శబరిమల వివాదం స‌ద్దుమ‌ణిగేనా?

shabarimala controversy

శబరిమల అయ్యప్ప ఆలయంలో చెల‌రేగిన అలజడి స‌ద్దుమ‌ణుగుతుందా? ఉదయం 3.45 గంటలకు భక్తులు ఎవ్వరూ లేనిది చూసి కేరళ పోలీసులు ఇద్దరు 50 ఏళ్లలోపున్న మహిళలను శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశింప చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై కేర‌ళ‌లో అల‌జ‌డి చెల‌రేగింది. పోలీసులు ఎస్కార్ట్ గా వెళ్లి మఫ్టిలో ఉండి.. నల్లటి దుస్తులను మహిళల చేత ధరింప చేసి లైవ్ వీడియో తీస్తూ వారిని అయ్యప్ప గర్భగుడిలోకి చాకచక్యంగా తీసుకెళ్లి దర్శనం చేయించారు.  నల్లటి దుస్తులు ధరించిన ఆ ఇద్దరు భక్తులు అర్ధరాత్రి పంబ బేస్ క్యాంప్ నుంచి బయలు దేరి స్వామి సన్నిధికి చేరుకున్నారు. అక్కడ పురుషుల వలే నల్లటి దుస్తులతో వస్త్రాధారణ చేసుకొని ఎస్కార్ట్ పోలీసుల సాయంతో చలికి ఎవ్వరూ భక్తులు లేని సమయంలో తెల్లవారుజామున 3.45 నిమిషాలకు గబగబా వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో భక్తులు లేకపోవడంతో వీరి దర్శనం సజావుగా సాగింది. ఆ ఇద్దరు మహిళలను బిందు కనకదుర్గగా గుర్తించారు. వీరు డిసెంబర్ 24న కూడా స్వామి వారి దర్శనానికి ప్రయత్నించగా.. అయ్యప్ప భక్తులు అడ్డుకోవడంతో పంబ నుంచే వెనుదిరిగారు. ఈ రోజు ఏకంగా పోలీసుల సాయంతో స్వామి వారిని దర్శించుకున్నారు. దీంతో మహిళలను శబరిమల ఆలయంలోకి ప్రవేశింపచేయాలన్నకేరళ సర్కారు పంతం నెగ్గింది. సీఎం పినరయి విజయన్ మహిళల ప్రవేశం పై హర్షం వ్యక్తం చేశారు. సంప్రదాయ భక్తులు బీజేపీ నేతలు మాత్రం భగ్గుమన్నారు. భారీ ఆందోళనలకు పిలుపునిచ్చారు. మ‌రి, ఈ వివాదం ఎప్పుడు స‌ద్దుమ‌ణుగుతుందో?

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article