PAWAN RECORD REMUNERATION
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఈ పేరు వింటే అభిమానులు ఊగిపోతారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలు వదిలేసినా.. ఆయన అభిమాన గణం మాత్రం చెక్కుచెదర్లేదు. పవన్ మళ్లీ సినిమాల్లో నటించాలని పలువురు గట్టిగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన ‘పింక్’ సినిమాలో నటించడానికి పవన్ అంగీకరించారు. ఎప్పటినుంచో పవన్ తో సినిమా తీయాలని భావిస్తున్న దిల్ రాజు.. ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో నటించడానికి పవన్ కు దిల్ రాజు ఇస్తున్న మొత్తమెంతో తెలుసా? అక్షరాలా యాభై కోట్ల రూపాయలు. ఇదే నిజమైతే.. తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక పారితోషకం తీసుకున్న హీరోగా పవన్ రికార్డు సృష్టిస్తారు. అయితే, పింక్ కమర్షియల్ సినిమా కాదని, అలాంటప్పుడు దిల్ రాజు ఎందుకింత సాహసం చేస్తున్నారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఈ విషయంలో దిల్ రాజు లెక్కలు ఆయనకు ఉన్నాయని, అన్నీ ఆలోచించిన తర్వాతే దిల్ రాజు.. పవన్ కు ఇంత భారీ మొత్తం ఆఫర్ చేశారని అంటున్నారు.
వాస్తవానికి పవన్ ప్లాప్ సినిమా కూడా రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు వసూలు చేస్తుంది. ఈ నేపథ్యంలో సినిమా మొత్తాన్ని రూ.75 కోట్లలో పూర్తిచేసి, వేసవి సెలవుల సమయంలో విడుదల చేయాలన్నది దిల్ రాజు ప్లాన్ గా చెబుతున్నారు. దాంతో సినిమా ఫలితంతో సంబంధం లేకుండా పెట్టిన మొత్తం సునాయాసంగా వస్తుందని, సినిమా హిట్ అయితే, లాభాలు రావడం ఖాయమన్నది ఆయన లెక్క. మొత్తానికి పవన్ తో సినిమా తీయాలన్న దిల్ రాజు కోరిక ఈ విధంగా నెరవేరబోతోంది.