Friday, July 5, 2024

తుది దశకు కసరత్తు…!

  • చివరి అంకానికి పీసీసీ చీఫ్​, మంత్రివర్గ విస్తరణ
  • ఢిల్లీకి వెళ్ళిన సీఎం

రాష్ట్రంలో పీసీసీ చీఫ్​, మంత్రి వర్గ విస్తరణ కసరత్తు చివరి అంకానికి చేరుకున్నది. ఈ నెల 6న ఆషాడ మాసం ప్రారంభమవుతోన్న నేపథ్యంలో ఆలోపే ఆయా పోస్టులను భర్తీ చేయాలని భావిస్తోన్న ఏఐసీసీ ఆ మేరకు కసరత్తు పూర్తి చేసింది. ఆయా పదవుల భర్తీపై ఇప్పటికే టీపీసీసీ నేతలతో చర్చించి.. వారి సలహాలు, సూచనలు స్వీకరించిన అధిష్టానం రాష్ట్ర కీలక నేతలను మరోసారి ఢిల్లీకి రావాలని ఆదేశించింది. హైకమాండ్​ ఆదేశాలతో నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్​ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అగ్రనేతలతో తుది చర్చ జరపనున్నారు. దీనికోసం సీఎం రేవంత్ బుధవారం ఢిల్లీ కి వెళ్లారు.
అయితే మంత్రివర్గ విస్తరణ విషయంలో ఎమ్మెల్యేల సీనియార్టీ, పార్టీ పట్ల అంకితభావం, ఎన్నికల ముందు చేరికల సమయంలో అధిష్టానం ఇచ్చిన హామీలు, సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకున్న ఏఐసీసీ..

ఆ ప్రాతిపదికన మంత్రి పదవులు కేటాయిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన అధిష్టానం చివరి సారిగా మరోసారి సీఎం, డిప్యూటీ సీఎంతో చర్చించి మంత్రివర్గాన్ని ప్రకటించాలని భావిస్తున్నది. మరోవైపు మంత్రివర్గంలో కేవలం ఆరు పదవులు మాత్రమే భర్తీకి అవకాశం ఉండడం, పదవులు ఆశించే వారి సంఖ్య పదికి మించి ఉండడంతో అసంతృప్తులను ఎలా బుజ్జగించాలో అనే అంశంపై ఏఐసీసీ ఫోకస్​ చేసింది. పదవులు దక్కని వారు అసంతృప్తికి గురికాకుండా, అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా చూసే బాద్యతను సీఎం, డిప్యూటీ సీఎంలకు అప్పగించాలని అధిష్టానం భావిస్తున్నది. అయినా మాట వినని ఎమ్మెల్యేలకు ప్రభుత్వంలో, పార్టీలో కీలక బాద్యతలు ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఇదీలావుంటే.. ముందు నుంచి ప్రచారంలో ఉన్నట్టు అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్​ఎస్ నుంచి కాంగ్రెస్​ లో చేరిన ఎమ్మెల్యేలకు, ఆ ఎన్నికల ముందు కాంగ్రెస్​ కండువా కప్పుకుని గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి హామీ ఇచ్చిన సీఎం, ఏఐసీసీ ఇప్పుడా హామీని నెర్చుకుంటుందో..? లేదోననే ఉత్కంఠ ఆ ఆశావాహుల్లో నెలకొన్నది. ఈ క్రమంలో ముఖ్యంగా ఎన్నికల తర్వాత కాంగ్రెస్​ లో చేరిన బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు దానం నాగేందర్​, కడియం శ్రీహరి లతో పాటు ఎన్నికల ముందు పార్టీలో చేరిన వివేక్​, కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డిలకు మంత్రి వర్గంలో బెర్త్​ లభిస్తుందా..? లేదా.? చర్చ హాట్​ టాపిక్​ గా మారింది. మరోవైపు కాంగ్రెస్​ బీ ఫాంతో గెలిచిన వారికి మాత్రమే మంత్రివర్గంలో చోటు కల్పిస్తామంటూ సీఎం రేవంత్​ రెడ్డి ఇటీవల చేసిన ప్రకటన మంత్రి పదవుల రేసులో ఉన్న మిగతా నేతల్లో ఆశల్ని చిగురింపజేసింది.

