Friday, April 4, 2025

వారం రోజుల్లోగా అద్దె బకాయిలు చెల్లించకుంటే

  • హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటాం
  • ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
  • మాల్ వ్యవహారంపై ఆర్టీసి ఎండి సజ్జనార్ ట్వీట్

ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సంబంధించిన మాల్ వ్యవహారంపై ఆర్టీసి ఎండి సజ్జనార్ స్పందించారు. వారం రోజుల్లోగా అద్దె బకాయిలు చెల్లించకుంటే హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటామని సజ్జనార్ ట్వీట్ చేశారు. ఇటీవల మాల్‌ను ఆర్టీసి అధికారులు సీజ్ చేయగా శుక్రవారం హైకోర్టు ఉత్తర్వులతో మాల్‌ను ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ వేదికగా ఆర్టీసి ఎండి సజ్జనార్ స్పందించారు. ‘నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బస్‌స్టేషన్ సమీపంలో ఉన్న జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ వ్యవహారంలో హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆర్టీసికి పెండింగ్‌లో ఉన్న రూ.2.51 కోట్ల అద్దె బకాయిలను వారం రోజుల్లోగా చెల్లించాలని విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ను ఆదేశించింది.

హైకోర్టు ఆర్డర్ జారీ చేసిన రోజు నుంచి వారంలోగా అద్దె బకాయిలు చెల్లించకుంటే నిబంధనల ప్రకారం జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ భవనాన్ని తిరిగి టిజిఎస్ ఆర్టీసి స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. భవిష్యత్‌లోనూ అద్దె సకాలంలో చెల్లించకుంటే ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా మాల్‌ను స్వాధీనం చేసుకోవచ్చని స్పష్టం చేసింది. విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఆ షాపింగ్ మాల్‌లోని సబ్ లీజ్ దారుల ప్రయోజనం దృష్ట్యా మాల్‌ను ఓపెన్ చేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు సబ్ లీజ్ దారులను దృష్టిలో ఉంచుకుని జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్‌ను తెరిచేందుకు శుక్రవారం సంస్థ అనుమతి ఇచ్చింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com