ఈ గోడది స్వచ్ఛమైన హృదయం

Shewag Birthday wishes to Rahul Dravid

భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఏది చేసినా సంచలనమే. క్రికెట్ ఆడుతున్నప్పుడు మైదానంలో సిక్సర్లు కొడితే, ఇప్పుడు సోషల్ మీడియాలో అదిరిపోయే వ్యాఖ్యలు, కామెంట్లో అభిమానుల మనసు గెలుచుకుంటున్నాడు. శుక్రవారం భారత మాజీ క్రికెటర్, ‘ది వాల్’ ఆఫ్‌ ఇండియన్‌ క్రికెట్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పుట్టినరోజు నేపథ్యంలో పలువురు క్రీడా ప్రముఖులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సెహ్వాగ్‌ అయితే, తనదైన స్టయిల్‌లో బర్త డే విషెస్ చెప్పాడు. ‘గోడకు కూడా చెవులుంటాయి అంటారు. ఈ గోడకు స్వచ్ఛమైన మనసు, హృదయం కూడా ఉన్నాయి. అతనితో కలిసి ఆడిన క్షణాలు అద్భుతమైన మధురానుభూతులు’ అని సెహ్వాగ్‌ ట్వీట్‌ చేశాడు. వీరిద్దరూ తమ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ లతో భారత జట్టుకు ఎన్నో విజయాలు సాధించిపెట్టారు. కాగా, మరో క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా ద్రవిడ్ కు శుభాకాంక్షలు చెప్పాడు. ‘హ్యాపీ బర్త్‌డే జామ్‌.. మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. యువ క్రికెటర్లను తీర్చిదిద్దుతూ ఉండాలి. వారికి దొరికిన ఎంతో ఉత్తమమైన వ్యక్తి మీరు. మీతో ఎన్నో అద్భుత క్షణాలను పంచుకున్నాం. ఇంకా పంచుకుంటూనే ఉండాలని కోరుకుంటున్నా’ అని హర్భజన్ ఆకాంక్షించాడు. ‘నా స్నేహితుడు రాహుల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా. దేశీయ క్రికెట్‌కు ఆయన ఇంకా తన సేవలందించాలి. క్రికెటర్లకు మాత్రమే కాదు దేశంలోని ప్రతి యువతకు ఆదర్శంగా నిలవాలి’ అని హైదరాబాదీ వీవీఎస్‌ లక్ష్మణ్‌ విషెస్ చెప్పాడు.ఇంకా పలువురు ప్రముఖులు మిస్టర్ డిపెండబుల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article