ఆశించిన రీతిలో లేని సర్కారు వారి పాట

ఆశించిన రీతిలో లేని సర్కారు వారి పాట
హైదరాబాద్, మే 12, (న్యూస్ పల్స్)
తెలుగు చిత్రసీమలో మహేష్‌బాబుకు ఉన్న స్టార్‌డమ్‌లో ఓ ప్రత్యేకత కనిపిస్తుంది. మాస్‌, యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకుల్లో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్‌ ఉంటుంది. గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు మహేష్‌బాబు. రెండేళ్ల విరామం తర్వాత ఆయన ‘సర్కారు వారి పాట’ చిత్రంతో ప్రేక్షకులముందుకొచ్చారు. ప్రచార చిత్రాలు, పాటలకు మంచి ఆదరణ లభించడంతో సినిమాపై భారీ అంచనాలేర్పడ్డాయి. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం అభిమానుల అంచనాల్ని అందుకుందా? సినిమాలో చర్చించిన సామాజిక అంశం ఎంత వరకు ప్రేక్షకులకు చేరువైంది?..ఇవన్నీ తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..మహేష్‌ (మహేష్‌బాబు) అమెరికాలో ఫైనాన్స్‌ కంపెనీ ఏర్పాటు చేసుకొని వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. ఎంతటివారైనా సరే తాను విధించిన గడువులోగా తీసుకున్న డబ్బులు చెల్లించాల్సిందే…లేకుంటే భయపెట్టి డబ్బులు వసూలు చేస్తుంటాడు. అమెరికాలో కాసినోలు, పబ్బుల చుట్టూ తిరుగుతూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న కళావతిని (కీర్తి సురేష్‌) తొలిచూపులోనే ప్రేమిస్తాడు మహేష్‌. గ్యాంబ్లింగ్‌ అలవాటున్న కళావతి అందుకోసం మహేష్‌ దగ్గర అప్పు తీసుకుంటుంది. ఆ తర్వాత తీర్చనని మొండికేస్తుంది. కళావతి నిజ స్వరూపాన్ని తెలుసుకున్న మహేష్‌.. ఎలాగైనా అప్పు తీర్చాలని పట్టుబడతాడు. కళావతి తండ్రి రాజేంద్రనాథ్‌ (సముద్రఖని) విశాఖపట్నంలో పెద్ద పారిశ్రామికవేత్త. రాజ్యసభ ఎంపీ. ఆయన ద్వారా కూతురు చేసిన అప్పును వసూలు చేయాలని మహేష్‌ ఇండియాకు వస్తాడు. వాస్తవానికి కళావతి తీర్చాల్సిన అప్పు పదివేల డాలర్లు. కానీ తనకు రాజేంద్రనాథ్‌ పదివేల కోట్లు బాకీ పడ్డాడని మహేష్‌ మీడియా ముఖంగా చెబుతాడు. ఇంతకి ఆ పదివేల కోట్ల వెనకున్న కథేమిటి? చిన్నతనంలో మహేష్‌ తన అమ్మానాన్నల్ని ఎలా కోల్పోయాడు? ఇండియాకొచ్చిన మహేష్‌ తన ఆశయాన్ని నెరవేర్చుకున్నాడా? అన్నదే మిగతా కథ..ప్రస్తుతం దేశంలో ఆర్థిక మోసాలు ఎక్కువవుతున్నాయి. రాజకీయ అండతో బడా బాబులు బ్యాంకుల నుంచి వేలకోట్ల రుణాల్ని తీసుకొని ఎగవేతలకు పాల్పడుతున్నారు. అలాంటి వారు దర్జాగా విదేశాల్లో గడుపుతున్న ఉదంతాల్ని చూస్తున్నాం. ఈ తరహా సమకాలీన సామాజిక సమస్యల్ని కమర్షియల్‌ పంథాలో ఈ సినిమాలో చర్చించారు దర్శకుడు పరశురామ్‌. వాస్తవానికి ఆర్థిక పరమైన మోసాల్ని వాణిజ్య పంథాలో తెలియజెప్పడం అంత సులభం కాదు. దర్శకుడు పరశురామ్‌ సమాజానికి ఎంతో ఉపయుక్తమైన మంచి పాయింట్‌ ఎంచుకున్నారు. కానీ ఆ అంశాన్ని ఇటు కమర్షియల్‌ పంథాలో చెప్పలేక…అటు సందేశాత్మకంగా మలచలేక తడబడ్డట్లు కనిపించింది. ముఖ్యంగా ఇలాంటి సినిమాల్లో కథలోని సోల్‌ మిస్‌ కాకుండా, హీరో ఇమేజ్‌ను బ్యాలెన్స్‌ చేయడం ఏ దర్శకుడికైనా కత్తిమీద సాములాంటిది. సినిమా ఆరంభంలో మహేష్‌ చిన్ననాటి ఎపిసోడ్‌తోనే దర్శకుడు ఏం చెప్పబోతున్నాడో..ఎలాంటి సమస్యను చర్చించబోతున్నాడో అర్థమైపోతుంది. అక్కడి నుంచి కథ అమెరికాకు మారుతుంది. అమెరికాలో సాగే ప్రథమార్థం చక్కటి వినోదాన్ని పంచింది. మహేష్‌, కళావతి, వెన్నెల కిషోర్‌ మధ్య వచ్చే సన్నివేశాలు సరదాగా సాగుతూ నవ్వించాయి.