Reasons Behind CM Jagan Sudden Visit Delhi
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సడన్‌గా ఢిల్లీకి వెళ్ళారు. ఉన్నట్లుండి ఆయన ఢిల్లీ టూర్ వెనుక బలమైన కారణమే వుందంటున్నాయి ఏపీ రాజకీయ వర్గాలు.మంగళవారం ఉదయం నుంచి వివిధ రివ్యూలతో బిజీగా వున్న ఏపీ ముఖ్యమంత్రి సాయంత్రానికి ఢిల్లీ వెళ్లాలని నిర్ణయం తీసుకుని నేడు ఉదయమే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారు . అయితే ఢిల్లీ పర్యటన వెనుక కారణమేంటనేది సీఎంఓ వెల్లడించలేదు. దాంతో జగన్ ఢిల్లీ పర్యటన వెనుక బలమైన కారణాలున్నాయంటూ ప్రచారం జరిగింది. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో గత పదిహేను రోజులుగా ఢిల్లీ వెళ్ళాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు బిజీబిజీగా వుండడంతో ఢిల్లీ వెళ్ళినా పెద్దగా ప్రయోజనం వుండదన్న ఉద్దేశంతో ఆయన జాప్యం చేశారు. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాలను కల్వడం సాధ్యమవుతుందన్న విశ్వాసంతో జగన్ ఢిల్లీ పర్యటనకు పూనుకున్నట్లు తెలుస్తోంది.మండలి రద్దు బిల్లును వీలైనంత తర్వగా పార్లమెంటు ముందుకు తేవాలని కోరేందుకు జగన్ ఆయన ఢిల్లీకి వెళుతున్నారని తెలుస్తోంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తొలి విడత ముగిసిన నేపథ్యంలో కనీసం మార్చి రెండో తేదీన ప్రారంభం కానున్న రెండో విడత బడ్జెట్ సమావేశాల్లోనైనా మండలి రద్దును పార్లమెంటు ముందుకు తెప్పించుకోవాలన్నదే జగన్ భావన అని తెలుస్తోంది. దానికి తోడు కేంద్ర బడ్జెట్లో ఏపీకి మొండి చేయి చూపారన్న అంశం రాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్థులకు అందివచ్చిన అవకాశంగా మారింది. ఈ నేపథ్యంలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగానైనా ఏపీ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కోరాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.