ప్రణబ్ కు భారతరత్న

PRANAB HONORED WITH BHARATA RATNA

  • జనసంఘ్ నేత నానాజీ దేశ్ ముఖ్, వాగ్గేయకారుడు భూపేన్ హాజారికాకు కూడా..
  • గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన కేంద్రం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని దేశ అత్యున్నత పౌర పురస్కారం వరించింది. ప్రణబ్ తో పాటు జనసంఘ్ నాయకుడు నానాజీ దేశ్‌ముఖ్, అస్సామీ వాగ్గేయకారుడు భూపేన్‌ హజారికాలు భారతరత్న అవార్డుకు ఎంపికయ్యారు. దేశ్‌ముఖ్, హజారికాలు మరణానంతరం ఈ అవార్డు లభించింది. ప్రణబ్ ముఖర్జీ మన దేశానికి 13వ రాష్ట్రపతిగా పనిచేశారు. కాంగ్రెస్‌ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన ప్రణబ్‌ ముఖర్జీ ఆర్థిక, విదేశాంగ, రక్షణ శాఖ మంత్రిగా సేవలందించారు. 1982లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి, ఆ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందారు. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ గా పేరుపొందిన ప్రణబ్.. అనంతరం 2012 నుంచి 2017 వరకు రాష్ట్రపతిగా సేవలందించారు. దేశ ప్రజలకు తాను చేసిన దానికన్నా ప్రజలే తనకు ఎక్కువిచ్చారని ప్రణబ్‌ ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. తనకిచ్చిన ఈ గొప్ప గౌరవాన్ని  దేశ ప్రజల పట్ల పూర్తి కృతజ్ఞతా భావం, విధేయతతో స్వీకరిస్తున్నానని ట్వీట్‌ చేశారు.

ఇక భారతరత్న పొందిన నానాజీ దేశ్ ముఖ్.. బీజేపీ మాతృసంస్థ జనసంఘ్‌ వ్యవస్థాపకుల్లో ఒకరు. సమాజ సేవకుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన సేవలు ప్రశంసనీయం. గ్రామీణ స్వరాజ్యంతోపాటు దేశవ్యాప్తంగా విద్య, వైద్య రంగాల్లో మార్పులకోసం తీవ్రంగా శ్రమించారు. 1916లో మహారాష్ట్రలోని హింగోలీ జిల్లాలో నానాజీ జన్మించారు. ఆయన అసలు పేరు చండికాదాస్‌ అమృత్‌రావ్‌ దేశ్‌ముఖ్‌. చదువుకోవాలనే తన ఆశకు ఆర్థికపరమైన ఇబ్బందులు అడ్డంకిగా మారడంతో కూరగాయలు విక్రయించి వచ్చే డబ్బులతో చదువుకున్నారు. తర్వాత భారతీయ జన్‌సంఘ్‌ క్రియాశీల కార్యకర్తగా మారారు. అనంతరం బీజేపీలోనూ కీలక నేతగా బాధ్యతలు నిర్వహించారు. తను ఎదుర్కొన్న సమస్యలు సమాజంలో ఎవరికీ రావొద్దని భావించి.. పేదలు, గ్రామీణ ప్రాంతాల వారికి విద్య, వైద్యం అందేలా తనవంతు కృషిచేశారు. దేశవ్యాప్తంగా సరస్వతీ విద్యామందిరాలను ఆయన ప్రారంభించారు. 1977లో లోక్‌సభ ఎంపీగా గెలిచారు. 1999లో ఎన్డీయే ప్రభుత్వం ఆయన్ను రాజ్యసభకు నామినేట్‌చేసింది. 94 ఏళ్ల వయసులో 2010లో ఆయన కన్నుమూశారు.

ఈశాన్య ప్రాంత సంస్కృతి, జానపద సంగీతాన్ని హిందీ ప్రేక్షకులకు పరిచయం చేసిన భూపేన్‌ హజారికా.. బ్రహ్మపుత్ర కవి, సుధాకాంత పేరుతో సుప్రసిద్ధులు. మానవత్వం, సోదరభావం, సార్వత్రిక న్యాయం ఉట్టిపడేలా ఆయన అస్సామీ భాషలో రాసిన గేయాలు, పాటలు ఇతర భాషలు ముఖ్యంగా బెంగాలీ, హిందీలోకి తర్జుమా అయ్యాయి. నేపథ్య గాయకుడు, సంగీతకారుడు, రచయిత, సినీ దర్శకుడిగా భారతీయ సినీరంగంపై తనదైన ముద్ర వేసిన హజారికాను జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు వరించాయి. 2004లో బీజేపీ తరఫున గువాహటి నుంచి లోక్‌సభకు పోటీచేసి ఓటమిపాలయ్యారు. 2011 నవంబర్‌ 5న ముంబైలో కన్నుమూశారు.

NATIONAL UPDATES

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article