Tata Motors Gained Losses …. ఎందుకంటే
మోటార్ వాహనాల రంగంలో ఒకప్పుడు రారాజుగా వెలిగిన టాటా మోటార్స్ కుదేలైంది. కంపెనీ చరిత్రలోనే ఒక్క త్రైమాసికంలో ఇంతటి భారీ నష్టాలు రావడం తొలిసారి. ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్స్ ముగిసేనాటికి దాదాపు రూ.27వేల కోట్ల నష్టాలు వచ్చాయని కంపెనీ యాజమాన్యం తెలిపింది. గత క్యూ3లో రూ.1,215 కోట్ల నికర లాభం రాగా, ఈ క్యూ3లో రూ.26,961 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్) వచ్చాయని టాటా మోటార్స్ తెలిపింది. కొద్ది నెలల కిందట జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ కార్ల కంపెనీని కొనుగోలు చేయడమే ఇందుకు కారణంగా కనిపిస్తుంది. భారీగా పెట్టుబడులు పెట్టిన జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) వన్‌టైమ్ అసెట్ ఇంపెయిర్మెంట్కు రూ.27,838 కోట్ల వరకూ నష్టాలు వచ్చాయని వివరించింది. మరోవైపు జాగ్వార్ బ్రాండ్ అమ్మకాలు 9 శాతం, ల్యాండ్ రోవర్ అమ్మకాలు 12 శాతం చొప్పున తగ్గాయి. జేఎల్ఆర్ మూలధన పెట్టుబడులకు సంబంధించిన పుస్తక విలువను తగ్గించడానికి ఈ అసాధారణమైన వ్యయాన్ని ప్రకటించామని జేఎల్ఆర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాల్ఫ్ స్పెత్ తెలిపారు. చైనాలో అమ్మకాలు తగ్గడం, తరుగుదల అధికంగా ఉండటం, పెట్టుబడి వ్యయాల అమోర్టైజేషన్ కారణంగా ఈ స్థాయి నికర నష్టాలు వచ్చాయని వివరించారు. వాహన పరిశ్రమ మార్కెట్, సాంకేతిక, విధాన సంబంధిత సమస్యలను ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. అంతే కాకుండా కొత్త మోడళ్లు, విద్యుదీకరణ, ఇతర టెక్నాలజీల కోసం పెట్టుబడులు భారీగా పెట్టాల్సి వస్తోందని వివరించారు.
టాటా ప్రొడక్ట్స్ దేశీయంగా బాగా అమ్ముడుపోతున్నాయని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తెలిపారు. తమ మార్కెట్ వాటా పెరుగుతోందని, లాభదాయక వృద్ది కూడా పెరుగుతోందని పేర్కొన్నారు. బ్రెగ్జిట్ విషయమై ఎలాంటి ఒప్పందం కుదరలేనందున ఇంగ్లాండ్‌లో జేఎల్ఆర్ ప్లాంట్లను 2నుంచి 3 వారాల పాటు మూసివేయాల్సి వస్తుందని టాటా మోటార్స్ తెలిపింది.