హెర్నియాకు శ‌స్త్రచికిత్స మాత్ర‌మే మార్గం

* మందుల‌తో అది న‌యం కాదు
* లివ్‌లైఫ్ హాస్పిటల్‌ లాప్రోస్కొపిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ అంకిత్ మిశ్రా
హైద‌రాబాద్, మే 18, 2022: హెర్నియాను జీవ‌న‌శైలి మార్పుల‌తో న‌యం చేసుకోవ‌చ్చ‌ని చాలామంది భావిస్తారు. హెర్నియా డ్రాప్‌లు, హెర్నియా టీ, హెర్నియా పోష‌న్‌, హెర్నియా క్రీమ్ లాంటివి వాడితే చాల‌నుకుంటారు. మాన‌వ చ‌రిత్ర‌లోనే అత్యంత పురాత‌న వ్యాధుల్లో ఒక‌టైన హెర్నియా విష‌యంలో ఇప్ప‌టికీ అపోహ‌లు, దుర‌భిప్రాయాలు ఉన్నాయి.

ఈ విష‌య‌మై హైద‌రాబాద్‌లోని లివ్‌లైఫ్ హాస్పిటల్‌కు చెందిన ఏడ‌బ్ల్యుఆర్ మ‌రియు లాప్రోస్కొపిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ అంకిత్ మిశ్రా మాట్లాడుతూ, “ఎవ‌రికైనా ఉద‌ర కండ‌రాల్లో ఒక బ‌ల‌హీన‌మైన ప్రాంతం మీదుగా అవ‌య‌వాలు చ‌ర్మం కిందివైపు వ‌స్తే, దాన్నే హెర్నియా అంటారు. శ‌స్త్రచికిత్స‌లు, శారీర‌క శ్ర‌మ‌, ఊబ‌కాయం లేదా గ‌ర్భ‌ధార‌ణ వ‌ల్ల ఉద‌ర కండ‌రాలు బ‌ల‌హీన‌ప‌డితే ఇలాంటి ప‌రిస్థితి చోటుచేసుకుంటుంది. హెర్నియా చ‌ర్మం ఉప‌రిత‌లం మీద వాపులా క‌న‌ప‌డుతుంది. దాన్ని చేచ‌త్తో లోప‌ల‌కు తోయ‌చ్చు. ఎక్కువ‌గా పురుషుల‌కు ఈ స‌మ‌స్య ఏర్ప‌డుతుంది, వారికి వ‌చ్చేవాటిలో 90% గ‌జ్జ‌కు సంబంధించిన‌వే అవుతాయి” అన్నారు.

ఇందులో కొద్దిపాటి నుంచి తీవ్ర‌మైన నొప్పి వ‌ర‌కు ఉంటుంది. కొద్దిపాటి అసౌక‌ర్యం ఏర్ప‌డ‌టం నుంచి ప్రాణాపాయం వ‌ర‌కు ఉండే ఈ హెర్నియా విష‌యంలో స‌రైన స‌మ‌యానికి చికిత్స పొందాలి.

హెర్నియా చికిత్స‌లో శ‌స్త్రచికిత్స ప్రాధాన్యం గురించి డాక్ట‌ర్ మిశ్రా చెబుతూ, “ఉద‌ర కుహ‌రంలో రంధ్రం త‌నంత‌ట తానే మూత‌ప‌డ‌దు. దాన్ని శ‌స్త్రచికిత్స చేసి మూయాలి. త‌ర్వాత మెష్ అనే ఒక ప‌రిక‌రంతో ఉద‌ర‌కోశాన్ని బ‌లోపేతం చేయాలి. అందువ‌ల్ల జీవ‌న‌శైలి మార్పులు, మందుల వ‌ల్ల హెర్నియా బాగ‌వ్వ‌దు, శ‌స్త్రచికిత్స ఒక్క‌టే దానికి ఉన్న చికిత్స” అని వివ‌రించారు.

