రైతు ఆధారిత విత్తన ఎగుమతులు

Pocharam Srinivas Reddy

నాణ్యమైన విత్తనాలు ఉత్పత్తి చేసే అవకాశాలున్న మన రాష్ట్రం నుండి ఆఫ్రికా దేశాలు, దక్షిణాసియా దేశాలకు విత్తనాలు మార్కెటింగ్ చేసే అవకాశాలున్నాయని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి స్వతహాగా రైతు కావడం వల్ల రైతుల ఆదాయాలు రెట్టింపు చేసేందుకు అవకాశమున్న అన్ని పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారు. రైతు బంధు, రైతు భీమా, 24 గంటల ఉచిత విద్యుత్ తో రైతులకు మేలు చేసినట్లు విత్తన ఎగుమతులతో రాష్ట్ర రైతులకు ఆదాయం లభిస్తుందన్నారు. ఇది ప్రవేశపెట్టినట్లు దేశాల మద్య కూడా సరిహద్ధులతో సంబంధం లేకుండా విత్తన ఎగుమతులు, మార్కెటింగ్కు అన్ని దేశాలు అంగీకరించాలని రైతు సమన్వయ సమితి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పాదకతకు నాణ్యమైన విత్తనమే కీలకమని అన్నారు. రాష్ట్రంలో విత్తనోత్పత్తిలో నిమగ్నమై ఉన్న రైతులకు రైతు సమన్వయ సమితి సభ్యులు ఎల్లవేళలా సహాయం చేసేందుకు ముందుంటారని చెప్పారు. రాష్ట్రంలో విత్తన అధికోత్పత్తికి అత్యంత అనుకూల వాతావరణముందని చెప్పారు.

దేశం నుండి విత్తన ఎగుమతులు పెరగాలంటే ఆయా దేశాల సాగు పరిస్థితులు, పంటలు అకలింపు చేసుకోవాలి. విత్తన డిమాండ్ అంచనా ముఖ్యమే. భారత్, ఆఫ్రికా, ఇతర దక్షిణాసియా దేశాలలో దాదాపు ఒకే రకపు పంటలు సాగులో ఉన్నాయి. కాబట్టి మన విత్తనానికి ఆయా దేశాలలో మంచి మార్కెట్ ఉందని తెలంగాణరాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి. పార్థసారథి IAS అన్నారు. ప్రస్తుతం, ప్రపంచ విత్తన వ్యాపారంలో దేశం పాళ్లు 4.4 శాతమేనని, కేంద్రం 10% లక్ష్యంగా ప్రణాళికలు రూపొందుతుందన్నారు. గత రెండు సంవత్సరాలలో OECD ధృవీకరణ ద్వారా విత్తనాలు ఎగుమతి చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. నాణ్యత పరంగా భారత విత్తనాల ధృవీకరణకు ఆఫ్రికా దేశాలలో ఆదరణ ఎక్కువని ఆయన అన్నారు. ఫిలిప్పైన్స్, సూడాన్, ఈజిప్ట్ దేశాలకు ఇప్పటికే మనం ఎగుమతి చేస్తున్నాం. దక్షిణ ఆసియా దేశాలు మయన్మార్, థాయ్లాండ్, పాకిస్థాన్, నేపాల్, భూటాన్, శ్రీలంక దేశాలకు అవసరమయిన ప్రతి పంట విత్తనం మనం రాష్ట్రంలో పండించి ఎగుమతి చేయగలిగే శక్తి మనకుందన్నారు.

 జొన్న, సజ్జ, ప్రత్తి, పప్పుదినుసులు, కూరగాయలు, మొక్కజొన్న విత్తనాలు ఎగుమతి చేయగలం.
 విత్తననాణ్యతపైన దేశాల ఆహార భద్రత ఆధారపడి ఉంది.
 ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ, ఆఫ్రికా దేశాలు, దక్షిణాసియా దేశాలు ఒకే వేదిక మీదకు వచ్చి చర్చించడంతో ప్రపంచం ఒకే విత్తన మార్కెటింగ్ వేదికగా మారింది.
 దేశంలో మొక్కజొన్న, వరి, సోయా,చిక్కుడు, సజ్జ, జొన్న పంటల హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో 60 శాతం వాటా రాష్ట్రానిదే.
 రాష్ట్రంలో 1500 గ్రామాలలో మూడు లక్షల ఎకరాలలో 65 లక్షల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనం ఉత్పత్తి అవుతుంది.
 రాష్ట్రంలో 2 లక్షల 50 వేల మంది రైతులు విత్తనోత్పత్తి చేపడుతున్నారని సి. పార్థసారథి IAS వెల్లడించారు.
 రాష్ట్రంలో 413 విత్తన ప్రాసెసింగ్ ప్లాంట్లు, 13 పరీక్షా కేంద్రాలు పని చేస్తున్నాయి.
 విత్తనోత్పత్తి రంగం రాష్ట్రంలో, దేశంలో రైతులకు ఆదాయాలు పెంచే మరో నూతన మార్గమని పార్థసారథి అన్నారు.
 ప్రపంచ విత్తన పరిశ్రమ వృద్ధి రేటు 7% ఉంటే, విత్తనరంగంలో భారత దేశం వృద్ధి రేటు 17% ఉంది. 2027 నాటికి భారత జనాభా చైనా జనాభాను మించుతుంది. అప్పటి ఆహార భద్రత కచ్ఛిత పరచాలంటే, విత్తన ఆధారిత ప్రణాళికలు అవసరం. విత్తన దిగుమతుల నియమ, నిబంధనలు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా ఉన్నాయి. ఆదే విధంగా రకాలు, విడుదల, విత్తన నాణ్యతా ప్రమాణాలు అంది పుచ్చుకునేలా మన రైతులకు అవగాహన, శిక్షణ తరగతులు నిర్వహిస్తామని పార్థసారథి అన్నారు.

కార్యక్రమంలో విత్తన ధృవీకరణ డైరెక్టర్ డాక్టర్ కేశవులు, విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ISTA అధ్యక్షుడు డాక్టర్ క్రెయిగ్ మాక్గిల్, ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ ప్రతినిధి డాక్టర్ చికెలు బా, ఆఫ్రికా మరియు వివిధ దేశాల (35) మంది ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల డెలిగేట్స్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *