2024లో ఎన్నో వింతలు విశేషాలు, ఆశ్చర్యకర సంఘటనలు, ఊహించని పరిణామాలు జరిగాయి. ముఖ్యంగా తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తన మార్క్ చూపించారు. మార్పు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి పాలనా విధానంలో ఎన్నో మార్పులు తెచ్చారు. గత ఏడాదిగా తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ అన్నట్లుగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నాగార్జున ఎన్ కన్వెన్షన్‌తో మొదలైన వివాదాలు.. అల్లు అర్జున్ అరెస్టుతో పాటు బాలకృష్ణ ఇంటికి జీహెచ్ఎంసీ మార్కింగ్ వంటి ఘటనలు చర్చనీయాంశమయ్యాయి.
హైడ్రా నుంచి మొదలు
మొదటగా సీఎం రేవంత్ హైడ్రా ప్రవేశ పెట్టి అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టించారు. పేద ధనిక అనే తారతమ్యం లేకుండా అందరినీ ఒకేలా చూశారు. హైడ్రా పేరుతో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఈ హైడ్రా బాదితుల్లో సినీ ఇండస్ట్రీ నుంచి అక్కినేని నాగార్జున ఒకరు. మొదట్లోనే హైడ్రా పేరుతో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్‌ను నేలమట్టం చేసి సంచలనం సృష్టించారు.
మాదాపూర్ లోని ఒక చెరువును కబ్జా చేసి నాగార్జున ఎన్ కన్వెన్షన్ అక్రమంగా నిర్మించారని హైడ్రా అధికారులు గుర్తించారు. దీంతో బుల్డోజర్‌ను మొదటిగా నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ పైకి పంపించి దాన్ని నేలమట్టం చేశారు. దీంతో నాగార్జున కోర్టు మెట్లు ఎక్కినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను కొందరు సమర్ధించారు. సీఎం అంటే ఇలానే ఉండాలి అంటూ పొగడ్తలు కురిపించారు. ఇక హైడ్రాతో షాక్ తిన్న నాగార్జునకు కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలు అక్కినేని కుటుంబంలో నిద్రలేని రాత్రులకు కారణం అయ్యాయి.
అక్కినేని ఫ్యామిలీపై మంత్రి సురేఖ సంచలన ఆరోపణలు
నాగ చైతన్య – సమంత విడిపోవడానికి కేటీఆరే కారణం అంటూ మంత్రి సురేఖ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. గతంలో కేటీఆర్-నాగార్జున మధ్య ఒక డీలింగ్ కుదిరిందన్నారు. ఎన్ కన్వెన్షన్ జోలికి రాకుండా ఉండాలంటే సమంతను తన దగ్గరకు పంపాలని కేటీఆర్ నాగార్జునతో చెప్పారని సంచలన ఆరోపణలు చేశారు. దీంతో నాగార్జున.. సమంతను కేటీఆర్ దగ్గరకు పంపించే ప్రయత్నం చేశారని.. దీనికి ఒప్పుకోకపోవడంతోనే సమంతను ఇంటిలోనుంచి బయటకు పంపించేశారని మంత్రి సురేఖ ఘోరమైన ఆరోపణలు చేశారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై సినీ ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఒక మంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమంటూ సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఖండించారు. వెంటనే మంత్రి సురేఖ క్షమాపణలు చెప్పాలంటూ పలువురు డిమాండ్ చేశారు.
