కాంగ్రెస్ సంచలన నిర్ణయం

Congress Sensational DECISION  సీనియర్ నేత సర్వే సస్పెన్షన్

కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ పై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. సమీక్ష సమావేశంలో ఐసీసీసీ ఇంచార్జ్ ప్రధాన కార్యాదర్శి ఆర్.సి కుంతియా పీసీసీ అధ్యక్షుడిపై సర్వే సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గత ఎన్నికల ఓటమి కారణాలను, అలాగే భవిష్యత్ ఎన్నికల కార్యాచరణను సమీక్షించే సమావేశం జరిగింది. మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులను సమాయత్తం చెయ్యాల్సిన సభలో సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ గందరగోళం చేశారు . టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ ఇంచార్జ్‌ కుంతియాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఊరుకోక టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్‌తో సర్వే గొడవకు దిగారు. ఇక ఈ క్రమంలో సహనం కోల్పోయిన ఆయన.. కిషన్‌పై టేబుల్‌ మీద ఉన్న వాటర్‌ బాటిల్‌ విసిరారు. ఇదంతా చూస్తున్న కాంగ్రెస్ శ్రేణులు ఖంగు తిన్నారు.
ఇక ఆ సమీక్షా సమావేశంలో సర్వే తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ ఇంచార్జ్‌ కుంతియాలే కారణమని ఆరోపించారు. ఇక పార్టీ ఓటమికి కారణమైన వారే మళ్లీ ఓటమిపై సమీక్షలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు . వీళ్ళను నమ్ముకుంటే లాభం లేదని చెప్పారు. ఇక ఉత్తమ్‌, కుంతియాల వల్ల తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతే కాదు ఉత్తమ్, కుంతియాలు అసమర్దులని బాహాటంగానే చెప్పారు. ఇక వాళ్ల అసమర్ధతను ప్రశ్నిస్తే దాడులు చేయించడానికి గాంధీభవన్‌లో రౌడీలను పెట్టుకున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు . ఇక నోటికి అడ్డూ అదుపు లేకుండా మాట్లాడిన సర్వే సత్యన్నారాయణ పై కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం చర్యలు తీసుకుంది. ఆయన్ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.ఓ సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ పై సర్వే దాడికి పాల్పడ్డారని అంతే కాకుండా సమావేశంలో సంబంధంలేని అంశాలు మాట్లాడుతూ నేతలను నిందించారని ఈ సమావేశంలోనే సర్వే ఘర్షణకు దిగారని పేర్కొంటూ….వీటిని పరిగణనలోకి తీసుకొని అధిష్టానం ఆదేశాల మేరకు సర్వేను క్రమశిక్షణ కమిటీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అనేక సార్లు సర్వే సత్యనారాయణకు పార్టీ లో ప్రాధాన్యత ఇచ్చి పదవులు ఇచ్చినా సమావేశంలో ఆయన పార్టీ నాయకత్వం పట్ల వ్యవహరించిన తీరు సరికాదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది.
2004 సిద్దిపేట నుంచి ఎంపీగా కాంగ్రెస్ నుంచి గెలిచిన సర్వే.. 2009 లో మల్కాజిగిరి పార్లమెంట్ జనరల్ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీ గెలిచారు. కేంద్రంలో జాతీయ రహదారుల శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో మల్కాజిగిరి జనరల్ స్థానంగా మారడంతో అక్కడి నుంచే ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2015 వరంగల్ ఎస్సీ స్థానం నుంచి ఉప ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కంటోన్మెంట్ పాలక వర్గం ఎన్నికల్లో సర్వే సత్యనారాయణ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో సర్వే సత్యరాయణ కంటోన్మెంట్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీ నేతలపై బాటిల్ విసిరి అనుచితంగా ప్రవర్తించి సస్పెన్షన్ వేటు కు గురయ్యారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article