రేడియోలన్నీ ట్రాజిక్ అండ్ పెట్రో ఎఫ్ఎంలే!

Radio are in Tragic and Petro FM

ఎఫ్ఎం రేడియోల్లో ప్రసారమయ్యే పాటలు వింటూ శ్రోతలు మైమరచిపోతున్నారనడంలో రెండో ఉద్దేశ్యమే అక్కరలేదు. శ్రావ్యమైన సంగీతాన్ని అందించడంలో అవి పడతున్న పోటీ ముదావహం. ఆ విషయంలో ఎఫ్ఎం రేడియోలకు రెండు ఓలు ఎక్కువే ఏసుకోవచ్చు. కానీ మేం నిర్వర్తిస్తున్నాం, అని వాటి మేనేజ్ మెంట్లు గర్వంగా చెప్పుకొంటున్న సామాజిక బాధ్యతల్లోనే, రేడియోల బాధ్యతారాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అసలు చాలా మంది ఎఫ్ఎం రేడియోలు వినే పర్పస్ ఒకటుంది. సరిగ్గా అక్కడే జనం మిస్ లీడ్ అవుతున్నారు, కాదు.. కాదు.. రేడియో జాకీలు వాళ్ళను మిస్ లీడ్ చేస్తున్నారనడం కరెక్టేమో!! ఏంటది అంటారా? అదేనండీ, ఎఫ్ఎంల్లో ప్రసారమయ్యే ట్రాఫిక్ అప్ డేట్స్.

క్రీ. శ. 1895 – 96 లో ఇటాలియన్ శాస్త్రవేత్త గుగ్లిమో మార్కోని ఎలెక్ట్రో మాగ్నెటిక్ రేడియో వేవ్స్ ద్వారా రేడియో రూపంలో మొదటితరం ఎలక్ట్రానిక్ కమ్యునికేషన్ మాధ్యమాన్ని సృష్టించారు. ఆ తరవాత క్రీ. శ 1900 లులో అది పూర్తిస్థాయి వాణిజ్యపర కార్యకలాపాల్లో భాగస్వామి అయింది. ప్రజలకు సమాచారం చేరవేసే ఒక బలమైన మీడియంగా తయారైంది. క్రీ. శ 1927 లో ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ (ఐబీసీ) కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట భారత్ లో మొట్టమొదటిసారి ప్రైవేట్ రంగంలో బొంబాయి, కలకత్తా కేంద్రాలుగా రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యాయి. ఆ తరవాత క్రీ. శ 1956 లో ఆకాశవాణి పేరిట ఆల్ ఇండియా రేడియో ప్రసారాలు షురువయ్యాయి. శ్రీలంకలోని సిలోన్ కేంద్రం నుంచి ప్రసారమైన వివిధభారతీ, ఆల్ ఇండియా రేడియో, బినాక గీత్ మాలా వాణిజ్య కార్యక్రమాలు అప్పట్లో ప్రజలను ఉర్రూతలూగించాయనడంలో ఆశ్చర్యం లేదు. అలాగే వివిధ సామాజిక అవగాహనా కార్యక్రమాలను కూడా అప్పట్లో ఎయిర్ (AIR) ప్రసారం చేసింది. ఆ తరవాత టెలివిజన్ విప్లవం రేడియోల పుట్టి ముంచింది. రేడియోలు తాత్కాలికంగా సమాజ ఆదరణ కోల్పోయేలా చేసింది.

కొన్నేళ్ల తరవాత అంటే క్రీ. శ 2001 లో రేడియో సిటీ రూపంలో ముంబై, బెంగుళూరుల నుంచి మళ్లీ రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. ఈసారి కేవలం 100 కి. మీ వ్యాసార్థంలో పని చేసే ఎఫ్ఎం (ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్) రేడియోల హవా ఊపందుకుంది. వీటిని జన సామాన్యానికి చేర్చడంలో మొబైల్ ఫోన్లు, రవాణా సాధనాలది ప్రధాన పాత్ర. అమెరికా లాంటి దేశాల్లోనైతే స్థానిక అవసరాలు తీర్చడంలో, ఎఫ్ఎం రేడియోలు కీలక పాత్రను పోషిస్తున్నాయి. భారతావనిలో కూడా ఎఫ్ఎం రేడియోలు ప్రస్తుతం అలాంటి భూమికనే పోషిస్తున్నాయి.

ఐతే, శ్రోతలకు శ్రావ్యమైన సంగీతం అందించటం ఎఫ్ఎం రేడియోల ప్రధాన విధి. ఐనప్పటికీ, రాష్ట్రంలోని ముఖ్య నగరాల్లో రోజువారీ ట్రాఫిక్ అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు జనాలకు అందించే గురుతరమైన సామాజిక బాధ్యతను అవి నెత్తినేసుకున్నాయి. తద్వారా, జనంలోకి బహుశా మరింత బలంగా చొచ్చుకుపోవచ్ఛనేది వాటి వ్యూహం అయి ఉంటుంది. అటు కమ్యూటర్స్ కూడా వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఎలా ఉంది? ఏ దారిలో వెళ్తే అతి తక్కువ ట్రాఫిక్ ఉంటుంది? ఏ రూట్లో ప్రయాణిస్తే సమయం వృధా కాదు? అతి తక్కువ పెట్రోల్ ఖర్చుతో తమ గమ్యాన్ని ఎలా చేరుతామన్న అంశాలపై దృష్టిసారించడం సర్వసాధారణం. అందుకోసం జనం ఎక్కువగా ఎఫ్ఎం రేడియోలపైనే ఆధారపడటం కద్దు!

