ఘనంగా రథసప్తమి వేడుకలు

RADHA SAPTHAMI FESTIVAL . కిటకిటలాడుతున్న దేవాలయాలు

తెలుగు రాష్ట్రాల్లో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రసిద్ద పుణ్యక్షేత్రాల్లో సోమవారం అర్ధరాత్రి నుండే వేడుకలు ప్రారంభమయ్యాయి.తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి.మాఘ శుధ్ద సప్తమి సూర్య జయంతి రోజు రధ సప్తమి నిర్వహించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. రథ సప్తమి నాడు ప్రాతః కాల సూర్యకిరణాలచే పుణ్య క్షేత్రాలు మహా మహిమాన్వితంగా ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి.
మలయప్ప స్వామి శోభాయమానంగా ఏడు వాహనాలపై ఊరేగుతూ తన దివ్యమంగళ రూప దర్శన భాగ్యాన్ని భక్తులకు కలిగిస్తున్నారు. వాహన సేవల్లో ఉత్సవ మూర్తులను తిలకించేందుకు సోమవారమే వేలాదిగా భక్తులు తిరుమల చేరుకున్నారు. తిరుమాడ వీధుల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రథసప్తమి ఒక్కరోజే 15 లక్షల మంది భక్తులు మలయప్ప స్వామిని దర్శించుకుంటారని టిటిడి అధికారులు చెబుతున్నారు.
మంగళవారం తెల్లవారుఝామున 4 గంటలకు మలయప్పస్వామి వాహన మండపానికి వేంచేయడంతో సప్తవాహన సేవలు మొదలయ్యాయి. మలయప్ప స్వామి వారు ఈ తెల్లవారు ఝూమన సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేశారు. 9 గంటలకు చిన శేషవాహనం పై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చి అనంతరం 11 గంటలకు కు గరుడవాహనం, మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహనం, సాయంత్రం 4 కు కల్పవృక్షవాహనం, 6 గంటలకు సర్వభూపాలవాహనం, రాత్రి 8 నుంచి చంద్రప్రభ వాహనంపై శ్రీవారి ఊరేగింపు వేడుక శోభాయమానంగా జరుగుతోంది.
శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో సైతం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అర్ధరాత్రి నుండే వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారి పూజాదికాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు వేకువజామున స్వామివారి సుప్రభాత సేవ ప్రాతః కాల అర్చనతో పాటు స్వామివారికి మహాభిషేకాన్ని నిర్వహించారు. రథసప్తమి వేడుకలకు అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు 1.5 లక్షల వరకు భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని కోసం భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు . విజయనగరం జిల్లాలోని బాబామెట్ట ఏడు కోవెల సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువజాము నుండే స్వామివారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలతో పూజాధికాలు నిర్వహిస్తున్నారు. శృంగవరపుకోట పట్టణంలో ఉన్న సూర్యనారాయణ స్వామి దేవాలయంలో సైతం భక్తులు బారులుతీరారు.

తెలంగాణ రాష్ట్రం లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో రథసప్తమి సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం భక్త జన సందోహంతో కిటకిటలాడుతోంది. అలాగే వరంగల్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక సేవలతో స్వామివారి కైంకర్యాదులు నిర్వహిస్తున్నారు. వేయి స్తంభాల దేవాలయంలో సైతం రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రథసప్తమి వేడుకలతో అటు బాసర క్షేత్రం కొత్త కళను సంతరించుకుంది.
రథ సప్తమి నాడు ఆ సూర్య భగవానుని దయ ఉంటే సర్వ పాపాలు తొలగిపోయి, అనారోగ్య బాధలు తీరుతాయని ప్రతీతి.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article