ప్లాస్టిక్ రైస్ నిజమేనా?

Plastic Rice is there ?

  • సోషల్ మీడియాలో వీడియోలు హల్ చల్
  • అలాంటి బియ్యం ఉండవంటున్న అధికారులు

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎవరో షేర్ చేసిన విషయాన్ని నిజమో కాదో నిర్ధారించుకోకుండా షేర్ చేయడం కామన్ అయిపోయింది. ప్లాస్టిక్ రైస్ కూడా అలాంటిదే. చైనా నుంచి ప్లాస్టిక్ రైస్ వస్తోందని, అది తింటే ప్రాణాలకు ప్రమాదం అంటూ జోరుగా వీడియోలు వైరల్ అయ్యాయి. పాలిథీన్‌ కవర్లను ఓ యంత్రంలో వేసిన తర్వాత అవి కరిగి పొడవైన సన్నటి దారాలుగా మారడం… చల్లటి నీటిలోంచి కదులుతూ మరో మెషిన్‌ లోకి వెళ్లిన తర్వాత బియ్యంగా మారిపోవడం వీడియోల్లో కనిపిస్తోంది. అది నిజమేనని అందరూ నమ్మారు. దీంతో ఈ విషయంపై 2017లో హైదరాబాద్లో ఫిర్యాదు కూడా నమోదైంది. అలాగే ఢిల్లీ హైకోర్టులో ఇప్పటికే ప్లాస్టిక్‌ రైస్‌ పై ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలై ఉంది.ప్లాస్టిక్‌ రైస్‌పై వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. చైనా, వియత్నాంలో ప్లాస్టిక్‌ రైస్‌ తయారై భారత్, శ్రీలంక మరికొన్ని దేశాలకు ఎగుమతి అవుతున్నాయన్న ప్రచారం ఉంది. వాస్తవానికి ప్లాస్టిక్‌ రైస్‌ ఉడికి మెత్తగా అవడం జరగదు. తింటున్న సమయంలోనూ అది పంటి కింద నలగదు. పైగా దానికి ఎటువంటి రుచీ ఉండదు. తింటుంటే స్పష్టంగా తెలిసిపోతుంది. అసలు ప్లాస్టిక్ రైస్ అనేది లేదని, ఆ వీడియోల్లో కనిపిస్తున్నట్టు అవి బియ్యం కాదని, పారిశ్రామిక అవసరాల కోసం అలా తయారవుతున్నాయనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. నిజానికి ప్లాస్టిక్‌ బియ్యం తయారు చేయడం అన్నది ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, సాధారణ బియ్యం స్థానంలో ప్లాస్టిక్‌ బియ్యం అమ్మడం వల్ల మిగిలేదేమీ ఉండదంటున్నారు. ప్లాస్టిక్‌ ఖరీదు బియ్యం కంటే ఎక్కువేనన్న వాదన ఉంది. అందువల్ల అలాంటి వదంతులు నమ్మొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ మీ దగ్గర ఉన్నది ప్లాస్టిక్ రైస్ అని అనుమానంగా ఉంటే, వెంటనే వాటి శాంపిళ్లను పౌర సరఫరా అధికారులకు లేదా ఫుడ్ ఇన్ స్పెక్టర్ కు అందజేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article