సరిగ్గా ఇక్కడే ఎఫ్ఎం రేడియో జాకీలు జనాలతో తప్పులో కాలేయిస్తున్నారు. గజిబిజి సమాచారాన్నందించి వాళ్ళను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఒక్కటంటే ఒక్క సందర్భంలో, ఒక్కటంటే ఒక్కసారి కూడా జాకీలు, ఆ దిశలో జనాలకు సరైన సమాచారం అందివ్వలేకపొతున్నారు. ఫలానా తోవలో ప్రస్తుతం ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంది, వాహనదారులు ఆ రూట్లో వెళ్లకండి అంటూ అదేదో జాగ్రత్తలు చెబుతున్నట్లు చెబుతూ, విశ్వసనీయత లేని సమాచారంతో తప్పుడుగా దారి మళ్ళించడం ఇవాళ షరా మామూలైంది. కొన్నిసార్లు జాకీలు, తామే స్వయంగా నగరంలోని ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించి స్టూడియోలకు చేరుకున్నట్లు వ్యాఖ్యానిస్తూ, లేనిపోని బిల్డప్ ఇస్తూ ప్రత్యామ్నాయాలు కూడా సూచిస్తూ కమ్యూటర్స్ తో ఒకరకంగా ఆడుకుంటున్నారనే వాదనలున్నాయి. తీరాచూస్తే, వాస్తవ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటున్నాయి. వాళ్ళు చెప్పినట్లు ఒక్కసారి దారి మళ్ళితే, ఇక అంతే సంగతులు! చాలా సందర్భాల్లో వాహనదారులు ప్రయాణించే దూరం పెరిగి, సమయం, పెట్రోలు రెండూ వృధా అవుతున్నాయి. కొంత విమర్శణాత్మక ధోరణితో చూస్తే, ఈ ఎఫ్ఎం రేడియోలన్నీ పెట్రోలియం కంపెనీలతో కుమ్మక్కయ్యాయా అనే అనుమానం కూడా సగటు వాహనదారుడికి కలగకమానదు. మరోవైపు రేడియో ద్వారా అందిన సమాచారాన్ని అనుసరించి, ఒకవేళ దారి మళ్ళితే, సదరు తోవలోనే ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండి, వాహనదారులు ఇక్కట్లు పడే పరిస్థితి ఎదురవుతోంది. నగరంలో ట్రాఫిక్ మూవ్ మెంట్ పై ఎఫ్ఎం రేడియోలో వచ్చే ఇన్ఫర్మేషన్ను పట్టించుకోకుండా అదే రూట్లో ముందుకు వెళ్తే, ఎక్కడా ట్రాఫిక్ రద్దీ లేకుండా, ప్రయాణం సాఫీగా, సమయం, పెట్రోల్ వృధాలకు ఆస్కారం లేకుండా సాగుతోందనడంలో ఆశ్చర్యమే లేదు.

ఐతే, రేడియో వాళ్ళకు అందిన సమాచారం జనాలకు చేరవేసేందుకు విధిగా కొంత సమయం పడుతుందనే వాదనను ఇక్కడ వినిపించే ఆస్కారం ఉంటుంది. ఆలోపు రోడ్లపై పరిస్థితులు మారిపోయే అవకాశాలు ఉంటాయినే వాదనలు వినిపించవచ్చు. మరి అదే నిజమైతే, అలా తాజా స్థితిని కోల్పోయిన, స్పాట్ లో నెలకొని ఉన్న పరిస్థితికి భిన్నమైన సమాచారాన్ని రేడియో జాకీలు జనాలకు చేరవేయడంలో అర్థమేంటి? జాకీలు, యాజమాన్యాల వ్యవహారశైలి ఆంతర్యమేమిటి? ముక్తసరిగా, ఏదో ఇచ్చమా అంటే ఇచ్చాం.. మిగిలిన చావు రోడ్లపై సంచరించే వాళ్ళు చస్తారనే చందంగా వ్యవహరించడంలో వాళ్ళ ఔచిత్యం ఏమిటి? నిజంగా చిత్తశుద్ది ఉంటే రేడియో యాజమాన్యాలు ట్రాఫిక్ అప్ డేట్స్ కోసం ప్రత్యేకంగా రిపోర్టులను పెట్టుకుంటే స్పాట్ నుంచి విశ్వసనీయ సమాచారం అందే అవకాశాలు ఉంటాయి కదా! అలా చేయకపోతే, ఈ ఇక్కట్లు పడే బదులు, అసలు ఎఫ్ఎం రేడియోలను ఫాలో అవకపోతేనే బెటరని కమ్యూటర్లు అనుకునే పరిస్థితి తలెత్తే అవకాశాలు లేకపోలేదు, తద్వారా మరోసారి రేడియోల ఉనికి ప్రశ్నార్థకంలో పడే ప్రమాదం లేకపోలేదు. సో రేడియో జాకీస్ తస్మాత్ జాగ్రత్త!!

అందుకే ప్రస్తుతం మనుగడలో ఉన్న ఎఫ్ఎం రేడియోలు జనాల విశ్వాసం కోల్పోయి మ్యాజిక్ బదులు ట్రాజిక్ గా, మెట్రో, రెట్రోలకు బదులు పెట్రోలియం కంపెనీలతో కుమ్మక్కైన పెట్రో ఎఫ్ఎంలుగా మారిపోయాయనడంలో తప్పులేదు.

#సూరజ్ వి. భరద్వాజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *