చలో ఆత్మకూరులో విజయం ఎవరిది?

TDP FIRST IN MEDIA

బాధితుల పోటాపోటీ శిబిరాలతో ఏపీలో హీటెక్కిన రాజకీయాలు.. బుధవారం తీవ్ర ఉద్రిక్తతలు సృష్టించాయి. అధికార, విపక్ష పార్టీలు పోటాపోటీగా చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని పోలీసులు ముందుస్తు వ్యూహాలతో భగ్నం చేయగలిగారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు చోటుచేసుకోకుండా చూడటంలో విజయం సాధించారు. వైఎస్సార్ సీపీ బాధితులంటూ తెలుగుదేశం పార్టీ.. టీడీపీ బాధితులంటూ వైఎస్సార్ సీపీ పోటాపోటీగా బాధిత శిబిరాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు పార్టీలూ బుధవారం చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఎక్కడికక్కడ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్టు చేశారు. అలా చలో ఆత్మకూరు భగ్నం చేశారు. అయితే, ఈ కార్యక్రమంలో విజయం తమదంటే తమదంటూ టీడీపీ, వైఎస్సార్ సీపీలు చెప్పుకుంటున్నాయి. వాస్తవానికి ఇందులో పైచేయి ఎవరిదని విశ్లేషిస్తే.. నిస్సందేహంగా తెలుగుదేశానిదే అనే జవాబు వస్తుంది. ఎందుకంటే మీడియాలో టీడీపీకి అనుకూలంగానే ఈ కార్యక్రమం ప్రసారమైంది.

ఒక్క తెలుగు ఛానళ్లలోనే కాదు.. ఏకంగా జాతీయ మీడియా సైతం టీడీపీ చలో ఆత్మకూరుపైనే దృష్టి పెట్టింది. ఇక్కడ దృష్టి పెట్టింది అనడం కంటే అలా పెట్టేలా చేయడంలో టీడీపీ పబ్లిసిటీ వింగ్ విజయం సాధించింది అంటే సరిపోతుందేమో. మినిట్ టు మినిట్ ఏం జరుగుతుందో అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు అటు హైదరాబాద్, ఢిల్లీల్లో ఉండే జాతీయ మీడియా చానళ్ల సిబ్బందికి చేరవేయడంతోపాటు పలు జాతీయ చానళ్ల సిబ్బంది ఉండవల్లి, ఆత్మకూరుకు తీసుకొచ్చింది. అంతేకాకుండా ప్యాకేజీ రూపంలో పెద్ద మొత్తం కూడా సమర్పించినట్టు సమాచారం. దీంతో రోజంతా ఈ అంశంపై జాతీయ మీడియా కథనాలు, బ్రేకింగ్ న్యూస్ లు వచ్చాయి. ప్రాంతీయ అంశాలను అంతగా పట్టించుకోని జాతీయ మీడియా.. టీడీపీ చేపట్టిన చలో ఆత్మకూరుకు ప్రాధాన్యత ఇవ్వడం చూస్తే.. తెర వెనుక ఏదో జరిగిందనే అనుమానాలు కలుగక మానవు. మొత్తమ్మీద ఈ ఎపిసోడ్ లో బాబు జాతీయ మీడియాలో సైతం హైలైట్ కాగా.. అధికార వైఎస్సార్ సీపీ తెలుగు మీడియాలో సైతం కనిపించలేదు. ఒక్క సాక్షి ఛానల్ మినహా మిగిలిన ఏ ఛానల్ లోనూ అనుకున్నంత ప్రచారం జరగలేదు. పైగా అది కూడా టీడీపీపై వ్యతిరేక ప్రచారం చేయడానికే ప్రాధాన్యత ఇచ్చి.. వైఎస్సార్ సీపీ చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని హైలైట్ చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో చలో ఆత్మకూరులో మీడియా పరంగా విజయం టీడీపీదే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article