మైలవరంలో ముదురుతున్న టీడీపీ వైసీపీ రగడ

TDP VS YSRCP IN MYLAVARAM

ఏపీ రాజకీయాల్లో కృష్ణా జిల్లాలో తాజాగా నెలకొన్న వివాదం రాజకీయ దుమారం రేపుతుంది. మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సొంత నియోజకవర్గం మైలవరంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మైలవరం నియోజకవర్గంలో వైసీపీ నేత ఒకరు పోలీసులకు లంచం ఆఫర్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. వైసీపీ మైలవరం నియోజకవర్గ ఇన్‌చార్జి వసంత కృష్ణప్రసాద్ అనుచరుడు మాగంటి వెంకట రామారావు తమకు లంచం ఇవ్వబోయారంటూ కొందరు ఎస్‌ఐలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటన కృష్ణాజిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసు వ్యవహారం మరోసారి దేవినేని ఉమ వర్సెస్ వసంత కృష్ణప్రసాద్‌గా మారింది.
కంచికచర్ల మండలం నెక్కలంపేట గ్రామానికి చెందిన మాగంటి వెంకట రామారావు తాను మైలవరం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్‌ అనుచరుడినంటూ నిన్న ఉదయం మైలవరం, జి.కొండూరు, రెడ్డిగూడెం ఎస్సైలకు ఫోన్‌ చేశాడు. ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పనిచేయాలని కోరాడు. ఆ తర్వాత నేరుగా ఆయా పోలీస్‌ స్టేషన్లకు వెళ్ళి ఎస్సైలకు నగదు ఉంచిన కవర్లు ఇవ్వబోయాడు. ముగ్గురు ఎస్సైలు తిరస్కరించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై మైలవరం, రెడ్డిగూడెం, జి.కొండూరు ఎస్‌ఐలు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా వెంకట రామారావుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అయితే..,మంత్రి దేవినేని ఉమా ఒత్తిళ్ల కారణంగానే తమపై తప్పుడు కేసు పెట్టారని వైసీపీ నేత వసంత కృష్ణప్రసాద్ ఆరోపించారు. వైసీపీ శ్రేణులపై తప్పుడు కేసులు బనాయిస్తున్న మైలవరం సీఐపై డీఎస్పీకి ఫిర్యాదు చేశాయడంతో ఇప్పుడు లంచం కేసు తమపై పెట్టారని ఇలా చేస్తున్నారని అంటున్నారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పోలీసులను పావుగా చేసుకొని వైసీపీ నేతలను వేధిస్తున్నారని వసంత కృష్ణప్రసాద్ అన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article