దాదాపు.. 8 ఏండ్ల తర్వాత అడవి మళ్లీ ఎరుపెక్కింది. తుపాకులు గర్జించాయి. పోలీసుల తూటాలకు అన్నల ప్రాణాలు గాలిలో కలిశాయి. ఇదే సమయంలో రాష్ట్రంలోని పోలీస్ బలగాలు, ప్రత్యేక పోలీసులు తూర్పు అడవుల్లో మకాం వేశారు. అడవి అంతా గాలిస్తున్నారు. ఆదివారం జరిగిన భారీ ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఏజెన్సీలో హై అలర్ట్ వాతావరణం నెలకొంది. ఓ వైపు మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతుంటే.. మరోవైపు పోలీసు బలగాలు భారీ కుంబింగ్ నిర్వహిస్తున్నాయి. హిట్ లిస్టులో ఉన్న నేతలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక, ఈ ఎన్‌కౌంటర్‌ను ప్రజా సంఘాలు ఖండించాయి. అన్నంలో విషప్రయోగం చేశారని ఆరోపిస్తున్నారు.
అంతా భయం
ఆదివారం ఏటూరునాగారంలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ తో ఏజెన్సీ లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక.. ఏజెన్సీ గ్రామాల ప్రజలు బిక్కు బిగ్గుమంటూ గడుపుతున్నారు. మరో వైపు మావోయిస్టులు వారోత్సవాలు జరుపుకుంటున్నారు. దీంతో ఏజెన్సీలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. పెద్ద ఎత్తున బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ములుగు, ఎటూరు నాగారం, భూపాలపల్లి, ఇల్లందు, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో హై అలర్ట్ వాతావరణం నెలకొంది. కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
14 ఏళ్ల తర్వాత భారీ ఎన్ కౌంటర్..
ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం చల్పాక అటవీ ప్రాంతంలో ఈ భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. 14 ఏళ్ల తర్వాత తెలంగాణలో జరిగిన అతిపెద్ద ఎన్ కౌంటర్ ఇది. తెలంగాణ గ్రేహౌండ్స్, యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. చనిపోయిన వారిలో కుర్సం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న, గోలపు మల్లయ్య అలియాస్ మధు, ముస్సాకి దేవల్ అలియాస్ కరుణాకర్, ముస్సాకి జమున, జైసింగ్, కిషోర్, కామేష్ ఉన్నారు.
అన్నంలో విష ప్రయోగం
ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని పౌరహక్కుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. అన్నంలో విషం కలిపిన స్పృహ కోల్పోయిన తర్వాత చంపారని తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో జరిగిన ఎన్ కౌంటర్లలో 12 మంది చనిపోయారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్ కౌంటర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ములుగు జిల్లా ఏటూరునాగారం చల్పాక అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల కమిటీ స్పందిస్తూ ఓ లేఖ విడుదల చేసింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌పై పలు అనుమానాలున్నాయని.. మృతి చెందిన మావోయిస్టులకు అన్నంలో విష ప్రయోగం జరిగినట్లు స్థానిక ప్రజల ద్వారా తెలుస్తుందని పేర్కొంది. మృతదేహాలకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో శవ పరీక్ష నిర్వహించాలని, ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.
‘ఎన్‌కౌంటర్ల తెలంగాణగా మార్చింది’
కాంగ్రెస్ మళ్లీ ఎన్‌కౌంటర్ల తెలంగాణగా మార్చేసిందని లేఖలో పౌర హక్కుల కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేంద్ర హోం మంత్రిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పోలీస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరడం ఆపరేషన్ కగార్‌ను రాష్ట్రంలో అమలుపరిచే విధంగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు అర్థమవుతుందని హక్కుల కమిటీ లేఖలో పేర్కొంది. అడవిలో పోలీసు శోధన పేరుతో నిత్యం నిర్బందాలను అమలు పరుస్తూ ఎన్‌కౌంటర్ల పేరుతో మావోయిస్టులను కాల్చి చంపడాన్ని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపింది. ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై హత్యా నేరం నమోదు చేయాలని డిమాండ్ చేసింది.
కాంగ్రెస్ పాలనలో బూటకపు ఎన్‌కౌంటర్లు
ఎన్‌కౌంటర్‌పై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. కాంగ్రెస్ పాలనలో అరెస్టులు, ఆంక్షలు, బూటకపు ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయని విమర్శించారు. అరెస్టులు, బూటకపు ఎన్‌కౌంటర్లు అశాంతిని రేపుతున్నాయని.. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది విజయోత్సవాలు నిర్వహిస్తుంటే ఈ పద్ధతి ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం అన్ని వర్గాలను మోసగించి 6 గ్యారెంటీలను అటకెక్కించిందని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పాలన అంటూ డబ్బా కొట్టి.. దానికీ తూట్లు పొడిచారని ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు.