Taskforce to demolish illegal buildings
తెలంగాణ రాష్ట్రంలో అక్రమ వెంచర్లు, నిర్మాణాల్ని కూల్చివేయడానికి ప్రతి జిల్లాలో ప్రత్యేక టాస్క్ ఫోర్సును నియమించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో పని చేసే ఈ బృందంలో రెవెన్యూ, పోలీసు, ఫైర్, ఆర్ అండ్ బీ అధికారులు సభ్యులుగా ఉంటారు. ప్రతి జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో జరిగే నిర్మాణ కార్యకలాపాల ఆధారంగా బృందాల సంఖ్యను ఆయా జిల్లా కలెక్టర్ నిర్ణయిస్తారు.
- టీఎస్ బీపాస్ పోర్టల్, కాల్ సెంటర్లు, మొబైల్ యాప్, ట్విట్టర్, ఈమెయిళ్ల ద్వారా ప్రతి జిల్లాలో అక్రమ నిర్మాణాల ఫిర్యాదుల్ని టాస్క్ ఫోర్స్ స్వీకరిస్తుంది. మూడు రోజుల్లోనే ఆయా ఫిర్యాదులపై క్షుణ్నంగా అధ్యయనం చేస్తుంది. నిర్మాణాల్ని స్వయంగా తనిఖీ చేసి, ఎలాంటి నోటీసు లేకుండానే వాటిని కూల్చివేస్తుంది.
- అనధికార లేఅవుట్లు, అక్రమ నిర్మాణాల గురించి కార్పొరేషన్లు, మున్సిపాలిటీల నుంచి ప్రతి జిల్లాలోని టాస్క్ ఫోర్స్ విభాగం సమాచారాన్ని సేకరిస్తుంది. ఆయా అక్రమ నిర్మాణాని కూల్చివేయడానికి అవసరమయ్యే ఖర్చుల్ని సంబంధిత ఇంటి యజమాని నుంచి వసూలు చేస్తుంది.
ఇలా కూల్చివేస్తారు..
అక్రమ లేఅవుట్లు లేదా నిర్మాణాల్ని కూల్చివేసే ముందు పంచనామా నిర్వహిస్తారు. ఆయా నిర్మాణం ఏ స్థాయిలో ఉన్నది? స్థానిక సంస్థ నుంచి అనుమతి తీసుకున్నారా? నిబంధనల్ని అతిక్రమిస్తే అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోను తీస్తారు. అట్టి పంచనామా నివేదికను సంబంధిత ఇంటి యజమానికి అందజేస్తారు.
- అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలకు సంబంధించిన పూర్తి వివరాల్ని జిల్లా టాస్క్ ఫోర్స్ బృందం రిజిస్ట్రేషన్ శాఖ నుంచి తీసుకుంటుంది. వాటిని నిషేధిత జాబితాలో పొందుపరుస్తుంది. వాటికి మంచినీరు, విద్యుత్ సరఫరాను తాత్కాలిక లేదా శాశ్వతంగా అందించకూడదని ఆయా విభాగాలకు సమాచారం అందజేస్తుంది. ప్రతి పదిహేను రోజులకోసారి ఈ బృందం నిర్మాణాల్ని తనిఖీ చేసి కూల్చివేత ప్రక్రియను సమీక్షిస్తుంది. ఎవరైనా తరుచూ అక్రమ నిర్మాణాల్ని చేపడుతున్నారని టాస్క్ ఫోర్స్ బృందం గుర్తిస్తే.. అట్టి వ్యక్తికి నిర్మాణం చేపట్టే స్థలం విలువలో పావు శాతం జరిమానా విధిస్తుంది. పూర్తి స్థాయిలో పంచనామా నిర్వహించి మూడేళ్ల వరకూ జైలు శిక్షను విధిస్తారు.