“మెష్ అనేది అధునాతన, బాగా పరిశోధించిన సింథటిక్ లేదా సెమీ-సింథటిక్ జీవ పదార్థం. ఇది హెర్నియా మ‌ళ్లీ రాకుండా ఆపేందుకు ఉద‌ర‌కోశంలోని బలహీనమైన కణజాలాలకు మ‌ద్ద‌తుగా ఉంటుంది. సుమారు ఐదు దశాబ్దాల క్రితం క‌నుగొన్న ఈ మెష్‌.. ఇప్పుడు హెర్నియా శస్త్రచికిత్స, సంరక్షణలో అద్భుతంగా ఉప‌యోగ‌ప‌డుతోంది. హెర్నియా శ‌స్త్రచికిత్స‌లో మెష్ మూల‌స్తంభం లాంటిది. దీని నాణ్య‌త విష‌యంలో ఏమాత్రం రాజీప‌డినా చికిత్స ఫ‌లితాన్ని అది దెబ్బతీస్తుంది. హెర్నియాకు చికిత్స చేయడం అంటే కేవ‌లం అంత‌రాన్ని మూసేయ‌డం మాత్ర‌మే కాదు. మాన‌వ శ‌రీరంలో అత్యంత కీల‌క‌మైన ఉద‌ర వ్య‌వ‌స్థ స‌మ‌గ్ర‌త‌ను పున‌రుద్ధ‌రించాల‌ని, వీలైనంత ఉత్త‌మ ఫ‌లితాలను అందించాల‌ని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము” అని డాక్టర్ మిశ్రా చెప్పారు.

హెర్నియా శస్త్రచికిత్స‌లో మూడు ర‌కాలున్నాయి. అవి.. సాధార‌ణ శ‌స్త్రచికిత్స‌, లాప్రోస్కొపిక్ శ‌స్త్రచికిత్స లేదా రోబోటిక్  లాప్రోస్కొపిక్ శ‌స్త్రచికిత్స. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతుండ‌టంతో, చాలా మంది సర్జన్లు ఆధునిక లాప్రోస్కొపిక్ శస్త్రచికిత్స లేదా కీహోల్ శస్త్రచికిత్సను ఇష్టపడతారు. సాధార‌ణ శ‌స్త్రచికిత్స‌ల‌తో పోలిస్తే ఇందులో చేసే కోత చాలా చిన్న‌ది. దీనివ‌ల్ల రోగి త్వ‌ర‌గా కోలుకుంటారు, ఇన్ఫెక్ష‌న్ వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌, రోగికి నొప్పి కూడా చాలా త‌క్కువ‌గా ఉంటుంది. రోబోటిక్ శ‌స్త్రచికిత్స అత్యంత క‌చ్చిత‌మైన‌ది, మంచి ఫ‌లితాలు వ‌స్తున్నాయి గానీ, అందులో ఖ‌ర్చును మాత్రం ఇంకా పూర్తిగా అదుపు చేయ‌లేక‌పోతున్నారు.

ఇది సాధారణ ఏకాభిప్రాయం అయినా, ప్రతి రకమైన శస్త్రచికిత్సలో కొన్ని లాభ‌న‌ష్టాలు ఉంటాయి. ప్ర‌తి కేసును బ‌ట్టి వారి స‌ర్జ‌న్ మాత్ర‌మే ఏ ర‌క‌మైన శ‌స్త్రచికిత్స చేయాలో బాగా నిర్ణ‌యించ‌గ‌ల‌రు. శ‌స్త్రచికిత్స చేసిన త‌ర్వాత తీసుకోవాల్సిన సంర‌క్ష‌ణ కూడా హెర్నియా చికిత్స‌లో చాలా ముఖ్యం. నిర్దిష్ట‌మైన ఆహారం తీసుకోవాల‌ని, శారీర‌క శ్ర‌మ వ‌ద్ద‌ని, కోత ప‌డిన‌చోట జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కూడా మీ డాక్ట‌ర్ మీకు సూచించే అవ‌కాశ‌ముంది. కానీ.. క‌ణ‌జాలం బ‌ల‌హీనంగా ఉండ‌టం, కోలుకోడానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌డం, ఊబకాయం, ధూమ‌పానం లాంటి ముప్పు కార‌ణాల వ‌ల్ల శ‌స్త్రచికిత్స అయిన త‌ర్వాత కూడా మ‌రోసారి హెర్నియా వ‌చ్చే అవ‌కాశం ఉంది.

గ‌మ‌నిక‌: ఇందులో వ్య‌క్తం చేసిన అభిప్రాయాల‌న్నీ డాక్ట‌ర్ అంకిత్ మిశ్రా సొంత, స్వ‌తంత్ర అభిప్రాయాలు మాత్ర‌మే. ఇది సాధార‌ణ స‌మాచారం. అవ‌గాహ‌న కోసం మాత్ర‌మే వీటిని తెలియ‌జేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article