ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

101
TDP MLAs SUSPENDED
TDP MLAs SUSPENDED

TDP MLAs SUSPENDED

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష సభ్యులపై తొలి వేటు పడింది. తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఏపీ శాసనసభ వాడివేడిగా ప్రారంభమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పింఛను విషయంలో స్పష్టతకు ఇవ్వాలంటూ టీడీపీ సభ్యుడు రామానాయుడు డిమాండ్‌ చేశారు. అయితే మేనిఫెస్టోలో అలాంటి హామీ ఇవ్వలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ జోక్యం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో తాను మాట్లాడిన వీడియోను సభలో ప్రదర్శించారు. తమ వద్దనున్న వీడియోను ప్రదర్శించడానికి టీడీపీ సభ్యులు అనుమతి కోరగా.. స్పీకర్ నిరాకరించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.

ఈ నేపథ్యంలో ఈ సమావేశాలు ముగిసేవరకు టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బుచ్చయ్య చౌదరిలను సస్పెండ్‌ చేయాలని మంత్రి బుగ్గన స్పీకర్‌కు ప్రతిపాదించారు. దీంతో వారిని సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ప్రకటించారు. అయినప్పటికీ టీడీపీ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లకుండా అక్కడే ఉండి నినాదాలు చేశారు. దీంతో మార్షల్స్‌ బలవంతంగా వారిని బయటకు తీసుకెళ్లిపోయారు. ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. సంఖ్యాబలం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తానంటే కుదరదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. తన రాజకీయ జీవితంలో తొలిసారి సస్పెండ్ అయ్యానని చెప్పారు. తమకు సమాధానం చెప్పలేకే ప్రభుత్వం పారిపోయిందని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. శాసనసభ మొత్తం సీఎం జగన్ కనుసన్నల్లో నడుస్తోందని నిమ్మల రామానాయుడు ఆరోపించారు. సభను వాళ్ల సొంత సభలా నిర్వహిస్తున్నారని విమర్శించారు. ప్రజల పక్షాన పోరాడుతుంటే గొంతు నొక్కుతున్నారని దుయ్యబట్టారు.

AP POLITICS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here