అరుదైన ఎముక క్యాన్సర్ తొలగించి, కాలును కాపాడేందుకు 9 గంటల సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేసిన అమోర్ ఆస్పత్రి వైద్యులు భారతదేశంలో అత్యుత్తమ ఆర్థో ఆంకాలజీ సర్జన్లలో ఒకరైన డాక్టర్ కిషోర్ బి. రెడ్డి అత్యంత సవాలుతో కూడిన పరిస్థితిలో ఈ శస్త్రచికిత్స చేశారు హైదరాబాద్, జూలై , 2022: నగరంలోని ప్రధానమైన మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులలో ఒకటైన అమోర్ ఆస్పత్రిలో వైద్యులు ఒక వృద్ధుడికి మోకాలి వెనక ఉన్న అరుదైన క్యాన్సర్ తొలగించేందుకు 9 గంటల పాటు సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. డాక్టర్ కిశోర్ బి. రెడ్డి నేతృత్వంలోని బృందం ఈ శస్త్రచికిత్స చేసింది. ఆయన భారతదేశపు ఉత్తమ ఆర్థో ఆంకాలజీ సర్జన్లలో ఒకరు. ఇది రోగి కాలును కాపాడటానికి సహాయపడింది, లేకపోతే కాలు తీసేయాల్సి వచ్చేది.కె. ధర్మారెడ్డి (66) రిటైర్డ్ ప్రొఫెసర్. మోకాలు, కాలులో తీవ్రమైన నొప్పి మొదలవ్వడంతో ఆయనను అమోర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇంతకు ముందు, వేరికోస్ వెయిన్స్ కారణంగానే ఈ నొప్పి వచ్చిందని భావించి రోగికి చికిత్స చేశారు. వాళ్ల కుటుంబం చేసిన కొన్ని ప్రయత్నాల తర్వాత నొప్పి తగ్గడంతో.. అధునాతన రోగ నిర్ధారణ, చికిత్స కోసం డాక్టర్ కిశోర్ బి. రెడ్డి వద్దకు తీసుకొచ్చారు.
ఈ కేసు గురించి, తాము చేసిన శస్త్రచికిత్స గురించి అమోర్ ఆస్పత్రి హెడ్ ఆర్థోపెడిక్స్ & ఆర్థోపెడిక్స్ ఆంకాలజీ సర్జన్ డాక్టర్ కిశోర్ బి. రెడ్డి మాట్లాడుతూ, “మోకాలి వెనక ఒక పెద్ద కణితి ఉంది. అది ఈ ప్రాంతంలోని ధమని, సిర, నరాలు, కండరాలతో కలిసిపోయింది. కణితిని బయాప్సీ చేయగా, కొండ్రోసార్కోమా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఇది ఒక అరుదైన క్యాన్సర్. ఇది ఉన్నట్లుగా ఎలాంటి లక్షణాలు కనిపించవు గానీ, తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ఒక్కోసారి కాలు తీసేయాల్సి వస్తుంది. ఈ కేసులో కూడా కాలు తీసేయడం అనేది అందుబాటులో ఉన్న ఒక ఆప్షన్. కానీ మేం మాత్రం కణితిని తొలగించి, కాలును కాపాడాలనే సవాలును తీసుకున్నాం. 9 గంటల సుదీర్ఘ శస్త్రచికిత్స చేశాం. ఇందులో మైక్రోవాస్కులర్, ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ సూర్య కీర్తన, ఇతర నిపుణులతో కూడిన మా బృందం, కణితిని వేరు చేయడానికి కష్టపడ్డాం. రక్తప్రసారాన్ని పునరుద్ధరించడానికి ధమనిని కూడా పునర్నిర్మించాం. మరో కాలు నుంచి తీసిన రక్తనాళాన్ని పునర్నిర్మాణంలో ఉపయోగించాం. ఈ శస్త్రచికిత్సలో అన్నింటికంటే అత్యంత క్లిష్టమైన అంశం ఏమిటంటే, రోగిని ప్రోన్ పొజిషన్ లో ఉంచి (రోగిని వెల్లకిలా పడుకోబెట్టడం) ఈ ప్రక్రియను నిర్వహించడం. దీనివల్ల శస్త్రచికిత్స కొంత క్లిష్టతరం అవుతుంది” అని తెలిపారు.ఈ సంక్లిష్టమైన శస్త్రచికిత్స తర్వాత, రోగిని ముందుగా పరిశీలనలో ఉంచి, ఐదోరోజున విజయవంతంగా నడిపించారు. మంగళవారం జూన్ 5న రోగి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు ఎవరి సాయం అక్కర్లేకుండా సొంతంగా మెట్లు కూడా ఎక్కుతున్నారు. అమోర్ ఆస్పత్రి వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ అత్యంత క్లిష్టమైన, సంక్లిష్టమైన ఆరోగ్య సమస్యలకు సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ చికిత్స లభిస్తుంది.