శాసన సభలో సీనియర్ వనమా. జూనియర్ హరిప్రియ

Senior Vanama and junior Hari Priya are in In the Legislative Assembly

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ కొలువుతీరింది. సభ్యులందరి ప్రమాణ స్వీకారాలతో శాసనసభ సందడిగా మారింది. నెల రోజులకు పైగా ఎదురుచూసిన శాసనసభ్యులు ఎట్టకేలకు ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత ముఖ్యమంత్రి కేసీఆర్‌ .. గజ్వేల్‌ శాసనసభ్యుడిగా శాసనసభలో ప్రమాణ స్వీకారం చేశారు.
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే నేను.. శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే నేను.. సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.. అంటూ సీఎం కేసీఆర్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మహిళా సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం ప్రమాణస్వీకారం తర్వాత అక్షర క్రమాన్ని బట్టి ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయించారు. ఆరుగురు మహిళా సభ్యుల ప్రమాణం అనంతరం మొదటగా ఆలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం, చివరగా వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.ప్రమాణస్వీకారం అనంతరం శాసనసభ్యులు, మండలి సభ్యులకు సీఎం జూబ్లీహాలు ప్రాంగణంలో విందు ఏర్పాటు చేశారు.

కొత్తగా కొలువుదీరిన తెలంగాణ రెండో శాసనసభలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రాష్ట్ర తొలి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన 76 మంది ఎమ్మెల్యేలు తిరిగి ఎన్నికయ్యారు. 23 మంది తొలిసారి శాసనసభలో అడుగు పెట్టారు. సీఎం కేసీఆర్ సభలో అత్యంత సీనియర్‌ సభ్యుడు‌. ఇప్పటి వరకూ ఆయన ఉప ఎన్నికతో పాటు ఎనిమిది సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. తరువాతి స్థానంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, రెడ్యానాయక్‌, ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ సీనియర్లుగా ఉన్నారు. ఉప ఎన్నికతో కలిపితే హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌ ఆరుసార్లు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. సభలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎక్కువ వయసు ఉన్న సభ్యుడు కాగా, ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ పిన్న వయస్కురాలు. తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 శాసనసభ స్థానాలకు గాను 88 మంది టీఆర్ఎస్‌ సభ్యులు, కాంగ్రెస్‌ పార్టీ నుంచి 19, మజ్లిస్‌ పార్టీ నుంచి ఏడుగురు, టీడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ తరఫున ఒక సభ్యుడు ఉన్నారు.

ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ తరఫున ఒకరు, స్వతంత్ర అభ్యర్థిగా ఒకరు శాసనసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యుల్లో నలుగురు వేర్వేరు చట్ట సభలకు ప్రాతినిథ్యం వహించిన వారు ఉన్నారు. మేడ్చల్‌ నుంచి ఎన్నికైన మల్లారెడ్డి, చెన్నూరు నుంచి గెలిచిన బాల్క సుమన్‌ గతంలో లోక్‌సభ సభ్యులుగా పనిచేశారు. మునుగోడు నుంచి ఎన్నికైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గతంలో లోక్‌సభ, శాసనమండలికి ప్రాతినిథ్యం వహించారు. కొడంగల్‌ నుంచి గెలుపొందిన పట్నం నరేందర్‌రెడ్డి కూడా మండలి సభ్యుడిగా పనిచేశారు. ఈనలుగురిని మినహాయిస్తే మిగతా 23 మంది మొట్టమొదటి సారి శాసనసభకు ఎన్నికయ్యారు. తెలంగాణ తొలి అసెంబ్లీలో లేని, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు ప్రాతినిథ్యం వహించిన 16 మంది ఈసారి మళ్లీ ఎన్నికయ్యారు. మొదటి సారి శాసనసభకు నామినేట్‌ అయిన స్టీఫెన్‌సన్‌ మళ్లీ నామినేట్‌ అయ్యారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article