PRABHAS TENSION FOR ALL HEROS
ఇప్పుడు హీరో నాని టెన్షన్ పడుతున్నాడు, నాగ చైతన్య టెన్షన్ పడుతున్నాడు, వరుణ్ టెన్షన్ పడుతున్నాడు… ఇంకా, చాలామంది కుర్రహీరోలు ఒకటే సందిగ్ధంలో ఉన్నారు! దీనికి ఎవరంటే… ప్రభాస్. అదేంటీ… సాహో సినిమాతో బిజీగా ఉన్న ప్రభాస్ కీ వీళ్లికీ ఏంటి సంబంధం అనిపిస్తోంది కదా. ఇప్పుడు ఆ సినిమాతోనే వీళ్లకి టెన్షన్. సాహో విడుదల తేదీని అమాంతంగా మార్చేశారు కదా. ఆగస్టు నెలాఖరున విడుదల ఉంటుందని అన్నారుగానీ, అధికారికంగా ఆ తేదీని నిర్మాతలు మరోసారి ప్రకటించాల్సిన అవసరం ఉంది. కానీ, ఆ ప్రకటన ఇంకా రావడం లేదు. దీంతో సాహో ఆగస్టు నెలాఖరుకే వస్తుందా, ఇంకా ముందుకెళ్లి సెప్టెంబర్ లో విడుదల అంటారా, లేదంటే, దసరాకి మెగాస్టార్ చిరంజీవి సైరా వస్తోంది కాబట్టి, దీపావళికి వరకూ వాయిదా వేస్తారా… ఇలా రకరకాల అభిప్రాయాలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయం అవుతున్నాయి.
నాని సినిమా గ్యాంగ్ లీడర్ విడుదలకు సిద్ధమైపోయింది. వరుణ్ తేజ్ వాల్మీకి రెడీ, వెంకీ మామ కూడా త్వరగా సిద్ధమౌతోంది. వీటితోపాటు మరికొన్ని సినిమాలూ రెడీ అవుతున్నాయి. ఇక, చిన్న సినిమాల సంగతైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. సాహో విడుదల తేదీ ఖరారైతే.. ఆ తరువాతో ముందో ఈ యువ హీరోల విడుదల తేదీలు లాక్ అవుతాయి. ఒక్క సాహోతో ఇవన్నీ లింకై ఉన్నాయి. అయితే, ఆ నిర్మాతల నుంచి స్పష్టమైన సమాచారం కోసం వీరంతా ఎదురు చూస్తున్న పరిస్థితి వచ్చింది.