నయీం కేసులో ఐటీ దూకుడు

Police was silent on Nayam Case

కరడుగట్టిన నేరగాడు నయీం కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించి ఉన్నత అధికారుల, రాజకీయ నేతల ప్రమేయం వుందని నయీం కేసులో తొలిరోజుల్లో తెలిసిన విషయం. అప్పటి నుండి ఇప్పటి వరకు నయీం దందా వెనుక ఉన్న బడా నేతలు బయటకు రాలేదు కానీ గ్యాంగ్‌స్టర్ నయీం ఆస్తుల కేసులో తాజాగా ఐటీ శాఖ మాత్రం దూకుడు పెంచింది. నయీం ఆస్తులపై విచారణ పూర్తయ్యింది. మార్కెట్ విలువ ప్రకారం 12 వందల కోట్ల ఆస్తులు కూడబెట్టినట్లుగా గుర్తించారు. బినామీ ప్రాపర్టీస్ కింద నయీం ఆస్తులను అటాచ్ చేసేందుకు రంగం సిద్ధం చేసిన ఆదాయపు పన్నుశాఖ పిటిషన్ దాఖలు చేసింది. బినామీ ఆస్తులు గుర్తించడం నయీం దందా వెనుక ఆసలు సూత్రదారులు ఎవరన్నది పోలీసులకు పెద్ద సవాలుగా మారింది.
2016 ఆగస్టు 9న షాద్‌నగర్‌ వద్ద జరిగిన కాల్పుల్లో నయీం ఎన్ కౌంటర్ అయిన తర్వాత అతని పాపాల చిట్టా బయటపడటం మొదలయ్యింది. నయీం స్థావరాలపై పోలీసులు జరిపిన సోదాల్లో కుప్పలు కుప్పలుగా డబ్బుల కట్టలు, కేజీల కొద్దీ బంగారం వందల కోట్ల రూపాయల విలువ చేసే భూమి పత్రాలు, అక్రమ ఆయుదాలు, తూటాలను స్వాధీనం చేసుకున్నారు. అమాయకులను బెదిరించి ల్యాంట్ సెటిల్ మెంట్లు, అభం శుభం తెలియనివారిపై అత్యాచారాలు జరిపాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. నయీం ఎన్ కౌంటర్ కేసు దర్యాప్తు చేపట్టిన సిట్ అధికారులు అనేక ఆధారాలు సేకరించారు. నయీంకు భయపడి మౌనంగా ఉన్నబాధితులు ఒక్కసారిగా బయటకు వచ్చారు.
ఇక నయీం అనుచరులపై 197 కేసులు నమోదు కాగా 848 మంది సాక్షులను విచారించారు. మొత్తం 16 చార్జి షీట్లు దాఖలు చేశారు. నయీంతో సంబంధాలున్న ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసిన సిట్ పలువురు రాజకీయ నేతలను సైతం విచారించింది.గోవా, చత్తీస్ ఘడ్, రాయ్ పూర్ లో వేల కోట్ల విలువైన భవనాలు భువనగిరి, షాద్ నగర్, మహేశ్వరం ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించింది సిట్. ఎలాంటి ఆదాయ మార్గాలు లేకుండా 12 వందల కోట్ల ఆస్తులు కూడ బెట్టినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. సంబంధిత ఆస్తుల అటాచ్ మెంట్ కు ఈడీతో పాటు ఐటీ విభాగానికి లేఖలు రాసింది. బినామీ ఆస్తుల అటాచ్ మెంట్ చేయాలని దాఖలు చేసిన పిటిషన్ పై త్వరలో వాదనలు జరగనున్నాయి. బినామీ ఆస్తుల వెనుక ఎవరెవరు ఉన్నారన్నది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నయీం వెనుక ఆసలు దోషులు ఎవరన్నది పోలీస్ శాఖ పురోగతి సాధించకపోవడం కూడా బాధితుల్లో ఆందోళన కలిగిస్తోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article