ponguleti srinivasa reddy will get TRS Rajyasabha seat?
టీఆర్ఎస్లో రాజ్యసభ సీట్ల కోసం సందడి మొదలైంది. ఉన్న రెండు పదవుల కోసం టీఆర్ఎస్ నేతలు పోటీ పడుతున్నారు. దాదాపు పది మంది సీనియర్ నాయకులు సీట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రగతిభవన్ చుట్టూ పరుగులు పెడుతున్నారు. ఉన్నవి రెండే సీట్లు. చాలా మంది పోటీ పడడంతో ఆశావహులు లాబీయింగ్ తీవ్రతరం చేశారు.
రాజ్యసభ పదవీ కాలం ముగుస్తున్న సీనియర్ నేత కే.కేశవరావు తిరిగి రెన్యూవల్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. అయితే కేకేకు అవకాశం దక్కుతుందనే వారెందరున్నా.. దక్కపోవచ్చు అనే వాళ్ళు అదే సంఖ్యలో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆశావహుల పేర్లపై ఊహగానాలు పార్టీలో తారాస్థాయికి చేరాయి. దీంతో అయన పదవిపై కూడ చాలా మంది నేతలు కన్నేసి అయనకు ఇవ్వకుంటే మాకు ఇవ్వండి అని ప్రయత్నాలు చేస్తున్నారట. కేకే పదవి కోసం మాజీ ఎంపీ సీతారాం నాయక్, నాయిని నరసింహ రెడ్డి, వేణుగోపాల చారి పయత్నాలు చేస్తుంటే ఆయన పదవిని మాజీ ఎంపీలు కవిత, వినోద్లలో ఒకరికి కేటాయిస్తారు అని పార్టీలో చర్చ నడుస్తుంది. ఖమ్మం జిల్లా నుండి మాజీ ఎంపీ పోంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు హెటిరో ఫార్మా అధినేత పార్థసారధి రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. కనీసం ఇప్పుడైనా రాజ్యసభ ఇవ్వాలని కోరుతున్నారట. అయితే గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం రెండు రాజ్యసభ సీట్ల భర్తీకి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం . ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వం తరపున గట్టిగా లాబీయింగ్ చేసి, నిధులు రాబట్టే వారికి సీటు ఇవ్వాలని ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. అన్నీ సమీకరణాలు పరిశీలించి రెండు రోజుల్లో కేసీఆర్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.