తన అప్పు వసూలు కోసం మహేష్‌ ఇండియాకు రావడంతోనే కథ కీలక మలుపు తీసుకుంటుంది. ఎయిర్‌పోర్ట్‌లో నదియా తనకు జరిగిన మోసాన్ని మహేష్‌కు వివరించడంతోనే సినిమా కథ ఎలా సాగనుందో..ముగింపు ఎలా ఉండబోతుందో ప్రేక్షకులకు తెలిసిపోతుంది. ఓరకంగా చెప్పాలంటే కథ మొత్తం అక్కడే రివీల్‌ అయిపోతుంది. ద్వితీయార్థంలో కథాగమనం సీరియస్‌ మూడ్‌లోకి వెళుతుంది. బీచ్‌ ఫైట్‌…రాజేంద్రనాథ్‌కు బ్యాంక్‌ నుంచి నోటిసులు అందించడానికి మహేష్‌ చేసిన ప్రయత్నాల నేపథ్యంలో వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌ ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలో చాల సన్నివేశాలు లాజిక్‌ లేకుండా అనిపిస్తాయి. ప్రజలపై పరోక్షంగా భారాన్ని మోపుతున్న ఆర్థిక మోసాల గురించి మహేష్‌ ప్రజలకు వివరించే సన్నివేశాల్లో మంచి సమాచారం ఉందనిపించినా..ఆ సన్నివేశాలకు ప్రేక్షకులు ఎందుకో ఎమోషనల్‌గా కనెక్ట్‌ కాలేకపోతారు. అయితే బడా బాబులు చేసే బ్యాంకు మోసాల వల్ల సామాన్యులు ఎలా బలి అవుతున్నారనే అంశాన్ని బలంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలో వచ్చే సంభాషణలు కూడా ఆలోచనల్ని రేకెత్తించేలా ఉన్నాయి. ైక్లెమాక్స్‌ ఘట్టాలు ప్రేక్షకులకు ఊహలను అనుగుణంగా సాగాయి. ప్రథమార్థంలో పెన్నీ, కళావతి పాటలు జోష్‌ను తీసుకొచ్చాయి. చిత్రీకరణ కూడా బాగుంది. మొత్తంగా చూస్తే దర్శకుడు తీసుకున్న పాయింట్‌ అందరికి కనెక్ట్‌ అయ్యేదే అయినా..అనుకున్న రీతిలో ఆవిష్కరించలేకపోయాడనే భావన కలుగుతుంది. అయితే అభిమానుల్ని అలరించే మాస్‌ అంశాల్ని మాత్రం కథలో పుష్కలంగా చూపించారు.ఈ సినిమాను మహేష్‌బాబు వన్‌మేన్‌ షోగా అభివర్ణించవొచ్చు. ఆయన లుక్స్‌, కాస్ట్యూమ్స్‌ అన్నీ కొత్తగా అనిపించాయి. ప్రతి సన్నివేశంలో మంచి ఈజ్‌తో పర్‌ఫార్మ్‌ చేశాడు. ఆయన పాత్ర చిత్రణలో అక్కడక్కడా పోకిరి తాలూకు ఛాయలు కనిపించాయి. చక్కటి కామెడీ టైమింగ్‌, డైలాగ్‌ డెలివరీతో తనదైన ముద్రతో మహేష్‌బాబు ఆకట్టుకున్నారు. ఇక కీర్తి సురేష్‌ ఈ తరహా పాత్రలో ఇప్పటివరకు కనిపించలేదు. ప్రథమార్థంలో ఆమె పాత్ర మంచి వినోదాన్ని పండించింది. ఇక ప్రతినాయకుడిగా సముద్రఖని పాత్ర అంత బలంగా అనిపించలేదు. అయితే నటనాపరంగా మాత్రం ఆయన మెప్పించారు. వెన్నెల కిషోర్‌ తనదైన శైలి వినోదాన్ని పంచారు. నదియా, తనికెళ్లభరణి, సుబ్బరాజు తమ పాత్రల పరిధులు మేరకు న్యాయం చేశారు. మది ఛాయాగ్రాహణం బాగుంది. కొన్ని సన్నివేశాలు విజువల్‌ ట్రీట్‌లా అనిపిస్తాయి. తమన్‌ అందించిన పాటలు విడుదలకు ముందే హిట్టవడంతో తెరపై కూడా అలరించాయి. అయితే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం ఫర్వాలేదనిపించింది. దర్శకుడు పరశురామ్‌ తనదైన శైలి సంభాషణలతో మెప్పించాడు. సినిమాలోని ఎమోషనల్‌ కంటెంట్‌పై మరింత దృష్టిపెడితే బాగుండేదనిపించింది. నిర్మాణ విలువలు అగ్రస్థాయిలో ఉన్నాయిసినిమాలో ఎంచుకున్న సామాజిక అంశం బాగుంది. మహేష్‌బాబు పర్‌ఫార్మెన్స్‌ హైలైట్‌గా నిలిచింది. అయితే కథలోని సోషల్‌ ఎలిమెంట్‌ను ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా తెరపైకి తీసుకురావడంలో కాస్త తడబాటు కనిపించింది. అభిమానుల్ని మెప్పించే అంశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్‌ ఖాయంగా కనిపిస్తున్నా…బాక్సాఫీస్‌ రేసులో అంతిమ ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచిచూడాల్సిందే..

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article