దేశంలో ఎక్కడాలేని విధంగా పేదోడి ఇంటికి రూ. 5 లక్షలు ఇస్తున్నామని, ప్రతి ఏడాది నాలుగున్నర లక్షల ఇండ్లు నిర్మిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పధకానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ ఏడాది 22 వేల కోట్ల రూపాయిలతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించబోతున్నామని, ఇందుకు సంబంధించి మరికొద్దిరోజుల్లో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిచేస్తామని, ఇప్పటికే పైలట్ గ్రామాల్లో ఇండ్ల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయని అన్నారు. హౌసింగ్ కార్పొరేషన్ లో అవుట్ సోర్సింగ్ లో నియామకమైన 350 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ ( న్యాక్) లో ఆరు రోజుల పాటు శిక్షణ పొందారు. శనివారం న్యాక్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శిక్షణ పొందిన ఇంజనీర్లకు సర్టిఫికేట్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అవినీతికి ఆస్కారం లేకుండా నిజాయితీ నిబద్దతతో పనిచేసి పేదవాడి చిరకాల కోరిక నెరవేరుస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పధకంలో భాగస్వాములు కావాలని అసిస్టెంట్ ఇంజనీర్లకు విజ్ఞప్తి చేశారు. ఎంపికైన 350 మంది ఇంజనీర్లలో 45 శాతం మహిళలే ఉండడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కూడా మెరిట్ పద్దతిలోనే ఎంపిక చేయడం జరిగిందన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ సంక్షేమ పధకం కింద ఒక్క లబ్దిదారునికి 5 లక్షల రూపాయిలు ఇస్తున్న పధకం లేదని అన్నారు. ఇండ్ల పధకాల్లో కూడా కేంద్రం ఇస్తున్న నిధులతోనే అన్ని రాష్ట్రాలు సరిపెడుతున్నాయని కానీ తెలంగాణ రాష్ట్రంలో పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇందిరమ్మ ప్రభుత్వం 5 లక్షల రూపాయిలతో 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఇండ్లను లబ్దిదారుడే నిర్మించుకునేలా పధకాన్ని రూపొందించిందన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల కోసం కొద్దిరోజుల్లోనే నాలుగు లక్షల మంది జాబితా ఫైనల్ చేయబోతున్నామని విధుల్లో చేరిన వెంటనే అసిస్టెంట్ ఇంజనీర్లు ఈ జాబితాలపై దృష్టి సారించాలని సూచించారు. ఎలాంటి ప్రలోభాలు, వత్తిళ్లకు గురికాకుండా అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు లభించేలా క్షేత్రస్ధాయిలో పనిచేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల చెల్లింపుల్లో ఎలాంటి మధ్యవర్తులు ప్రమేయానికి ఆస్కారం లేకుండా ఉండేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని తెలిపారు. వివిధ దశల్లో నిర్మాణం పూర్తి చేసుకున్నలబ్గిదారులకు ప్రతిసోమవారం చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. నిర్మాణ రంగంలో తనకు ఉన్న అనుభవంతో తక్కువ ఖర్చు, నాణ్యతతో ఇండ్లను నిర్మించడానికి అధికారులకు పలు సూచనలు చేయడం జరిగిందని యువ ఇంజనీర్లు కూడా ఈ అంశాలపై ప్రధానంగా దృష్టి సారించి లబ్దిదారులకు అవగాహన కల్పించాలన్నారు.