కోవిడ్ చికిత్సల ధరలపై కొత్త జీవో ఇవ్వండి
అధిక ఫీజులు వసూలు చేసిన హాస్పిటల్స్ నుంచి బాధితులకు రిఫండ్ ఇప్పించండి
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు..
కోవిడ్ 19 చికిత్సలకు గరిష్ఠ ధరలను నిర్ణయిస్తూ జీవో ఇవ్వాలని హైకోర్టు మరోసారి రాష్ర్ట ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండవ దశ కరోనా సమయంలో ఎందుకు జీవో విడుదల చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. మొదటి దశ లో ఇచ్చిన జీవో ను ఇప్పటికీ అమలు చేస్తున్నారా అని ప్రశ్నించింది. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై చీఫ్ జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బీ విజయ్‌సేన్ రెడ్డిల ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ఈ విచారణకు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు హాజరై కోర్టుకు వివరణ ఇచ్చారు. ధరల నియంత్రణ, అధిక ఫీజుల జీవో జారీ అంశాన్ని మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని డీహెచ్ తెలిపారు. ధరల నియంత్రణ పై ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేసి ప్రభుత్వ వెబ్ సైట్లో పెట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ప్రయివేటు హాస్పిటల్స్ ప్రత్యేక నిఘా.. డీహెచ్
మొదటి దశ కరోనా సమయంలో ప్రయివేటు హాస్పిటల్స్ నుండి పేషేంట్స్ కు రూ.3 కోట్లు రిఫండ్ ఇప్పించామని డీహెచ్ హైకోర్టుకు తెలిపారు. ఈ సారి కూడా ప్రయివేటు హాస్పిటల్ లో వసూలు చేసిన వారికి రిఫండ్ ఇప్పిస్తామని కోర్టుకు తెలిపారు. ఇటీవల ఓ ప్రయివేటు హాస్పిటల్ రూ.17 లక్షలు బిల్ వేసిందని, తాము చర్యలు చేపడితే రూ.10 లక్షలు పేషెంట్ బంధువులకు రిటర్న్ చేశారని పేర్కొన్నారు. ప్రయివేటు హాస్పిటల్స్ లో అధిక ధరలపై ఎందుకు ప్రభుత్వం నియంత్రణ చెయ్యడం లేదని హైకోర్టు అడిగింది. వెంటనే కొత్త జీవో ఇవ్వాలని ఆదేశించింది.
బ్లాక్ ఫంగస్ నియంత్రణకు చర్యలు..
ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 800 కేసులు బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని డీహెచ్ కోర్టుకు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే 85 శాతం మంది బ్లాక్ ఫంగస్ రోగులున్నారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 72 ప్రయివేటు హాస్పిటల్స్ లో చికిత్స అందిస్తున్నామన్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్స ఔషధాలను కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్నదని, రాష్ట్రప్రభుత్వం కూడా స్వయంగా 30 వేల ఇంజిక్షన్స్ సేకరిస్తున్నదని తెలిపారు. బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ ధర రూ.3 వేలు వరకు ఉందని తెలిపారు. మరోవైపు ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తే వాటి అనుమతులు పునరుద్ధరించే అంశాన్ని పరిశీలించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. ప్రస్తుత పాండమిక్ సమయంలో ఆస్పత్రుల సేవలు చాలా అవసరమని తెలిపింది. ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకున్న ప్రైవేటు హాస్పిటల్స్ నుంచి బాధితులకు రీఫండ్ చెల్లించేలా చర్యలు తీసుకోండని ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ, ప్రయివేటు దవాఖానల్లో బెడ్స్ పై రియల్ టైం గణాంకాలు ఇవ్వాలని తెలిపింది. కాగా అధిక బిల్లులు వేయకుండా ప్రతి ప్రైవేటు హాస్పటల్లో నోడల్ అధికారి నియామకం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని డీహెచ్ హైకోర్టుకు తెలిపారు. టాస్క్‌ఫోర్స్ టీంలు అధిక బిల్లులపై చర్యలు తీసుకుంటున్నాయని వివరించారు. సీరో సర్వేలెన్స్, జీనోం సీక్వెన్స్ వివరాలను సీసీఎంబీ, ఎన్ఐఎన్ నుంచి సేకరించి సమర్పిస్తామని డీహెచ్ పేర్కొన్నారు.
- ప్రతి ప్రభుత్వ దవాఖానలో అక్సీజన్ ప్లాంట్, ప్రభుత్వ దవాఖానల్లోని అన్నిబెడ్లకు ఆక్సీజన్ ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. కోవిడ్ మూడో వేవ్‌కు సిద్ధంగా ఉండడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రివర్గం ఇప్పటికే మాకు ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుత 33 జిల్లాల్లో ఆర్టీ పీసీఆర్ టెస్ట్ సెంటర్లు ఉన్నాయని తెలిపారు. వచ్చే విచారణలో అన్ని వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని.. కోవిడ్ చికిత్సలకు ధరలు నిర్ణయించి జీవో ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. మూడో దశ కరోనా కు ప్రభుత్వం ఏ విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారో తెలపాలని హైకోర్టు ఆదేశించింది. దారిద రేఖ కు దిగువ ఉన్న కుటుంబాలకు రాష్ట ప్రభుత్వ సాయంపై వివరాలు సమర్పించాలని తెలిపింది. మొబైల్ వాహనాలతో టెస్ట్‌లు పెంచాలని తెలిపింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విధులు నిర్వహించి కరోనా తో మృతి చెందిన ఉపాధ్యాయులకు ఎలాంటి బెనిఫిట్స్ ఇచ్చారో నివేదిక ఇవ్వాలని తెలిపంది. తదుపరి విచారణను ఈ నెల 10 కి వాయిదా వేసింది.