STUDENTS DRANK LIQUOR
- ఇద్దరు తొమ్మిదో తరగతి విద్యార్థినుల నిర్వాకం
- టీసీ ఇచ్చి పంపేసిన హెచ్ఎం.. విజయవాడలో ఘటన
సాధారణంగా స్కూల్ కు వచ్చే విద్యార్థులు ప్రతిరోజూ పాలో, హార్లిక్సో, టీ లేదా కాఫీ తాగి వస్తుంటారు. కానీ ఆ విద్యార్థినులు మాత్రం మద్యం తాగి వస్తున్నారు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ విద్యార్థినులపై తోటి పిల్లలు ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. విజయవాడ రూరల్ మండలం నిడమానూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులు తరగతి గదిలోనే మద్యం తాగి హల్ చల్ చేశారు. మద్యం తాగడంతో వారిద్దరూ తమపై తాము నియంత్రణ కోల్పోయి తూలుతూ తోటి విద్యార్థుల మీద పడటమే కాకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతుండటంతో ఇతర విద్యార్థినులు హెడ్ మాస్టర్ కు ఫిర్యాదు చేశారు. వాళ్లను పరీక్షిస్తే విస్తుపోయే విషయం తెలిసింది.
ప్రతిరోజూ కూల్ డ్రింకులో మద్యం కలుపుకుని స్కూల్ కు తీసుకొస్తున్నారని, అప్పుడప్పుడూ చాటుగా తాగుతున్నారని తెలియడంతో ఆయన దిగ్భ్రాంతి చెందారు. వెంటనే ఆ విద్యార్థినుల తల్లిదండ్రులను పిలిపించి, కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం ఇద్దరికీ టీసీలు ఇచ్చి పంపించేశారు. ‘ఈ ఇద్దరిలో ఓ విద్యార్థిని ఇంతకుముందు ఓ ఇంగ్లీషు మీడియం స్కూల్ లో చదివింది. అక్కడ కూడా ఆమె ప్రవర్తన సరిగా లేకపోవడంతో టీసీ ఇచ్చి పంపించేయడంతో ఇక్కడ చేరింది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పాఠశాలలో పక్కా చర్యలు చేపడుతున్నాం. మద్యం తాగిన ఇద్దరు విద్యార్థినులతో మిగిలిన విద్యార్థులకు కూడా నష్టం కలుగుతుందన్న కారణంతో టీసీలు ఇచ్చి పంపించేశాం’ అని పాఠశాల హెచ్ఎం సురేశ్ కుమార్ తెలిపారు.