PRIYANKA HAS BIPOLAR DISORDER
- ఆమె బైపోలార్ డిజార్డర్ తో బాధపడుతోంది
- బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యలు
సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న నేపథ్యంలో ఆమెపై మొదలైన విమర్శలు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక ‘బైపోలార్ డిజార్డర్’ అనే మానసిక రుగ్మతతో బాధపడుతోందని వ్యాఖ్యానించారు. ‘‘ప్రియాంక బైపోలార్ డిజార్డర్ తో బాధపడుతోంది. ఈ కారణంగా ఆమె ప్రజా జీవితానికి పనికిరాదు. ఆమె ఎప్పుడు మానసిక సమతుల్యత కోల్పోతుందో ప్రజలు తెలుసుకోవాలి’’ అని ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. ప్రియాంకపై రాజకీయ దాడి ఇదే తొలిసారి కాదు. ఆమెను యూపీ తూర్పు విభాగానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో విమర్శల పర్వం ఊపందుకుంది. ప్రియాంక అందమైన ముఖం చూసి జనం ఓట్లు వేయరని బిహార్ మంత్రి వినోద్ నారాయణ్ ఝా వ్యాఖ్యానించగా.. అవినీతి, కళంకిత మనిషి రాబర్ట్ వాద్రా భార్య కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు చేపట్టడం బీజీపీకి లాభిస్తుందని బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీ వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్‌లో సమర్థవంతమైన నాయకులు లేరు. అందుకనే ప్రియాంకకు పదవులు కట్టబెట్టారు. చాకొలేట్ ఫేస్‌లతో వచ్చే లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొందామని కాంగ్రెస్ నేతలు కలలుగంటున్నారు’ అని బీజేపీ మరో నేత కైలాష్ విజయ్ వర్జియా ఎద్దేవా చేశారు.