ఇవి టీడీపీ అప్పడాలు

PUBLICITY ON PAPADS

  • అప్పడాలపై చంద్రబాబు ఫొటో, క్యాప్షన్
  • పీక్స్ కి చేరిన ప్రచారం

అగ్గిపుల్ల, కుక్క పిల్ల, సబ్బు బిళ్ల.. కాదేదీ కవితకు అనర్హం అని శ్రీశ్రీ అంటే.. ఆటో, రైలు, అప్పడం.. కాదేదీ ప్రచారానికి అనర్హం అని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏ పనిచేసినా ప్రచారానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారనే సంగతి తెలిసిందే. కేవలం తాము చేసిన పనులు చెప్పుకోవడానికి కోట్లకు కోట్లు వెచ్చిస్తుంటారు. పబ్లిసిటీ బలంగా కోరుకునే నాయకుల్లో చంద్రబాబు కూడా ఒకరు. తుఫాను బాధితులకు చేసిన సాయం నుంచి ఆటో డ్రైవర్లకు రద్దు చేసిన లైఫ్ ట్యాక్స్ వంటి అంశాలపై జోరుగానే ప్రచారం చేసుకున్నారు. శ్రీకాకుళం తుఫాను బాధితులకు పూర్తి స్థాయిలో సాయం అందకపోయినా.. తాము చాలా సాయం చేసినట్టుగా ఆర్టీసీ బస్సులపై పెద్దపెద్ద పోస్టర్లు వేయడం వివాదానికి కూడా దారితీసింది. తాజాగా ఆటోలు, ట్రాక్టర్లపై లైఫ్ ట్యాక్స్ రద్దు చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ‘థ్యాంక్యూ సీఎం సార్’ అనే నినాదంతో కూడిన పోస్టర్లను ఆటో డ్రైవర్లకు పంచిపెట్టి, తమ ఆటోలపై అతికించుకోవాలని టీడీపీ నేతలు వారికి సూచించారు.

తాజాగా ఈ ప్రచారార్భాటం మరింత పీక్ స్టేజీకి చేరింది. భోజనాల్లో వడ్డించే అప్పడాలపై కూడా చంద్రబాబు ఫొటో.. థాంక్యూ సీఎం గారు, ద లీడర్ అని ముద్రించడంపై సోషల్ మీడియాలో వ్యంగాస్త్రాలు పేలుతున్నాయి. చిత్తూరులోని దొడ్డిపల్లెలో జరిగిన పసుపు కుంకుమ సభ సందర్భంగా ప్రజలకు ఏర్పాటు చేసిన భోజనంలో బాబు ఫొటో ఉన్న అప్పడాలు ఇచ్చారు. దీనిపై పలువురు విమర్శలు సంధిస్తున్నారు. ‘ఆశ-దోచే-అప్పడం బాబు..! కుర్చీ మీద ఆశతో రాష్ట్రాన్ని దోచి ప్రచార పిచ్చితో ఆఖరికీ అప్పడాలపై, టిష్యూ పేపర్‌లపై, బాత్రూం కమోడ్లపై కూడా ప్రచారం చేసుకుంటున్నావ్! ఇదేం పిచ్చి బాబు!?’ అంటూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ లో పేర్కొన్నారు. మొత్తమ్మీద తెలుగు తమ్ముళ్ల అత్యుత్సాహం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article