ఇలా గడిపితే సమ్మర్ సూపర్!

మనం రోజూ తీసుకునే ఆహారం, ధరించే దుస్తులు, జీవన విధానంలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే మండే వేసవిని కూడా హాయిగా గడిపేయొచ్చు. అలాగని ఉష్ణ తాపాన్ని తట్టుకోవడానికి ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు, చల్లటి బీర్లు లాగించేస్తే పొట్టకి హాయి అనుకుంటే పప్పులో కాలేసినట్లే. అవి మీ దప్పికను తాత్కాలికంగా తీర్చగలవు. కానీ వాటివాడకం వల్ల అదనపు క్యాలరీలు పోగేసుకున్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవిలో పిల్లలకు ఎలాగూ సెలవులు ఉంటాయి కాబట్టి కుటుంబంతో కలసి ఆనందంగా గడిపేందుకు మంచి అవకాశం. సరిగా ప్లాన్ చేసుకుంటే సమ్మర్ ఎంత మాత్రం మిమ్మల్ని పెద్దగా బాధించదు.
గ్రీన్ టీ – ఈ వేసవిలో సాధారణమైన టీ కంటే గ్రీన్ టీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి. గ్రీన్ టీ మీ శరీర మెటబాలిజం పెరిగేలా చేస్తుంది. బరువు పెరగకుండా నిరోధిస్తుంది కూడాను.
సీఫుడ్ – తక్కువ క్యాలరీలు, ప్రోటీన్లు అధికంగా ఉండే సీ ఫుడ్ తీసుకోవడానికి వేసవి మంచి సీజన్. సాల్మన్, ట్యూనా, లాబ్ స్టర్ లాంటి చేపలను తినండి. డీప్ ఫ్రై కాకుండా లైట్ గా గ్రిల్ చేసినవైతే అన్ని విధాల మేలు.
అల్పాహారం – ఉదయం ప్రోటీన్లు, పిండిపదార్థాలు, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఉన్న అల్పాహారం తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్ ఫాస్ట్ చేయడం మానేయకండి.
తాజా పళ్లు – ఈ సీజన్ లో విరివిగా దొరికే అన్ని రకాల పళ్లు, కూరగాయలను మీ ఆహారంలో భాగం చేసుకోండి. దీంతో మీ శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు లభిస్తాయి.
స్నాక్స్ – రోజులో ఒకేసారి తినే కంటే కొద్ది మోతాదులో ఎక్కువసార్లు తినడం మంచిదనేది అందరూ అంగీకరించిన సంగతి. కాబట్టి పని చేసేటప్పుడు మధ్యలో కాస్త విరామం ఇచ్చి ఏదో ఒక చిరుతిండి తీసుకోండి. కనీసం రోజు మొత్తంలో అయిదారుసార్లు (బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ తో కలిపి) ఇలా చిరుతిండి రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
నీళ్లు- వేసవి వేడి కారణంగా శరీరం చెమట రూపంలో లవణాలను కోల్పోతూ ఉంటుంది. కాబట్టి వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగండి. కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ లాంటివి దాహం తీర్చడంతోపాటు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బయటికి వెళ్లేటప్పడు మీతోపాటు మంచినీళ్ల బాటిల్ తీసుకెళ్లడం మరువకండి.
* సాధ్యమైనంత వరకు ఉదయం 12 గంటలలోపు లేదా సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే బయటికి వెళ్లేలా చూసుకోండి. దీనివల్ల హానికరమైన అతి నీల లోహిత కిరణాల బారి నుంచి తప్పించుకునే వీలుంటుంది. ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం మరువకండి. అలాగే గొడుగు తీసుకెళ్లండి. లేదా టోపీ పెట్టుకోండి. దీనివల్ల కొంతైనా ఉపశమనం లభిస్తుంది.
* వ్యాయామానికి కూడా ప్రాధాన్యం ఇవ్వండి. అవకాశం ఉంటే పిల్లలతో పాటు మీరు కూడా స్విమ్మింగ్ లేదా టెన్నిస్ క్లాసులకు వెళ్లండి. దీనివల్ల మీ శరీరానికి మంచి వ్యాయామం చేసినట్లవుతుంది. ఫిట్ గా ఉండేందుకు తోడ్పడుతుంది.
* తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోండి. మసాలాలు, వేపుళ్లు తగ్గించండి.
* చెమటను తొందరగా పీల్చుకునే గుణం ఉన్న కాటన్ వస్త్రాలను ధరించండి. లేత రంగు దుస్తుల వల్ల మీపై ఎండ ప్రభావం తక్కువగా ఉంటుందని మరుకండి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article