ఇదీలావుంటే.. లోక్​ సభ ఎన్నికల ప్రచారంలో ముదిరాజ్​ లకు కెబినెట్​ లో కచ్చితంగా ఓ మంత్రి పదవి ఇస్తామని ప్రకటించిన సీఎం రేవంత్​ ఇందులో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అవకాశం ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో సామాజిక సమీకరణలో భాగంగా శ్రీహరికి మంత్రివర్గంలో పదవి దాదాపు ఖరారైందని సమాచారం. ఆయనతో పాటు రెడ్డి సామాజికవర్గం నుంచి ఇద్దరికి పదవులు ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. అయితే ఇందులో బోధన్​ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుదర్శన్​ రెడ్డికి సీటు పక్కా అనే ప్రచారం జరుగుతోంది. కాగా లోక్​ సభ ఎన్నికల్లో తన భార్యకు భువనగిరి టిక్కెట్టు ఆశించి భంగపడ్డ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డికి మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పిస్తామని ఏఐసీసీ నేతలు హామీ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.

దీంతో రెండు వారాల క్రితం వరకు ఆయనకు కెబినెట్​ లో మంత్రి పదవి ఖరారైందనే ప్రచారం జరగగా, జగిత్యాల బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే సంజయ్​ కుమార్​ పార్టీలో చేరికపై తీవ్ర అసంతృప్తికి గురై తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైన ఆ పార్టీ సీనియర్​ నేత, ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డికి తన వద్దకు పిలిపించుకున్న అధిష్టానం ఆయనకు మంత్రి పదవి హామీ ఇచ్చిందనే ప్రచారం అధికార పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దీంతో ఇరువురిలో ఎవరికి మంత్రి పదవి వస్తుందోననే ఆసక్తి నెలకొన్నది. ఇటు ప్రస్తుత మంత్రివర్గంలో ప్రాతినిద్యం లేని ఆదిలాబాద్​ కు అవకాశం కల్పించాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకున్నది. దీంతో ఆ ఉమ్మడి జిల్లాలో మంత్రి పదవుల కోసం లాబీయింగ్​ చేస్తోన్న మంచిర్యాల, చెన్నూరు ఎమ్మెల్యేలు ప్రేం సాగర్​ రావు, వివేక్​ లలో ఎవరికి అవకాశం వస్తుందోననే ఆసక్తి నెలకొన్నది. ఇటు ఎస్టీ సామాజికవర్గం నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్​ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. వీటితో పాటు ప్రస్తుతం మంత్రులకు కేటాయించిన శాఖలను ఏఐసీసీ మార్చే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తున్నది.

ఈ క్రమంలో ప్రస్తుతం రాష్ట్ర పంచాయతీ రాజ్​, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కు హోం శాఖ అప్పగించే అవకాశాలున్నాయంటూ ఈనెల ఒకటో తేదిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో కాకపుట్టించాయి. అలాగే.. మరో కీలక పదవి అయిన పీసీసీ చీఫ్​ నియామకంలో హైకమాండ్​ ఆచీతూచీ వ్యవహరిస్తోంది. ఈ పోస్టుల భర్తీలో కచ్చితంగా సామాజిక సమీకరణ అంశాన్ని పాటించాలని నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలో ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి సీఎం పదవి ఇచ్చిన నేపథ్యంలో పీసీసీ పగ్గాలు బీసీ వర్గ నేతకు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. దీంతో ఎమ్మెల్సీ మహేశ్​ కుమార్​ గౌడ్​, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్​ ఇప్పటికేఈ పోస్టు కోసం తీవ్ర స్ధాయిలో ప్రయత్నిస్తున్నారు.

ఇక పీసీసీ చీఫ్​ బీసీ నేతకు అప్పగిస్తే డిప్యూటీ స్పీకర్​ పోస్టును లంబాడ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేకు దక్కే అవకాశం ఉంది. ఈ కేటగిరిలో డోర్నకల్​ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్​ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇదీలావుంటే.. పీసీసీ, మంత్రి పదవుల కోసం ఇప్పటికే ఢిల్లీ బాట పట్టిన టీపీసీసీ ఎమ్మెల్యేలు, సీనియర్లు అక్కడ అగ్రనేతలను కలిస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాజాగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్​ మున్షిని మంగళవారం ఢిల్లీలో కలిసి ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, శ్రీహరి ముదిరాజ్​ మంత్రి పదవుల కోసం, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ పీసీసీ చీఫ్​ కోసం విన్నవించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?
- Advertisment -

Most Popular