టీమిండియాలో శుభ్ మన్ కు చోటు

Shubhman Got Place On Team India

  • రాహుల్ స్థానంలో ఎంపికైన పంజాబీ బ్యాట్స్ మన్

భారత క్రికెట్ యువ సంచలనం, రంజీలో పరుగుల ప్రభంజనం సృష్టించిన పంజాబ్ ఆటగాడు శుభ్ మన్ గిల్ కు టీమిండియాలో చోటు దక్కింది. న్యూజిలాండ్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌ కోసం 19 ఏళ్ల గిల్‌ ఎంపికయ్యాడు. కేఎల్ రాహుల్ పై నిషేధం విధించడంతో, అతడి స్థానంలో గిల్ కు అవకాశం లభించింది. తాజా రంజీ సీజన్‌లో గిల్‌ 10 ఇన్నింగ్స్ లలో 98.75 సగటుతో 790 పరుగులు చేశాడు. వాస్తవానికి టెస్టు సిరీస్‌లో రాణించిన మయాంక్‌ అగర్వాల్‌నే ఎంపిక చేయాలని సెలక్టర్లు భావించారు. అయితే ఇటీవల అతడి వేలికి తగిలిన గాయం తగ్గకపోవడంతో గిల్‌ వైపు మొగ్గు చూపారు. అండర్‌–16 విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీలో పంజాబ్‌ తరఫున మొదటి మ్యాచ్‌లోనే డబుల్‌ సెంచరీతో తొలిసారి గుర్తింపు తెచ్చుకున్న గిల్‌ వరుసగా రెండేళ్ల పాటు బీసీసీఐ ‘బెస్ట్‌ జూనియర్‌ క్రికెటర్‌’అవార్డు అందుకున్నాడు. గతేడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌లోనే జరిగిన అండర్‌–19 ప్రపంచకప్‌లో 5 ఇన్నింగ్స్‌లలోనే 124 సగటుతో 372 పరుగులు చేసిన గిల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా నిలిచాడు. అంతకుముందే ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై జరిగిన అండర్‌–19 వన్డే సిరీస్‌లో కూడా 4 ఇన్నింగ్స్ లలో 351 పరుగులు, ఆ తర్వాత ఇంగ్లండ్‌కు వెళ్లి మరో 278 పరుగులు చేయడం గిల్‌పై అందరి దృష్టీ పడేలా చేసింది. ఆ తర్వాత ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రూ.1.8 కోట్లకు గిల్‌ను తీసుకుంది. అప్పటి నుంచి ఇక సీనియర్‌ విభాగంలో ఎలా రాణిస్తాడనే దానిపైనే ఆసక్తి నెలకొంది. కాగా, నిషేధానికి గురైన మరో ఆటగాడు హార్దిక్‌ పాండ్యా స్థానంలో తమిళనాడు ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌కు చోటు లభించింది. భారత్‌ తరఫున శంకర్‌ ఇప్పటి వరకు 5 టీ20 మ్యాచ్‌లు ఆడగా, వన్డేల్లో అవకాశం లభించడం ఇదే మొదటిసారి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article