Resort Camp was Closed in Karnataka
- ఎమ్మెల్యేలను ఇళ్లకు పంపించేసిన కాంగ్రెస్
- బీజేపీ ప్రలోభాలకు లొంగొద్దని సిద్ధరామయ్య హితబోధ
ఎట్టకేలకు కర్ణాటకలో రిసార్టు రాజకీయాలకు తెరపడింది. మూడు రోజులుగా రిసార్టులో ఉంచిన తన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఇంటికి పంపించివేసింది. సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామి శివైక్యం చెందడం, ఇద్దరు ఎమ్యెల్యేల ఘర్షణ వివాదాస్పదం కావడంతో పార్టీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. కర్ణాటకలో కుమారస్వామి సర్కారును పడగొట్టి తమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆపరేషన్ కమలం పేరుతో బీజేపీ ప్రయత్నాలు చేస్తోందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. గత శుక్రవారం తన పార్టీ ఎమ్మెల్యేలను బెంగళూరు శివారులోని ఈగిల్ టన్ రిసార్టుకు తరలించింది. దాదాపు 70 మందిని అక్కడకు పంపించింది. అయితే, ఈ సందర్భంగా పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రిసార్టులో ఉండగానే హోస్పేట ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్, కంప్లి ఎమ్మెల్యే గణేశ్ కొట్టుకున్న ఘటన వివాదాస్పదమైంది. ఆనంద్‌సింగ్‌పై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే గణేశ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేశారు. గణేశ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆనంద్ సింగ్‌తోపాటు ఆయన కుటుంబసభ్యులు గట్టిగా పట్టుబట్టడం ఈ వివాదం మరింత ముదరడానికి కారణమైంది. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ పెద్దలను పునరాలోచనలో పడేశాయి. ఇదే సమయంలో ప్రముఖ మతగురువు, సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామి శివైక్యం చెందడంతో రిసార్టు రాజకీయాలకు ముగింపు పలకాలని యోచించారు. అంతకుముందే సీఎల్పీ నేత సిద్ధరామయ్య, కాంగ్రెస్ ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్ ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడి, బీజేపీ ప్రలోభాలకు లొంగరాదని హితబోధ చేసినట్లు సమాచారం. అనంతరం వారిని ఇళ్లకు పంపించేశారు.