RERA Penalty on 100 Builders?
# మూడు నెలల క్రితమే తెలంగాణ రెరా యాక్షన్ షురూ
# ఈ విషయం కనుక్కోకుండా ఓ మీడియా సంస్థ ఓవర్ యాక్షన్
# అతిగా స్పందించిందని నిర్మాణ సంఘాల అభిప్రాయం
రియల్ రంగంలో యూడీఎస్, ప్రీ లాంచ్ ఆఫర్ల మీద కొద్ది రోజుల క్రితం ఒక ప్రముఖ టీవీ ఛానెల్ హడావిడి చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త స్కామ్ ను బయటపెట్టినంత బిల్డప్ ఇచ్చింది. సదరు ఛానెలే ఈ స్కామ్ ను వెలుగులోకి తెచ్చినంతగా హైప్ చేసింది. నిజానికి యూడీఎస్, ప్రీ లాంచ్ ఆఫర్లు అనేవి ఏడాదిన్నర నుంచి రాష్ట్రంలో ఆరంభమయ్యాయి. కరోనా కంటే ముందు స్టార్ట్ అయిన యూడీఎస్ స్కీమ్ సేల్స్ కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత ఉదృతమైంది. అయితే, ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకున్న తెలంగాణ నిర్మాణ సంఘాలు విషయాన్ని తెలంగాణ రెరా అథారిటీ దృష్టికి తీసుకొచ్చాయి. దీంతో, గత మూడు నెలల నుంచే తెలంగాణ రెరా అథారిటీ యాక్షన్ తీసుకోవడం ఆరంభించింది. ప్రీలాంచ్, యూడీఎస్ పథకాల్ని విక్రయిస్తున్న 100కు పైగా రియల్ సంస్థలు, ఏజెంట్లకు ఇదివరకే షోకాజ్ నోటీసుల్ని జారీ చేసింది. ఇందులో కొందరు రెరా వద్దకు విచ్చేసి తమ తప్పుని అంగీకరించారు. తెలంగాణ రెరా కింద రిజిస్టర్ చేసుకున్నారు. షోకాజ్ నోటీసుకు స్పందించని సంస్థలపై జరిమానా వసూలు చేసే ప్రక్రియను తెలంగాణ రెరా అథారిటీ ఆరంభించింది. ఈ విభాగం ఆరంభం నాటి నుంచి ఇప్పటికే 672 ప్రాజెక్టులపై జరిమానా విధించింది.
- వాస్తవానికి, రెరా రిజిస్ట్రేషన్లలో తెలంగాణ రెరా అథారిటీ దేశంలోనే ఆరో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకూ సుమారు 2,764 ప్రాజెక్టులను నమోదు చేసింది. రాజేశ్వర్ తివారీ రెరా ఛైర్మన్ ఉన్నంతవరకూ ఈ అథారిటీ మెరుగ్గా పని చేసింది. ఆయన పదవీ విరమణ చేయడం, రెరా అథారిటీకి అదనపు బాధ్యతల్ని నిర్వర్తించే సోమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీ కావడంతో ఆయన మీద అదనపు భారం పెరిగింది. అయినప్పటికీ, ఆయన తీరిక చేసుకుని మరీ రెరా బాధ్యతల్ని చూసేవారు. కాకపోతే, ఈ విభాగానికి ప్రత్యేకంగా ఛైర్మన్ ఉంటేనే రోజువారి కార్యక్రమాల్ని పర్యవేక్షించడానికి వీలుంటుంది. కొన్ని కఠినమైన నిర్ణయాల్ని తీసుకోవడానికి కుదురుతుంది. కాబట్టి, ఇప్పటికైనా తెలంగాణ రెరా అథారిటీకి రెగ్యులర్ ఛైర్మన్ ఎంతో అవసరమని ప్రభుత్వం గుర్తించి వెంటనే నియమించాలి.