rafale deal cag report …. కపిల్ సిబల్ సంచలనవ్యాఖ్యలు
కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను దేశవ్యాప్తంగా కుదిపేస్తున్న రఫేల్ అంశంలో మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రూ.59,000 కోట్ల ఈ డీల్‌పై నివేదికను కాగ్ సోమవారం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలుస్తోంది.బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నివేకను కేంద్రం పార్లమెంట్ ముందుకు తెచ్చే అవకాశముంది. రఫేల్‌పై కాగ్ నివేదిక సమర్పించిన అనంతరం సాధారణంగా ఓ ప్రతిని రాష్ట్రపతి, మరోపత్రిని కేంద్ర ఆర్థిక శాఖకు పంపుతారు. అనంతరం కాగ్ నివేదికను పార్లమెంట్‌లో ఎప్పుడు ప్రవేశపెట్టాలన్నది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది.
రఫేల్‌పై కాగ్ నివేదికను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన తర్వాత సమీక్ష కోసం పబ్లిక్ అకౌంట్ కమిటీకి పంపుతారు. ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే పీఏసీకి నేతృత్వం వహిస్తున్నారు. కాగా రఫేల్‌పై పూర్తి అధ్యయానికి కాగ్‌కు ఏడాదిపైగా సమయం పట్టింది. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమాన ధరల వివరాలతోపాటు, ఇతర దేశాలు సమకూర్చుకున్న వాటి ధరలతో పోల్చి ఈ నివేదిక తయారు చేసినట్లు తెలుస్తోంది. 2016 సెప్టెంబర్ 23న 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఇరు ప్రభుత్వాల మధ్య రాతపూర్వక ఒప్పందం జరిగింది. కాగా ఇందులో 50 శాతం ఆఫ్‌సెట్ కాంట్రాక్ట్‌ను అనిల్ అంబానీ కంపెనీకి కట్టబెట్టిన వైనంపైనా కాగ్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
అయితే రఫేల్ విమాన ధరల్లో భారీ వ్యత్యాసముందని, ఈ డీల్‌లో భారీ కుంభకోణం జరిగిందని, ప్రధాని మోదీ అనీల్ అంబానీ కి రూ.36 వేల కోట్ల మేర లబ్ధి చేకూర్చారని కాంగ్రెస్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.కాగా బుధవారంతో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. దీంతో కాగ్ నివేదికను కేంద్రం వెంటనే ఉభయ సభల్లో ప్రవేశపెట్టే అవకాశముంది. తద్వారా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రఫేల్ వివాదం నుంచి బయటపడాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యోచిస్తోంది.
మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ పట్ల మితిమీరిన విధేయత చూపుతున్న అధికారులపై తాము కన్నేసి ఉంచామని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ అన్నారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని, అవి మారుతుంటాయని వారు గుర్తెరగాలని ఆయన హితబోధ చేశారు. ఎన్నికల ప్రక్రియలో తాము కొన్నిసార్లు విపక్షంలో ఉంటే మరికొన్నిసార్లు అధికారంలో ఉంటామని, ప్రభుత్వ అధికారులు ఈ విషయం గమనించాలన్నారు.రాజ్యాంగం అన్నింటికంటే పెద్దదన్న సంగతి ప్రథాని పట్ల మితిమీరిన విధేయత చూపుతున్న అధికారులు గుర్తుపెట్టుకోవాలన్నారు. రఫేల్‌పై నివేదకను కాగ్ సమర్పించనున్న నేపథ్యంలో కపిల్ సిబల్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
For More Click Here