- హైదరాబాద్‌లో విజయవంతంగా ఆర్థోపెడిక్ సదస్సు
* కిమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో పెల్విస్ ఎస్టెబ్యులర్ లైవ్ మరియు కెడావర్ శస్త్రచికిత్సలు
* కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీఎంఈ), వర్క్‌షాప్ నిర్వహణ
* దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన వైద్యనిపుణులు
హైదరాబాద్, జూన్ 18, 2022: ఏదైనా పెద్ద ప్రమాదం సంభవించినప్పుడు తుంటి ఎముక (పెల్విస్), తొడ ఎముకలకు (ఎస్టాబ్యులమ్) అయ్యే ఫ్రాక్చర్లు చాలా ప్రమాదకరం. సాధారణంగా చేతి, కాలి ఎముకలు గానీ, మణికట్టుకు గాయాలు గానీ అయితే చాలా చోట్ల శస్త్రచికిత్సలు చేస్తారు. కానీ తుంటి ఎముక విరిగినప్పుడు మాత్రం తప్పనిసరిగా హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో ఉండే పెద్ద ఆస్పత్రులకు రావాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్రధానమైన రక్తనాళాలు ఉంటాయి. ప్రమాదంలో అవి దెబ్బతింటే, అంతర్గత రక్తస్రావం అయ్యి, నాలుగైదు గంటల్లోనే రోగి మరణించే అవకాశం ఉంటుంది. ఇలాంటి గాయాలు, అప్పుడు చేయాల్సిన శస్త్రచికిత్సలపై దేశవ్యాప్తంగా ఉన్న ఆర్థోపెడిక్ వైద్య నిపుణులకు, జూనియర్ వైద్యులకు అవగాహన కల్పించేందుకు సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఈ నెల 18, 19 తేదీలలో కంటిన్యువస్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీఎంఈ), వర్క్‌షాప్ నిర్వహించారు. ఇందులో భాగంగా పెల్విస్ ఎస్టెబ్యులర్ లైవ్ మరియు కెడావర్ శస్త్రచికిత్సలు ప్రత్యక్షంగా చేసి చూపించారు. దీనికి దేశవ్యాప్తంగా ఉన్న పలు నగరాల నుంచి సుమారు 200 మంది వైద్యులు హాజరయ్యారు. తొలిరోజు 18వ తేదీన కిమ్స్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి.భాస్కరరావు జ్యోతి ప్రజ్వలన చేసి, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొవిడ్ పరిస్థితి తర్వాత తొలిసారి లైవ్ సర్జరీ చేయడంతో ఇంత పెద్దస్థాయిలో స్పందన లభించింది. ఇలా చేయడం భారతదేశంలోనే ఇది మొదటిసారి. తొలిరోజు కార్యక్రమంలో వర్క్‌షాప్ ఆర్గనైజింగ్ ఛైర్మన్, సెక్రటరీ, కిమ్స్ ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మైనేని ఉదయ్‌కృష్ణ, కిమ్స్ ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ , విభాగాధిపతి డాక్టర్ ఐవీ రెడ్డి,
తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ (టోసా) అధ్యక్షుడు, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ పీఎన్‌వీఎస్ఎన్ ప్రసాద్, ట్విన్ సిటీస్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ (టీసీఓఎస్) అధ్యక్షుడు డాక్టర్ అల్వాల్ రెడ్డి, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల నుంచి పలువురు సీనియర్ ఫ్యాకల్టీ పాల్గొన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు 19వ తేదీన గాంధీ ఆస్పత్రికి వచ్చి కార్యక్రమంలో పాల్గొంటారు.
ఆర్థోపెడిక్ సర్జరీల పితామహుడిగా పేరొందిన ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ (ఐఓఏ) అధ్యక్షుడు డాక్టర్ రమేష్ కుమార్ సేన్ చండీగఢ్ నుంచి వచ్చి, స్వయంగా ఆయనే లైవ్, కెడావర్ సర్జరీలు చేయడంతో పాటు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెల్విస్, ఎస్టెబ్యులర్ శస్త్రచికిత్సలు చాలా సంక్లిష్టమని చెప్పారు. మూత్రపిండాల పైనుంచి ప్లేట్లు వేయాల్సి ఉంటుందని, అందువల్ల ఎముకల శస్త్రచికిత్స నిపుణులు, వాస్క్యులర్ సర్జన్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు అందరూ ఈ శస్త్రచికిత్సల్లో పాల్గొనాలని చెప్పారు. ఎక్కువ వేగంతో వెళ్లే వాహనాలు ప్రమాదానికి గురైనప్పుడు వాటిలో ముందు సీట్లలో ఉండేవారికి డ్యాష్‌బోర్డుకు మోకాలు తగిలితే ఆ వేగానికి, ఒత్తిడికి తుంటిఎముక విరుగుతుందన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత తక్కువ సమయంలోనే రోగిని ఆస్పత్రికి తరలించాలని, సాధారణంగా ప్రధాన రక్తనాళం దెబ్బతింటే నాలుగైదు గంటల్లో చనిపోతారని చెప్పారు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, లేదా తీసుకెళ్లిన తర్వాత మరణించే కేసుల్లో ఇలాంటివే ఉంటాయని వివరించారు. “ఆర్థోపెడిక్ శస్త్రచికిత్స నిపుణులుగా స్థిరపడాలని అనుకునేవాళ్లు ఎంఎస్, డీఎన్‌బీ చేసిన తర్వాత కనీసం ఐదారు కెడావర్ ప్రోగ్రాంలకు హాజరైన తర్వాత గానీ ప్రత్యక్షంగా తుంటి ఎముక, తొడ ఎముక సర్జరీలు చేయకూడదు. వీటిలో రక్తనాళాలు కూడా కలిసి ఉంటాయి కాబట్టి, అవి తెగిపోతే ఆపరేషన్ టేబుల్ మీదే రోగి చనిపోయే ప్రమాదం ఉంది. కనీసం ఐదారు కార్యక్రమాల్లో బాగా పాల్గొని, మంచి శిక్షణ పొందితే తప్ప అలాంటి సర్జరీలు చేయలేరు. చెయ్యి, మణికట్టు, కాలి సర్జరీలు చేయడం వేరు, పెల్విస్.. ఎస్టెబ్యులమ్ సర్జరీలు చేయడం వేరు. అందువల్ల పెద్ద నగరాల్లో నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలకు జూనియర్ వైద్యులు తప్పక హాజరుకావాలి” అని డాక్టర్ రమేష్ కుమార్ సేన్ వివరించారు.