సీఎం రేవంత్ రెడ్డి అపరిచితుడు అని, ఇలాంటి నాయకులను నమ్మి మోసపోవద్దని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు రాష్ట్ర ప్రజలకు సూచించారు. చైతన్యవంతులైన ప్రజలు ఇకనైనా ఇటువంటి రెండు నాల్కల ధోరణి గల నాయకులను నమ్మి మోసపోవద్దని, మోసపోతే ఎంతో గోస పడుతరని చెప్పాలనేది నా ఆరాటం అని హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో సోమవారం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని, రాజకీయ నాయకులను ప్రజలు నిశితంగా పరిశీలిస్తుంటారని అన్నారు. రాజకీయ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుని బాధ్యతగా మాట్లాడాలని, మెలగాలని, ప్రజలు పిచ్చోళ్లు కాదని హరీశ్‌రావు సూచించారు.
“ మనం ఏదైనా మాట్లాడొచ్చు.. నరం లేని నాలుక ఏదైనా మాట్లాడొచ్చు అని ఆయన మాట్లాడుతున్నాడు. మోసం చేయడం మాకు అలవాటు, మోసపోవడం ప్రజలకు అలవాటు అని నిస్సంకోచంగా చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇక్కడ డుబల్ స్టాండర్డ్ లేదు.. ఆయన మనసులో ఉన్నది చెప్పినట్టు ఉండు. నా ప్రయత్నం అంతా రేవంత్ నిజ స్వరూపం ప్రజలకు చూపించాలన్నదదే తపన“ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ ఏడాది కాలంలో తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, రైతుబంధు, బతుకమ్మ చీరలు, పెన్షన్లు చాలా కోల్పోయారని అన్నారు. తెలంగాణ ప్రజలకు ఈ ఏడాది కాలంలో అనుభవంలోకి వచ్చింది మోసం, దగా అని, రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తున్న రేవంత్‌ను చూస్తే పిల్లలు చెడిపోతారని చానెల్స్ మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి భాష, తీరుకు తల్లిదండ్రులు భయపడుతున్నారని, పిల్లల మీద ప్రభావం పడే అవకాశం ఉందని బాధపడుతున్నారన్నారు. రేవంత్ రెడ్డిని నమ్మితే అన్నవస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయినట్టు అయింది పరిస్థితి అన్ని సెటైర్ వేశారు. ఈ ఏడాది పాలనలో ఎడతెగని వంచనకు ఇవన్నీ నిలువెత్తు నిదర్శనాలు అని, ఇది ఆత్మ వంచన చేసుకోవడమే అని ఆరోపించారు.
ఈ సందర్భంగా రైతుబంధు, బతుకమ్మ చీరలు, ఎల్ఆర్ఎస్, పోటీ పరీక్షల వాయిదా, కులగణన సర్వే, కూల్చివేతలు, ఏక్ పోలీసు, మద్యం అమ్మకాలు, కాళేశ్వరం ప్రాజెక్టు, సోనియా గాంధీ బలిదేవత, పార్టీ ఫిరాయింపులు, శిలాఫలకాలు, పేపర్ యాడ్స్, మూసీ అభివృద్ధి, అడ్వైజర్లకు కేబినెట్ హోదా, యూట్యూబ్ చానెల్స్, ప్రజాస్వామ్య పునరుద్ధరణ, బూటకపు ఎన్‌కౌంటర్లపై రేవంత్ రెడ్డి మాట్లాడిన డబుల్ స్టాండర్డ్స్‌ను హరీశ్‌రావు వీడియోల ద్వారా చూపించారు.