ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ను త్వరలో

111
Public Health Profile project coming soon
Public Health Profile project coming soon

తెలంగాణ రాష్ట్రంలో ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ ని చేపట్టాలని ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు, ఆ ప్రాజెక్టు పురోగతి పైన ఈరోజు మంత్రులు కె.తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు ప్రగతి భవన్ లో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గతంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ములుగు మరియు సిరిసిల్ల జిల్లాలో ఒక పైలట్ ప్రాజెక్టు చేపట్టి రెండు జిల్లాల ప్రజల హెల్త్ ప్రొఫైల్ ని సిద్ధం చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను ఆచరణలోకి తీసుకువస్తామని మంత్రులు ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఐటీ శాఖ ఆధ్వర్యంలో అనేక ప్రభుత్వ సేవలను ఆన్లైన్ మరియు మొబైల్ ప్లాట్ఫాం పైన అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ప్రస్తావించారు. టెక్నాలజీ సహకారంతో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు, అత్యంత సులభంగా ప్రభుత్వ సేవలను అందించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందువరుసలో ఉంటుందని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఆరోగ్య సమాచారనికి సంబంధించిన కనీస సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటే ఆ శాఖ పరిధిలో చేపట్టేటువంటి భవిష్యత్తు ప్రణాళికలకు సరైన ప్రాతిపదిక అవుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పౌరుల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు ద్వారా లభించే సమాచార విశ్లేషణ చేయడం వలన వివిధ జిల్లాల్లో ప్రత్యేకించి ఉన్న వ్యాధులు మరియు సీజనల్ వ్యాధుల హెల్త్ ట్రెండ్స్ ని గుర్తించవచ్చు అన్నారు. తద్వారా ఆయా ఆరోగ్య సమస్యలకు అవసరమైన నివారణ మరియు చికిత్స కు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు కలుగుతుంది అన్నారు. రోడ్డు ప్రమాదాల లాంటి సమయాల్లో అత్యవసర చికిత్స అందించేందుకు ప్రజల ప్రాథమిక సమాచారం సహాయ పడుతుంది అన్నారు.

అయితే ఇంత భారీ ప్రాజెక్టు చేపట్టి ముందు రాష్ట్రంలో చిన్న జిల్లాలైన ములుగు, సిరిసిల్ల లను ఈ ప్రాజెక్ట్ కోసం ఎంచుకున్నమన్నారు. ముందుగా ఈ రెండు జిల్లాల్లో ఉన్న వైద్య శాఖ సిబ్బంది సహకారంతో ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ప్రాథమిక వివరాలను ప్రజల ఇంటివద్దనే సేకరిస్తామన్నారు. ముఖ్యంగా బిపి షుగర్, యూరిన్ మరియు వివిధ రక్త పరీక్షల  వివరాలను అక్కడికక్కడే క్షేత్రస్థాయిలో సేకరిస్తామన్నారు. ఎవరికైనా అదనపు పరీక్షల అవసరం తలెత్తితే స్థానికంగా అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తెలంగాణ డయాగ్నస్టిక్స్ సెంటర్ల ద్వారా ఆయా పరీక్షలను నిర్వహిస్తామన్నారు. ఇందుకు సంబంధించి ప్రాథమిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన సిబ్బంది మరియు పరికరాలను అందిస్తామన్నారు.  ఇలాంటి  హెల్త్ ప్రొఫైల్ రికార్డుని ఇప్పటికే పూర్తిచేసిన ఈస్టోనియా వంటి దేశాల నమూనాలను అధ్యయనం చేయాలని సూచించారు.

ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం మారుమూల ప్రాంతమైన ములుగు జిల్లా ను పెంచుకోవడం ద్వారా అక్కడి స్థానికులకు అనేక ఉపయోగాలు కలుగుతాయని వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు తెలిపారు. ముఖ్యంగా గిరిజన జనాభా అధికంగా ఉండే ఈ జిల్లాలో ప్రజలకు అత్యవసరమైన ఆరోగ్య సేవలను అందించేందుకు వీలు కలుగుతుందని తెలిపారు.

ఈ సమావేశంలో పాల్గొన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు ప్రాజెక్టు వివరాలను మంత్రులకు తెలియజేశారు. ఈ సందర్భంగా తాము చేపట్టబోయే పైలెట్ ప్రాజెక్టు పైన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. దీనికి సంబంధించి మంత్రులు ఇచ్చిన పలు సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని మరో వారం రోజుల్లో పూర్తి మార్గదర్శకాలతో ఒక నివేదిక అందిస్తామని అధికారులు మంత్రులకు తెలిపారు. ఈ సమస్య విషయంలో వైద్య శాఖ ఉన్నతాధికారులు సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వి, వాకటి కరుణ, శ్రీనివాస్ రావు, రమేష్, గంగాధర్, ఐటీ శాఖ ఉన్నతాధికారులు జయెష్ రంజన్, జి. వెంకటేశ్వరరావు ఇతరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here