హైదరాబాద్ కి చెందిన ప్రణీత్ గ్రూప్ మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. మియాపూర్ మెట్రో రైల్వే స్టేషన్ చేరువలోని హైదర్ నగర్ శ్రీలా పార్కు ప్రైడ్ లో ‘ప్రణీత్ జైత్ర’ అనే భారీ ప్రాజెక్టు భూమి పూజను గురువారం ఉదయం నిర్వహించింది. దాదాపు ఐదు ఎకరాల విస్తీర్ణంలో సుమారు 450 ఫ్లాట్లను ఇందులో నిర్మిస్తారు. మొత్తం పన్నెండు లక్షల చదరపు అడుగుల స్థలాన్ని డెవలప్ చేస్తారు. పద్నాలుగు అంతస్తుల ఎత్తులో నిర్మించే ఈ ప్రాజెక్టును మూడేళ్లలోపు పూర్తి చేస్తారు. ఈ సందర్భంగా సంస్థ ఎండీ నరేంద్ర కామరాజు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాల కారణంగా హైదరాబాద్ రియల్ రంగం మళ్లీ పుంజుకుంటుందని, ప్రస్తుతం నగరంలోని వివిధ ప్రాంతాల్లో నాలుగు ప్రాజెక్టులు చేపడుతున్నామని తెలిపారు. 42 ఎకరాల్లో సుమారు 24 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని అభివ్రుద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం భూమి పూజ నిర్వహించిన ప్రణీత్ జైత్రతో పాటు బీరంగూడలో మరో ముప్పయ్ ఎకరాల్లో భారీ ప్రాజెక్టును ఆరంభించడానికి ప్రణాళికల్ని రచిస్తున్నామని వివరించారు. 34 ఎకరాల్లో 21 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని అభివ్రుద్ధి చేస్తున్నామన్నారు.