కోర్టుకు నాగార్జున
దీంతో సమంతకు.. మంత్రి సురేఖ క్షమాపణలు చెప్పింది. మరోవైపు నాగార్జు, కేటీఆర్ వేరు వేరుగా ఆమెపై పరువునష్టం దావా వేశారు. ఒక మంత్రి స్థాయిలో ఉండి సురేఖ తన ఫ్యామిలీపై తీవ్ర ఆరోపణలు చేశారని నాగార్జున కోర్టులో ఆవేదన చెందారు. సమాజంలో తమ ఫ్యామిలీకి ఎంతో పరువు ప్రతిష్ట ఉందన్నారు. ఆమె వ్యాఖ్యలతో వాటికి భంగం కలిగిందని భావోధ్వేగానికి గురయ్యారు. దీంతో కోర్టు ఆమెకు వార్నింగ్ ఇచ్చింది. ఇంకెప్పుడూ ఇలాంటి ఆరోపణలు చేయరాదని కోర్టు పేర్కొంది. మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆమె ఆరోపణల వీడియోలు డిలీట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఎన్టీఆర్ ‘దేవర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నో పర్మిషన్
దీని అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఇండస్ట్రీలోని స్టార్ హీరో సినిమాకు భారీ షాక్ ఇచ్చింది. జూ. ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమాకు ఊహించని దెబ్బ కొట్టింది. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఊహించని రీతిలో రద్దయింది. ముందుగా ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు పర్మిషన్ కోరితే ప్రభుత్వం నిరాకరించింది. దీంతో హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో ఈవెంట్ నిర్వహించగా జనం భారీగా తరలి రావడంతో హోటల్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులు తారఖ్ ఫ్యాన్స్‌పై లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో ప్రభుత్వం తీరుపై ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అల్లు అర్జున్‌పై కేసు నమోదు
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్స్‌లో భారీ ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంథ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ప్రీమియర్ చూసేందుకు బన్నీ రావడంతో ఫ్యాన్స్ అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో తొక్కిసలాట జరగగా.. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలయ్యాడు. దీంతో పోలీసులు అల్లు అర్జున్, థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే బన్నీని పోలీసులు రీసెంట్‌గా అరెస్టు చేశారు. అక్కడితో ఆగకుండా కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన నాంపల్లి కోర్టు బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో బన్నీని చంచల్ గూడ జైలుకు తరలించారు. అదే సమయంలో హైకోర్టు ఈ కేసును విచారించి బన్నీకి 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇక ఇలా వెళ్లి అలా వచ్చేస్తాడనుకున్న బన్నీకి అక్కడ కూడా షాక్ తగిలింది. కోర్టు ఆదేశాలు తమకు ఇంకా అందలేదని జైలు అధికారులు రాత్రంతా బన్నీని జైల్లోనే పెట్టారు. ఇది మరింత సంచలనం అయింది. రాత్రంతా బన్నీ జైల్లో కిందనే పడుకున్నడని వార్తలు వచ్చాయి. మరుసటి రోజు బన్నీ బయటకొచ్చాడు.
బాలకృష్ణకు రేవంత్ సర్కార్ షాక్
సీఎం రేవంత్ రెడ్డి నెక్స్‌ట్ టార్గెట్ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. రోడ్డు విస్తరణలో భాగంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ సమీపంలో ఉన్న బాలయ్య నివాసానికి ముంపు పొంచి ఉంది. ఫిల్మ్‌నగర్ రోడ్ నంబర్ 45లోని బాలకృష్ణ ఇంటికి 6 అడుగుల మేర జీహెచ్ఎంసీ అధికారులు మార్కింగ్ వేశారు. దీంతో బాలయ్య ఇంటికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు 6 అడుగుల మేర నేలమట్టం చేయనున్నారన్న ప్రచారం జోరుగా సగుతోంది. బాలకృష్ణ – సీఎం రేవంత్ రెడ్డి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ ఏడాది హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 24వ వార్షికోత్సవానికి సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో బసవతారకం హాస్పిటల్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో సీఎం కాకముందు ఓ సినిమా ఫంక్షన్లోనూ బాలయ్యపై రేవంత్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో బాలయ్య విషయంలో రేవంత్ సర్కార్ వ్యవహారం ఎలా ఉండబోతుందనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది.
నాగార్జున నుంచి బన్నీ అరెస్ట్ వరకు.. సర్కార్ వ్యూహం ఇదేనా..?
రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిస్థితులు చూస్తుంటే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్‌గా పరిస్థితులు మారిపోతున్నట్టు కనిపిస్తోంది. హైడ్రా ప్రారంభించిన మొదట్లోనే.. అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చేయటం దగ్గరి నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయటం వరకు రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలన్నింటిపై సినీ అభిమానులు పోస్ట్ మార్టమ్ మొదలుపెట్టేశారు. అయితే.. టాలీవుడ్‌పై రేవంత్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో సర్కారుకు మైలేజీ వస్తుందా.. డ్యామేజీ జరుగుతుందా అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.