వచ్చే సంక్రాంతి కోసం బోలెడన్ని సినిమాలు ముస్తాబవుతున్నాయి. టార్గెట్ అయితే చాలా మంది పెట్టుకున్నారు కానీ… రీచ్ అయ్యేది ఎంతమందో తెలియదు.మొదట్నుంచీ పుష్ప2 అయితే సంక్రాంతి రేసులో ఉంది. పవన్‌కల్యాణ్ సినిమా
కూడా ఏదో ఒకటి రావొచ్చని ప్రచారం. మరి ఏ సినిమా ఎప్పుడు చిత్రీకరణ పూర్తి చేసుకుంటుందో.. ఎప్పుడు విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి.ప్రస్తుతానికి మాత్రం ఓ రెండు సినిమాలు వచ్చే సంక్రాంతిని గట్టిగా టార్గెట్ చేసుకున్నాయి. దాదాపుగా ఆ రెండే అని ట్రేడ్ వర్గాలు కూడా లెక్కగడుతున్నాయి. అవి ఏవో కాదు… మహేష్‌బాబు – త్రివిక్రమ్ సినిమా ఒకటైతే, రామ్‌చరణ్ – శంకర్ సినిమా మరొకటి. మహేష్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా మొదట ఆగస్టు టార్గెట్‌తో సెట్స్‌పైకి వెళ్లింది. కానీ చిత్రీకరణ ఆశించిన స్థాయిలో వేగంగా సాగడం లేదు. దాంతో ఆ సినిమా సంక్రాంతి లక్ష్యంగా ముస్తాబవుతోందని సమాచారం. ఇక రామ్‌చరణ్ – శంకర్‌ల సినిమా పూర్తి కావడానికి కూడా కొంచెం ఎక్కువ సమయమే పట్టే అవకాశాలున్నాయి.
నిజానికి 2023 సంక్రాంతి లక్ష్యంగా ఆ సినిమా పట్టాలెక్కింది. కానీ ఇప్పటికి ఆ సినిమా 60 శాతం మాత్రమే పూర్తి చేసుకుంది. ఇంకా నలభై శాతం చిత్రీకరణ జరగాల్సి వుంది. అందుకే ఆ సినిమాని వచ్చే సంక్రాంతికే విడుదల చేయాలని నిర్ణయించారు. శంకర్ సినిమా అంటే పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలు బోలెడన్ని ఉంటాయి. అందుకే కాస్త ఎక్కువ సమయమే తీసుకుని సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు దర్శకనిర్మాతలు. ఈ రకంగా చూస్తే వచ్చే సంక్రాంతికి మహేష్ వర్సెస్ రామ్‌చరణ్‌ల మధ్యే బాక్సాఫీసు దగ్గర పోటీ నెలకొంటుందన్నమాట.